logo

దివ్యాంగులకు వాహన యోగం

విద్యావంతులైన దివ్యాంగులు రాకపోకలు సాగించేందుకు ఇన్నాళ్లూ ఎదుర్కొన్న ఇబ్బందులు తొలగనున్నాయి.

Published : 06 Feb 2023 02:58 IST

విద్యావంతులకు ఉచితంగా మూడు చక్రాల బళ్లు
న్యూస్‌టుడే, నర్సీపట్నం, అనకాపల్లి గ్రామీణం

దివ్యాంగులు

విద్యావంతులైన దివ్యాంగులు రాకపోకలు సాగించేందుకు ఇన్నాళ్లూ ఎదుర్కొన్న ఇబ్బందులు తొలగనున్నాయి. ప్రయాణ సమయంలో ఎదురయ్యే ఇక్కట్ల నుంచి ఊరట లభించేలా వీరికి స్కూటీ తరహా మూడు చక్రాల మోటారు వాహనాలను ఉచితంగా అందజేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

* ఉద్యోగం చేసే వారు, స్వయం ఉపాధి పొందుతున్న దివ్యాంగుల్లో కొద్దిమందే మూడు చక్రాల వాహనాలపై రాకపోకలు సాగిస్తున్నారు. వైకల్యంతో నడవ లేని స్థితిలో ఉన్న వీరు పనులపై అటు ఇటు వెళ్లిరావడానికి అవస్థలు పడాల్సి వస్తోంది. ఇలాంటి వారికి సకాలంలో పనులు చక్కబెట్టుకునేందుకు వీలుగా స్కూటీలను అందజేయనున్నారు.

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ దివ్యాంగులు చదువులో రాణిస్తున్నారు. అనేక మంది ఉద్యోగాలు చేస్తున్నారు.

ఎవరు అర్హులు?: 70 శాతం వైకల్యం ఉండి, 18 నుంచి 45 ఏళ్లలోపు వయసున్న వారు ఈ వాహనాలు పొందేందుకు అర్హులు. కనీస విద్యార్హత పదో తరగతిగా నిర్ణయించారు. డిగ్రీ, పీజీ చేసిన వారి ఉద్యోగం, స్వయం ఉపాధి తదితర స్థాయిల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.

152 మంది దరఖాస్తు: జిల్లాలో విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సహాయ సంస్థ ఇప్పటికే స్కూటీలకు అర్హులైన వారి నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. అనకాపల్లి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి 152 మంది దరఖాస్తు చేశారు. ఉన్నతాధికారుల కమిటీ పరిశీలించి అర్హులను ఎంపిక చేయనుంది.

* అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రిలో మంగళవారం ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ఆధార్‌ కార్డు, కుల, సదరం, వైద్య సంబంధ ధ్రువపత్రాలు, పదో తరగతి మార్కుల జాబితా, వైకల్యం కనిపించేలా రెండు ఫొటోలతో హాజరుకావాలి.

* మరికొందరు స్వయం ఉపాధితో ముందుకు సాగుతున్నారు. ప్రత్యేక అవసరాలున్న వారికి చాలా కాలంగా మూడు చక్రాల సైకిళ్లు మాత్రమే ఉచితంగా లభిస్తున్నాయి. వీరిలోనూ విద్యాధికులు ఎక్కువగా ఉండటం, వారంతా దూరప్రాంతాలకు వెళ్లిరావడం ఇబ్బందిగా ఉంటోంది. ఇలాంటి వారందరికీ ఉపశమనం కలిగించాలన్న లక్ష్యంతో పాలకులు మూడు చక్కాల మోటారు వాహనాలను అందిస్తున్నారు.

జిల్లాకు 70 వాహనాలు: విద్యావంతులైన దివ్యాంగులకు పంపిణీ చేసేందుకు ఒక్కో నియోజకవర్గానికి పది చొప్పున ఏడు నియోజకవర్గాలకు 70 స్కూటీలను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో 18 వాహనాలు ఇప్పటికే పంపిణీ చేశారు. మొత్తం వాహనాల్లో 50 శాతం మహిళలకు కేటాయించనున్నారు. ఒక్కో వాహనం ధర రూ.94 వేలకుపైగా ఉంటుంది.

నియోజకవర్గానికి పది చొప్పున..: చదువుకుంటున్న దివ్యాంగులకు ఈ మోటారు వాహనాలతో ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. దరఖాస్తు చేసుకున్న 152 మందికి ఈ నెల 7న అనకాపల్లిలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాం. సంయుక్త కలెక్టర్‌, రవాణా సంస్థ, మహిళా సంక్షేమం, సాంఘిక సంక్షేమం తదితర శాఖల ఉన్నతాధికారులు అర్హులను ఎంపిక చేస్తారు. 70 మంది కంటే ఎక్కువ మంది అర్హులు ఉంటే.. వారికీ వాహనాలు అందజేయాలని ఉన్నతాధికారులను కోరతాం.

జగదీష్‌, సహాయ సంచాలకుడు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని