logo

ఖేదం.. మోదం

అసని తుపాను కొంతమేర పంటలను దెబ్బతీసి రైతును ఖేదంలో ముంచెత్తగా, దిశ మార్చుకుని బలహీనపడటంతో మరింత నష్టం రాకుండా కాస్త మోదం మిగిల్చింది. బుధవారం వేకువజాము నుంచి జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి.  ఓ వైపు గాలులు.. మరోవైపు వర్షంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు.  మొక్కజొన్న కండెలు కోసి కుప్పలు వేసి ఉండటంతో కుప్పలు తడవకుండా రైతులు పట్టాలు కప్పి లోనికి నీరుపోకుండా ముందస్తుగా చర్యలు చేపట్టారు. దుగ్గిరాల,...

Published : 12 May 2022 03:07 IST

పంటకు కాస్త నష్టం
తీవ్రం కాకుండా తగ్గిన అసని
గుంటూరు కలెక్టరేట్‌ , న్యూస్‌టుడే

సని తుపాను కొంతమేర పంటలను దెబ్బతీసి రైతును ఖేదంలో ముంచెత్తగా, దిశ మార్చుకుని బలహీనపడటంతో మరింత నష్టం రాకుండా కాస్త మోదం మిగిల్చింది. బుధవారం వేకువజాము నుంచి జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి.  ఓ వైపు గాలులు.. మరోవైపు వర్షంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు.  మొక్కజొన్న కండెలు కోసి కుప్పలు వేసి ఉండటంతో కుప్పలు తడవకుండా రైతులు పట్టాలు కప్పి లోనికి నీరుపోకుండా ముందస్తుగా చర్యలు చేపట్టారు. దుగ్గిరాల, వట్టిచెరుకూరు, కాకుమాను తదితర ప్రాంతాల్లో మొక్కజొన్న పంట ఎక్కువగా ఉంది. తాడేపల్లి, కొల్లిపర, తెనాలి ప్రాంతాల్లోని అరటి తోటలు ఈదురు గాలులకు పడిపోయాయి. వర్షం, ఈదురు గాలులకు పడిపోయిన అరటి తోటలను ఉద్యాన శాఖ అధికారులు పరిశీలించారు. పలుచోట్ల గెలలుతో ఉన్న అరటి తోటలు నేలవాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్తు శాఖ సరఫరాను నిలుపుదల చేసింది. ఈదురుగాలుల తీవ్రత తగ్గిన తర్వాత సరఫరాను పునరుద్ధరించింది. గ్రామీణ ప్రాంతాల్లో అరగంట నుంచి గంటన్నర సమయం వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.


అందుబాటులో వాట్సప్‌ నంబర్‌..

సని తుపాను ప్రభావంతో జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. ప్రజలు ఫోన్‌ ద్వారా తుపాను వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలిపేందుకు 08632234014ను అందుబాటులో ఉంచారు. వాట్సప్‌ నెంబర్‌: 81216 89739ను ప్రజల సౌకర్యార్థం జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అందుబాటులో ఉంచారు. 24 గంటలూ ఇవి అందుబాటులో ఉంటాయి. అందుకుగాను మూడు విడతలుగా సిబ్బందిని కంట్రోల్‌ రూంలో నియమించారు. ప్రజలు తుపాను పరిస్థితుల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తెలియజేయవచ్చని తెలిపారు.


ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

సని తుపాను ప్రభావం గురువారం కూడా ఉంటుందని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌ నుంచి టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా క్షేత్ర స్థాయిలోని అధికారులతో సమీక్షించారు. విద్యుత్తు అంతరాయం లేకుండా తాత్కాలిక ఏర్పాటు చేసుకోవాలని ఆ శాఖ అధికారులకు సూచించారు.  తాగునీరు, నిత్యావసర వస్తువులు నిల్వ, ప్రజలను తరలించేందుకు రవాణా సదుపాయాలతో అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల వద్ద ప్రజలకు అవసరమైన మందులతో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.  జిల్లా సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి మాట్లాడుతూ తుపాను ప్రభావంతో అధిక వర్షాలు కురిస్తే విద్యుత్తు సరఫరా, తాగునీటికి ఇబ్బంది కలుగుతుందని, అందుకు అనుగుణంగా పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ముందస్తు ప్రణాళికతో ట్యాంకులను నింపాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని