logo

అత్యుత్సాహం.. అభాసుపాలు

నగరపాలక సంస్థ కార్యదర్శి విభాగం అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది.  మున్సిపల్‌ చట్టాలకు భిన్నంగా సొంత నిర్ణయాలు సభ్యుల ముందుకు తెస్తున్నారు. అధికార, విపక్షాల సభ్యుల హక్కులను, బాధ్యతలను హరించేలా వ్యవహరిస్తున్నారు.కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశానికి ప్రిసైడింగ్‌

Published : 10 Aug 2022 06:03 IST
నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు.. ఆపై ఉపసంహరణ
విజయవాడ కార్పొరేషన్‌ అధికారుల తీరిదీ..
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

నగరపాలక సంస్థ కౌన్సిల్‌, స్థాయీ సంఘం సమావేశాలకు సంబంధించిన ప్రతిపాదనలు, ప్రశ్నలు, ఆఫీసు ప్రియాంబుల్స్‌ను సమర్పించే ముందు కార్పొరేటర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, శాఖాధికారులు.. మేయర్‌ ఆమోదం(సంతకం) పొందిన తర్వాత మాత్రమే సెక్రటరీ సెల్‌కు పంపాలి.

- కార్యదర్శి సర్క్యులర్‌  (ఈ నెల 3న)


నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశాల ప్రతిపాదనలు, ప్రశ్నలపై కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కార్యదర్శికి సెక్రటరీసెల్‌ కార్యకలాపాలపై అవగాహన లేక జారీచేసిన ఉత్తర్వులసను తక్షణమే ఉపసంహరించుకుంటున్నాం.

-  సెక్రటరీ ఇన్‌ఛార్జి (ఈ నెల 6న)


గరపాలక సంస్థ కార్యదర్శి విభాగం అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది.  మున్సిపల్‌ చట్టాలకు భిన్నంగా సొంత నిర్ణయాలు సభ్యుల ముందుకు తెస్తున్నారు. అధికార, విపక్షాల సభ్యుల హక్కులను, బాధ్యతలను హరించేలా వ్యవహరిస్తున్నారు.
కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశానికి ప్రిసైడింగ్‌ అథారిటీగా వ్యవహరించే మేయర్‌కు... చట్టం కల్పించిన అధికారులకు భిన్నంగా అత్యుత్సాహంతో ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఆపై అసలు విషయం తెలుసుకుని తూచ్‌ అంటున్నారు. ఈ నెలలో కార్యదర్శి విభాగం అధికారులు జారీచేసిన రెండు వేర్వేరు సర్క్యులర్లలో కౌన్సిల్‌ సభ్యులను ఉద్దేశించి పొందిపర్చిన పలు అంశాలు అధికారుల అవగాహనా రాహిత్యాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.

కార్పొరేషన్లోని కొందరు అధికారులు... మేయర్‌తోపాటు, పాలకపక్షాన్ని ఆకర్షించేందుకు, వారి మెప్పు పొందేందుకు అటువంటి అసంబంధమైన అంశాలను తెరపైకి తెస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి కూడా విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు, పాలకులు 1955 జీహెచ్‌ఎంసి యాక్టుతోపాటు, విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం-1981(యాక్టు నెంబరు-23)ను అనుసరిస్తున్నారు. దాని ఆధారంగానే ప్రతిపాదనలు రూపొందించడం దగ్గర నుంచి తీర్మానాలు ఆమోదించి ప్రభుత్వానికి పంపడం, ఆపై కమిషనర్‌ ద్వారా వాటిని అమలయ్యేలా చూడడం వంటి చేస్తూ వస్తున్నారు.

సభ్యులు ప్రియాంబుల్‌ రూపంలో ముందుగా అందించిన సమస్యలు, అభివృద్ధి అంశాల ప్రతిపాదలను కార్యదర్శి విభాగం అధికారులు మేయర్‌ ముందుంచాలి. నిబంధనలకు అనువుగా అవి ఉన్నాయో, లేవో వివరిస్తూ ఆపై ఆయా ప్రతిపాదనలను కౌన్సిల్‌ అజెండాలో చేర్చేందుకు సహకరించాల్సి ఉంది.

చిన్నపాటి సమస్యలైతే..

సాధారణ, చిన్నపాటి సమస్యలతో కూడిన ప్రతిపాదిత అంశాలేమైనా కౌన్సిల్‌ సభ్యులు ప్రియాంబుల్‌ రూపంలో అందించినా, వాటిని తిరస్కరిస్తే దానికి కారణాలు పేర్కొంటూ,  మేయర్‌ సంతకంతో లిఖితపూర్వంగా వారికి తెలియజేయాలి. అటువంటి చిన్నపాటి సమస్యలను నేరుగా కమిషనర్‌ ఆమోదంతో పరిష్కరించుకునే వీలున్నందున, వాటిని చర్చకు తావులేకుండా చేసే అవకాశం అధికారం ఉంటుంది. అందుకు భిన్నంగా మేయర్‌ ఆమోదం, సంతకం లేనిదే కార్పొరేటర్లు ప్రతిపాదనలు, ప్రశ్నలు పంపడానికి వీలు లేదని 7 అంశాలతో కూడిన సర్క్యులర్‌ను కార్యదర్శి విభాగం అధికారులు జారీ చేసిన సర్క్యులర్‌ ప్రస్తుతం మేయర్‌తోపాటు, పాలకపక్షాన్ని ఇరకాటంలోకి నెట్టాయి.  

అవగాహన ఏదీ?

నగరపాలక సంస్థలో చాలా కాలంగా పలు విభాగాల అధికారులే ఇన్‌ఛార్జి సెక్రటరీలు(కార్యదర్శులు)గా కొనసాగుతూ వస్తున్నారు. ఇక్కడ గుమాస్తాలుగా పనిచేసి, ఆపై ఇతర ప్రాంతాల్లోని పలు గ్రేడ్ల పురపాలక సంఘాల్లో కమిషనర్లుగా పనిచేసి తిరిగి నగరపాలక సంస్థకు బదిలీపై వచ్చిన వారికి సెక్రటరీ సెల్‌ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగిస్తూ వస్తున్నారు. వారికి చట్టంపై సరైన అవగాహన లేకపోవడంతో పాలకులు, మేయర్‌ మెప్పుకోసం సభ్యుల హక్కులను హరించే విధంగా సర్క్యులర్లు జారీ చేస్తూ స్వామిభక్తిని ప్రదర్శిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి చోటు చేసుకోకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని