logo

నాడు రమ్మంటే రాలే.. నేడు పొమ్మంటే పోలే!

సాగు ఆరంభంలో వరద మిగిల్చిన ఒండ్రు వేడిలో మొక్క బతకడానికి వర్షం కోసం ఆకాశం వంక ఆశగా చూసిన సాగుదారులు.. నేడు చేతికందిన పంటను పాడుచేయకంటూ అదే ఆకాశం వైపు ఉరిమి చూస్తున్నారు.

Published : 21 Mar 2023 01:20 IST

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే

చొక్కనపల్లిలో మిర్చిని ఆరబెడుతున్న కర్షక కుటుంబం

సాగు ఆరంభంలో వరద మిగిల్చిన ఒండ్రు వేడిలో మొక్క బతకడానికి వర్షం కోసం ఆకాశం వంక ఆశగా చూసిన సాగుదారులు.. నేడు చేతికందిన పంటను పాడుచేయకంటూ అదే ఆకాశం వైపు ఉరిమి చూస్తున్నారు. భూమిపుత్రుల సాగుకు అండగా, అనుకూలంగా వర్షాలు, వాతావరణాన్ని అందివ్వాల్సిన ప్రకృతి వైరిపక్షాన చేరినట్లు ఆరుగాలం కష్టించిన పంటను పాడు చేస్తోంది. మొక్కలు బతకడానికి అదనపు ఖర్చుతో ఆయిల్‌ ఇంజిన్ల సాయంతో పొలాలకు నీరందించారు. తెగుళ్లను అధిగమించి పంట చేతికంది సొమ్ము చేసుకునే సమయంలో అకాల వర్షం రైతన్న నడ్డి విరుస్తోంది.

నాలుగు రోజులుగా కురుస్తున్న వానలతో వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. మండలంలో శుక్రవారం మబ్బులు కమ్మటంతో రైతులు మిర్చికుప్పలపై, లంక పొగాకు పాకలకు మైకా కవర్లు కప్పారు. చిన్న జల్లు కురవడంతో నష్టం జరగలేదు. శనివారం సాయంత్రం వరకు ఎండ కాయడంతో పంటలపై కప్పిన కవర్లు తొలగించారు. దీనికితోడు ఆది, సోమవారాల్లోనూ భారీ వర్షం కురవడంతో అప్పటివరకు రక్షించుకున్న పంటలు తడిచిపోయాయి. మిర్చిరైతులు ఇప్పటికే కొంత పంటను అమ్ముకున్నారు, లంక పొగాకు మాత్రం సాగుదశ ఇంకా పూర్తికాకపోవడం, అమ్మకాలు ప్రారంభం కాకపోవడంతో వేసిన పంటంతా రైతుల వద్దనే ఉండిపోయింది. మొక్కజొన్న వేసిన కొందరు రైతులకు తిప్పలు తప్పలేదు. అధికార యంత్రాంగం క్షేత్రస్థాయి పరిశీలన చేసి నష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని