logo

వైకాపా నేతల బరితెగింపు

అనకాపల్లి మండలంలోని గోపాలపురం పంచాయతీ శివారు వెంకటరమణపేటలోని సర్వే నంబరు 111లోని ప్రభుత్వ కొండపోరంబోకు స్థలాలు వైకాపా దెబ్బకు కనుమరుగవుతున్నాయి.

Updated : 28 Mar 2024 04:44 IST

కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో కబ్జాల పర్వం

ఎన్నికల హంగామాలో కన్నెత్తి చూడని అధికారులు

దర్జాగా నిర్మిస్తున్న ఇళ్లు

ఈ అయిదేళ్లలో అధికార పార్టీ నేతల కన్నుపడిన సర్కారీ భూములు చేతులు మారిపోయాయి.. కొండలు కరిగిపోయాయి. ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఎన్నికల వేళ కూడా ఈ దందాలను కొనసాగిస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండడాన్ని చూసి ఇదే అదునుగా విలువైన కొండ పోరంబోకు, ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేస్తున్నారు. రూ.లక్షల్లో అమ్మకాలు సాగిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా దర్జాగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇవన్నీ ఎక్కడో మారుమూలన జరగడం లేదు. అనకాపల్లి కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలోని గ్రామాల్లో ఈ కబ్జాల పర్వం కొనసాగుతోంది. గోపాలపురం, వెంకటరమణపేటలలో మంత్రి అనుచరులు సాగిస్తున్న దందాలపై ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడమే లేదు.

ఈనాడు, అనకాపల్లి

వెంకటరమణ పేటలో కొండను తవ్వేసి చేపడుతున్న అక్రమ నిర్మాణం

అనకాపల్లి మండలంలోని గోపాలపురం పంచాయతీ శివారు వెంకటరమణపేటలోని సర్వే నంబరు 111లోని ప్రభుత్వ కొండపోరంబోకు స్థలాలు వైకాపా దెబ్బకు కనుమరుగవుతున్నాయి. కొండను ఇష్టానుసారంగా యంత్రాలతో చదును చేసి స్థలాలను కబ్జా చేస్తున్నారు. ఆక్రమణదారులంతా వైకాపా మద్దతుదారులు కావడంతో అధికార పార్టీ నేతలు వారికి దన్నుగా నిలుస్తున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఓట్లు చేజారిపోకుండా ప్రభుత్వ, కొండపోరంబోకు స్థలాలను ఎర చూపుతున్నారు. అలాగని పూర్తి ఉచితంగా ఏమీ స్థలాలు కట్టబెట్టడం లేదు. స్థలం విలువలో ఎంతో కొంత నేతల జేబులో పెట్టాల్సిందే. కొందరు మూడు నుంచి అయిదు సెంట్ల స్థలాలు ఆక్రమించి భారీ స్థాయిలో ఇళ్లు నిర్మిస్తున్నారు. కొందరు దొంగపట్టాలు సృష్టించి నిర్మాణాలు చేపడుతున్నారు. సమీపంలో కొండరాయి, గ్రావెల్‌ను అక్రమంగా తీసుకువచ్చి పునాదుల్లో నింపేస్తున్నారు. ఇక్కడ సెంటు స్థలం రూ.5 లక్షల వరకు పలుకుతుండడంతో ఆక్రమణలు రోజురోజుకు విస్తరిస్తున్నాయి. ఇదే సర్వే నంబరు 111ని ఆనుకొని తారకరామా కాలనీకి వెళ్లే రహదారిలో మంత్రి అమర్‌నాథ్‌, ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్‌కుమార్‌ అనుచరుడిగా చెప్పుకొంటున్న గ్రామ నాయకుడొకరు ఏకంగా వాణిజ్య సముదాయమే నిర్మిస్తున్నారు. మరికొంతమంది ఆక్రమించిన స్థలంలో పునాదులు నిర్మించి దొంగపట్టాలతో అమ్మకాలు చేస్తున్నారు. ఈ తంతు అంతా కలెక్టరేట్కు కూతవేటు దూరంలో జరుగుతున్నా రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

అంతా ఆ బాబు కనుసన్నల్లోనే..

మంత్రి అమర్‌నాథ్‌కు కుడిభుజంగా చెప్పుకొంటున్న ఓ మండల స్థాయి నేత కనుసన్నల్లోనే ఈ ఆక్రమణల బాగోతం జరుగుతోంది. అతనే రేటు కట్టి మరీ ఆక్రమణలకు తెరతీస్తున్నారు. అతని అనుచరులు, వైకాపా మద్దతుదారులకు ప్రభుత్వ స్థలాలను రేట్లు కట్టి అప్పగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెతి చూడకుండా అతనే ఆక్రమణదారులకు కొమ్ముకాస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నేత స్థానికులకే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారికి అభయం ఇచ్చి ఇక్కడ స్థలాలను పంచిపెట్టేసినట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. వెంకటరమణ పేటలో ఆక్రమణలపై పలుమార్లు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో తెదేపా నాయకులు స్పందనలో కలెక్టర్‌, జేసీకి ఫిర్యాదులు ఇచ్చారు. అయినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.

సర్వే నెంబరు 111లోని ప్రభుత్వ స్థలంలో వైకాపా నాయకుడు నిర్మిస్తున్న దుకాణ సముదాయం

ఆక్రమణదారులు అంతా వైకాపా సానుభూతి పరులు కావడంతో అధికారులపై మంత్రితో ఒత్తిడి తీసుకువచ్చి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుండా చక్రం తిప్పారు. ఫిర్యాదులు చేసినా రెవెన్యూ వారు పట్టించుకోకపోవడంతో ఆక్రమణలు మరింత విస్తరిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని