logo

సాయంలో వివక్ష.. పరిహారంలో పరీక్ష

గోదావరి వరదలు విలీన మండలాలను ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆదుకుంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం పరిహారం పంపిణీలో వివక్ష చూపుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 29 Jan 2023 03:19 IST

తప్పులతడకలుగా వరద సర్వేలు
అధికార పార్టీ నాయకులపై బాధితుల ధ్వజం

గన్నేరుకొయ్యల పాడులో పునరావాస కేంద్రానికి సామగ్రి తరలిస్తున్న బాధితులు

ఎటపాక, న్యూస్‌టుడే: గోదావరి వరదలు విలీన మండలాలను ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆదుకుంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం పరిహారం పంపిణీలో వివక్ష చూపుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపు బారిన పడి బిక్కుబిక్కుమంటూ అడవుల్లోనే నెలల తరబడి గడిపామని గుర్తుచేస్తున్నారు. ఆ సమయంలో అందిన తక్షణ సహాయం అంతంతమాత్రమే. నిత్యావసరాలు, తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులు ముంపునకు గురికావడం, వారాల తరబడి వరద ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. ఈనేపథ్యంలో ఎటపాక మండలంలోని 13 గ్రామ సచివాలయాల పరిధిలో 329 ఇళ్లు పూర్తిగా, 657 పాక్షికంగా దెబ్బతిన్నాయి.

వరద తగ్గినా బాధితులకు ఇబ్బందులు తగ్గలేదు. తడి ఆరేందుకు రెండు వారాలు పట్టింది. ఇళ్లన్నీ మట్టితో నిండిపోయాయి. వాటిని శుభ్రం చేసుకునేందుకు వేలల్లో ఖర్చు పెట్టారు. గన్నేరుకొయ్యలపాడు శివారు రెండు వీధుల్లో ఇళ్లన్నీ ముంపునకు గురయ్యాయి. సుమారు 120 కుటుంబాల వారు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారుల సర్వేలో కేవలం ఆరిళ్లు మాత్రమే దెబ్బతిన్నట్లు చూపారు. వరదలకు సర్వం కోల్పోయిన తమపట్ల అధికారుల తీరు విడ్డూరంగా ఉందని బాధితులు చెబుతున్నారు. ఓ వైపు వరదలు నష్టాన్ని మిగిలిస్తే అధికారులు తీరుతో సాయం అందకుండా పోతోందంటున్నారు.


స్వచ్ఛంద సంస్థలే నయం

వరదల సమయంలో ప్రభుత్వం కంటే స్వచ్ఛంద సేవా సంస్థలే తమకు ఎక్కువ సహాయం అందించినట్లు బాధితులు చెబుతున్నారు. నెల్లాళ్ల పాటు వరదలో ఉండటంతో ఇళ్ల నిండా చెత్తా చెదారం, మట్టి పేరుకుపోయాయి. ఇళ్లు కుంగిపోయి నెర్రలు ఏర్పడ్డాయి. ఇవన్నీ సర్వే చేసినా పరిహారానికి నోచుకోలేదు.


బ్యాంకులకెళితే నిరాశే..!

తాజాగా ప్రభుత్వం వరద సాయం బాధితుల బ్యాంకు ఖాతాల్లో రూ.10వేలు నగదు జమ చేసింది. దానికోసం ఆశగా బ్యాంకులకు వెళ్లిన లబ్ధిదారులకు నిరాశ ఎదురైంది. కొందరికి నగదు జమ కావడం, మరికొందరికి కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సాయం అందించడానికి, సర్వేల సమయంలో పలు గ్రామాల్లో సచివాలయ ఉద్యోగులు అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు చేశారని, అర్హులకు మొండిచెయ్యి చూపించారని పలువురు ఆరోపిస్తున్నారు.

నాలుగు వారాలు ముంపులోనే: వరదలకు మా ఇల్లు నాలుగు వారాలు ముంపులోనే ఉంది. పునరావాస కేంద్రాల్లో నానా ఇబ్బందులు పడ్డాం. సర్వే చేశారు, నగదు జమ కాలేదు. ఇళ్లు శుభ్రం చేసుకునేందుకు పదిహేను వేలు ఖర్చయ్యింది. కనీసం సాయం అందినా బావుండేది. అధికారుల నిర్లక్ష్యంతోనే సాయం కోల్పోయా.

నాగమణి, గన్నేరుకొయ్యలపాడు


సర్వే ఎందుకు చేశారూ:

వరదలకు ఇళ్లు మునిగిపోయాయి. సచివాలయ సిబ్బంది నన్ను ఇంటి ముందు పెట్టి ఫొటో తీసుకున్నారు. పరిహారం నమోదు అయిందని చెప్పారు. తీరా ఇప్పుడు నగదు జమ కాలేదు. కావాలనే తొలగించారా?, ఎందుకు సర్వే చేశారు. వరద సాయం అందించాలి.

ములకలపల్లి వెంకటేశ్వర్లు, బాధితుడు


అన్నీ ఉన్నతాధికారులకు పంపాం

సర్వే చేసి నమోదు చేసిన ఇళ్లన్నీ ఉన్నతాధికారులకు పంపాం. అర్హత ఉన్న వాటన్నింటికీ నగదు జమైంది. పరిస్థితిని పరిశీలించి, సమస్యను ఉన్నతాధికారులకు నివేదిస్తాం.

ప్రసాద్‌, హౌసింగ్‌ ఏఈ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని