logo

ముందే గుర్తిద్దాం..మహమ్మారిని జయిద్దాం

అనకాపల్లి సమీపంలోని తుమ్మపాల గ్రామానికి చెందిన నాగమణి గృహిణి. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది.     వైద్య పరీక్షలు చేస్తే ఆమెకు గర్భాశయ క్యాన్సర్‌ అని తేలింది.

Updated : 04 Feb 2023 04:01 IST

క్యాన్సర్‌ అవగాహన దినం నేడు
నెహ్రూచౌక్‌ (అనకాపల్లి), అనకాపల్లి పట్టణం న్యూస్‌టుడే

స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తున్న వైద్యులు

* అనకాపల్లి సమీపంలోని తుమ్మపాల గ్రామానికి చెందిన నాగమణి గృహిణి. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది.     వైద్య పరీక్షలు చేస్తే ఆమెకు గర్భాశయ క్యాన్సర్‌ అని తేలింది. ఇది ప్రాథమిక దశలో ఉండటంతో వైద్యులు కీమోథెరపీ, రేడియేషన్‌ ద్వారా ఆమెను బతికించారు. కుటుంబ సభ్యులతో ఆమె ఇప్పుడు ఆనందంగా జీవిస్తోంది.

* పట్టణంలో శారదానగర్‌కు చెందిన నారాయణరావు ప్రైవేటు ఉద్యోగి. ఇతని సంపాదనే కుటుంబానికి మూలాధారం. అనుకోకుండా ఒకరోజు అనార్యోగం పాలయ్యాడు. చాలా ఆసుపత్రులు తిప్పి సమయం వృథా చేశారు. చివరకు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ అని తేలింది. ఈ విషయం తెలిసే సమయానికి క్యాన్సర్‌ ఆఖరిదశలో ఉండడంతో వైద్యులు ఎంత ప్రయత్నించినా ఉపయోగం ఆయన ప్రాణాలు దక్కలేదు. ఇంటికి పెద్దదిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం ఇప్పుడు రోడ్డు పాలైంది.  

వాతావరణం కాలుష్యం, మారుతున్న ఆహారపు అలవాట్లు, మారిన జీవన విధానం.. కారణాలేవైనా క్యాన్సర్‌ మహమ్మారి వ్యాప్తి పెరుగుతోంది. ఆరోగ్యంగా ఉంటున్న వారిలోనూ ఒక్కసారిగా వ్యాధి లక్షణాలు బయటపడుతుండటం అందరిలోనూ ఆందోళన కలిగిస్తుంది. వ్యాధిని సకాలంలో గుర్తించి తగిన వైద్య సేవలు అందిస్తే ఈ మహమ్మారి నుంచి బయటపడవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఒకప్పుడు క్యాన్సర్‌ నూటిలో ఒకరో ఇద్దరికో వచ్చేది. కాని నేటి పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ప్రజల్లో ఈ వ్యాధిపై అవగాహన పెంపొందించడానికి, నివారణ, గుర్తింపు, చికిత్సను ప్రోత్సహించేందుకు యూనియన్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ యూనియన్‌ క్యాన్సర్‌ కంట్రోల్‌ (యూఐసీసీ) సంస్థ ఏటా ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. ఈ వ్యాధి గురించి అవగాహన పెంచడం ద్వారా ప్రతి సంవత్సరం మిలియన్ల మంది జీవితాలను రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.

* జిల్లాలో ప్రతి ఏటా 450 నుంచి 600 మంది వరకు క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. వీరిలో 40 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఉమ్మడి జిల్లాలో పురుషుల్లో నోరు, ఊపిరితిత్తులు, రక్తం, జీర్ణాశయం, పెద్దపేగు, గొంతు క్యానర్లు ఎక్కువ. స్త్రీలలో రొమ్ము, గర్భాశయ ముఖద్వారం, అండాశయ, నోటి క్యాన్సర్లు ఎక్కువ.  పురుషుల్లో పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల 30 శాతం, మద్యపానం తీసుకోవడం వల్ల 19 శాతం వ్యాధి బారినపడుతున్నారు. ఇక స్త్రీలలో చిన్న వయసులో వివాహం, సంతానం లేని వారికి,  పిల్లలకు పాలు ఇవ్వని వారికి, గర్భనిరోధక మాత్రలు వాడే వారిలో గర్భాశయ ముఖద్వార, ఎండోమెట్రియం, రొమ్ము క్యాన్సర్లు రావొచ్చు. మెనోపాజ్‌ తర్వాత బరువు ఎక్కువగా పెరిగిన మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ ముప్పు ఎక్కువ. అనకాపల్లి జిల్లాలో 2021 అక్టోబరు 2 నుంచి జిల్లా వ్యాప్తంగా ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలతో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నారు. 30 ఏళ్ల దాటిన మహిళల ఆరోగ్య పరిస్థితులను బట్టి క్యాన్సర్‌ లక్షణాలుంటే చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.

* అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ కేంద్రం ఏర్పాటుచేశారు. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో అనుమానితులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించి ఇక్కడ పెథాలజిస్టుతో పరీక్షలు చేయించి క్యాన్సర్‌ అని నిర్థారణ అయితే అగనంపూడి ఆసుపత్రి లేదా కేజీహెచ్‌కి చికిత్స నిమిత్తం పంపుతున్నారు.
* అనకాపల్లి కేంద్రం నుంచి 27 మందికి రొమ్ము క్యాన్సర్‌ ఉన్నట్లు ముందుగానే గుర్తించి వారికి చికిత్స అందిస్తున్నారు. గైనిక్‌ సమస్యలతో ఏడుగురికి వ్యాధి ఉన్నట్లుగా గుర్తించారు.
* నోటి క్యాన్సర్‌ బాధితులు సంఖ్య పెరుగుతోంది. సిగరెట్‌, మద్యం, ఖైనీ, గుట్కాలు తింటూ క్యాన్సర్‌ని కొని తెచ్చుకుంటున్నారు. పొగాకు నియంత్రణ విభాగం, డీ ఎడిక్షన్‌ కేంద్రాల్లో బాధితులకు పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స అందిస్తున్నారు.
అనుమానితులను ముందే గుర్తించేలా క్యాన్సర్‌లో చాలా రకాలు ఉన్నాయి. మన జిల్లాలో మహిళలకు ఎక్కువగా రొమ్ము,, గర్భ సంచి ముఖద్వార, గొంతు క్యాన్సర్‌ ఎక్కువగా ఉంటున్నాయి. వ్యాధిని సకాలంలో గుర్తించి తగిన వైద్య పరీక్షలు అందిస్తే ఫలితాలు ఉంటాయి. దీంట్లో భాగంగా గత ఏడాది అక్టోబరు 2 నుంచి జిల్లాలో రోగులను గుర్తించే సర్వే నిర్వహిస్తున్నాం. ప్రతి లక్షమందిలో 1000 మంది అనుమానితులను గుర్తించి వీరికి స్క్రీనింగ్‌ పరీక్షలు చేయిస్తున్నాం. ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమంలో ఆరోగ్య స్థితిపై ఎప్పటికప్పుడు పరిశీలన చేసి మహమ్మారిని ముందే గుర్తించి తగిన వైద్య సేవలు అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
 డాక్టర్‌ హేమంత్‌, డీఎంహెచ్‌ఓ


తగిన వైద్యంతో నివారణ

క్యాన్సర్‌ బాధితులను గుర్తించి వీరికి స్క్రీనింగ్‌ చేయించడానికి అనకాపల్లి ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశాం. ఇక్కడ పెథాలజిస్టు డాక్టర్‌ కనకదుర్గ పరీక్షలు చేస్తారు. వ్యాధి నిర్ధారణ అయితే వారికి తగిన వైద్య సేవలు అందించడంతోపాటు పర్యవేక్షిస్తాం. జిల్లా నుంచి వచ్చే హైరిస్క్‌ అనుమానితులకు ఇక్కడ పరీక్షలు చేస్తున్నాం. అనకాపల్లిలోనే బయాప్సీ పరీక్ష చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. అనుమానిత లక్షణాలు ఉన్నవారు వెంటనే ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోవాలి. వ్యాధిని ముందుగానే గుర్తిస్తే తగిన వైద్యంతో నివారించవచ్చు.
 డాక్టర్‌ అచ్యుతకుమారి, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని