logo

Gudivada Amarnath: గుడ్డు మంత్రి సీటు గుటుక్కు?

అధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 38 చోట్ల నియోజకవర్గ సమన్వయకర్తల మార్పులు, చేర్పులు చేసింది. వీరిలో ప్రస్తుతం మంత్రిగా ఉంటూ సీటు గ్యారంటీ లేనివారు ఎవరైనా ఉన్నారంటే గుడివాడ అమర్‌నాథ్‌ ఒక్కరే కనిపిస్తున్నారు. ఆయనతోపాటు మంత్రులుగా పనిచేస్తున్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఉషశ్రీ చరణ్‌లకు వేరే నియోజకవర్గాలు కేటాయించారు.

Updated : 06 Jan 2024 11:52 IST

అధిష్ఠానం గాల్లో ఉంచిన అమాత్యుడీయనే..!

పక్క చూపులూ ఫలించేలా లేవు!

ఈనాడు, అనకాపల్లి న్యూస్‌టుడే అనకాపల్లి పట్టణం: అధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 38 చోట్ల నియోజకవర్గ సమన్వయకర్తల మార్పులు, చేర్పులు చేసింది. వీరిలో ప్రస్తుతం మంత్రిగా ఉంటూ సీటు గ్యారంటీ లేనివారు ఎవరైనా ఉన్నారంటే గుడివాడ అమర్‌నాథ్‌ ఒక్కరే కనిపిస్తున్నారు. ఆయనతోపాటు మంత్రులుగా పనిచేస్తున్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఉష శ్రీచరణ్‌లకు వేరే నియోజకవర్గాలు కేటాయించారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కి స్థానచలనం కల్పించారు. మరో మాజీ మంత్రి పేర్ని నాని తన కుమారుడికి సీటు పదిలం చేసుకున్నారు. మరి ముఖ్యమంత్రి జగన్‌ చెప్పినట్టు తలూపే అమర్‌ విషయంలో మాత్రం ఇంకా ఊగిసలాట కొనసాగుతోంది. ఇప్పటికే  అనకాపల్లికి ఓ కొత్త వ్యక్తిని తీసుకువచ్చారు. అమర్‌ను మరోచోటుకు మార్చుతారా.. మొండిచేయి చూపుతారన్న విషయం తెలీక ఆయన వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. మంత్రి స్వయంకృతాపరాధం వల్లే ఈసారి టికెట్‌ చేజారిపోయే పరిస్థితి వచ్చిందంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ట్రోలింగులో ఈయనకే మొదటి స్థానం

ముఖ్యమంత్రి జగన్‌తో సత్సంబంధాలున్న ముఖ్యనేతల్లో అమర్‌నాథ్‌ ఒకరు.. అధినేత మెప్పు కోసం విపక్ష నేతలపై ప్రెస్‌మీట్లు పెట్టి అడ్డగోలుగా వాదించడం ఈయన నైజం. ప్రధానంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ప్రతి సందర్భంలోనూ విరుచుకుపడుతుండేవారు. వ్యక్తిగత విమర్శలు చేస్తుండేవారు. పవనే వచ్చి తనతో ఫొటో తీసుకున్నారని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఆ అతి ఇప్పుడు అమర్‌కు చేటు చేసింది. కాపులు ఎక్కువగా ఉన్న అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఈయన అదే సామాజికవర్గం నాయకుడు పవన్‌ కల్యాణ్‌పై ఇష్టాను  సారంగా నోరు పారేసుకోవడంతో స్థానికంగా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఇంతకీ మంత్రిగా మీరు చేసిన అభివృద్ధి ఏంటీ? అని ఎవరైనా అడిగితే పిట్టకథలు, కోడి గుడ్డు కథలు చెప్పి సమాధానం దాటవేసేవారు. సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌కు గురైన అధికార పార్టీ నేతల్లో ఈయనే మొదటి స్థానంలో ఉంటుంటారు. ఎమ్మెల్యే నుంచి మంత్రిగా ఎదిగిన తర్వాత నియోజకవర్గాన్ని మరింత నిర్లక్ష్యం చేశారు. పార్టీ శ్రేణులను పట్టించుకోకుండా తన వెనకుండే వారికే ప్రాధాన్యం ఇచ్చేవారు.  ఎవరితోనూ కలుపుగోలుగా ఉండరని, కొందరితోనే   వ్యవహారాలన్నీ నడుపుతారనే విమర్శలున్నాయి. ఐప్యాక్‌ సర్వేలో ఇవన్నీ వెలుగులోకి రావడంతోనే జగన్‌ తన నమ్మినబంటు అమర్‌ను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.

తెచ్చింది తక్కువ.. తరలిపోయినవే ఎక్కువ

అమర్‌ మంత్రి కావడంతో అభివృద్ధి పరుగులు తీస్తుందని స్థానికులు ఆశించారు. తీరా అభివృద్ది ఏమేరకు జరిగిందనే ప్రశ్నకు ఆ పార్టీ నాయకులే నోరువెళ్లబెడుతున్నారు. ఉన్నవి కూడా తరలి పోయాయని స్థానికులు మండిపడుతున్నారు. తెదేపా ప్రభుత్వం మంజూరు చేసిన ఉద్యాన పరిశోధన స్థానం ఇక్కడ నుంచి తరలిపోయినా మంత్రి పట్టించుకోలేదు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు. తీరా స్థల వివాదం ఏర్పడటంతో ఇక్కడ నుంచి నర్సీపట్నం నియోజకవర్గం తరలిపోయింది. అమర్‌ చిత్తశుద్దితో ప్రయత్నిస్తే ఇక్కడే ఏదో ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసి ఉండేవారనే వాదన వినిపిస్తోంది. జగన్‌ పాదయాత్రలో అమర్‌ సమక్షంలోనే తుమ్మపాల కర్మాగారాన్ని ఆదుకుంటామని ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా ఆ కర్మాగారం ఆస్తుల అమ్మకానికి ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక పట్టణ పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లలో రాజకీయ ప్రయోజనాల కోసం 1,270 ఇళ్లు విశాఖ జిల్లా వారికి కేటాయించేశారు. కోడూరులో ఆటోనగర్‌కు పరిశ్రమల మంత్రిగా ఉన్న అమర్‌ శంకుస్థాపన చేశారు. ఇది జరిగి పది నెలలు కావస్తున్నా ఒక్క పరిశ్రమా రాలేదు. ఆయన పనితీరుపై నియోజకవర్గ ప్రజలే తీవ్ర అసంతృప్తితో ఉండడంతో సమన్వయకర్త బాధ్యతల నుంచి పక్కకు తప్పించాల్సి వచ్చింది. చివరకు అమరే కంట నీరు పెట్టుకునే పరిస్థితి వచ్చింది.  

కలిసిరాని సామాజికవర్గ సమీకరణాలు

అనకాపల్లి నుంచి మరలా సీటు ఇవ్వరని అమర్‌కు ముందే తెలిసి, పక్కనున్న ఎలమంచిలి నియోజకవర్గంపై కన్నేశారు. అక్కడ ఎమ్మెల్యే కన్నబాబురాజుకు వ్యతిరేకంగా తన అనుచరులతో ఓ వర్గాన్ని తయారు చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి కావడంతో అచ్యుతాపురం సెజ్‌లో ఆధిపత్యం చూపడానికి ప్రయత్నించేవారు. ఎమ్మెల్యే కన్నబాబురాజు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకువెళ్లడంతో ఎలమంచిలి వ్యవహారాల్లో తలదూర్చొద్దని ఇదివరకు వారించినట్లు తెలిసింది. చోడవరం నుంచి పోటీలో నిలబెట్టే అవకాశం ఉందని అమర్‌ వర్గీయులు ఆశపడుతున్నారు. అయితే ఇప్పటికే అక్కడున్న కార్యకర్తలు ‘మాకు ధర్మశ్రీ చాలు.. కొత్తగా అమర్‌ వద్ద’ని సమావేశాలు పెట్టి మరీ చెప్పినట్లు సమాచారం. ఎంపీగా అవకాశం ఇస్తారా అనుకుంటే అనకాపల్లి అసెంబ్లీ నుంచి కాపు అభ్యర్థిని బరిలో ఉంచి ఎంపీగా కూడా అదే సామాజికవర్గానికి కేటాయిస్తే ప్రయోజనం ఉండదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అమర్‌కు అన్ని విధాలా తలుపులు మూసేసినట్లేనని సొంత పార్టీ నుంచే వినిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని