logo

అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు

విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు.

Published : 26 Apr 2024 04:22 IST

విద్యార్థులకు అందని విద్యాదీవెన నిధులు

‘విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. అయితే ఆచరణ అంతంతమాత్రంగానే ఉంది. ఈపథకం కింద నిధులు ఎన్ని నెలలకు ఎప్పుడు జమ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.’


సంయుక్త ఖాతా తెరిచేందుకు బ్యాంకులో బారులు తీరిన విద్యార్థులు, తల్లిదండ్రులు (పాత చిత్రం)

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మచిలీపట్నంలోని ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ 2వ సెమిస్టర్‌ పరీక్షలు రాసేందుకు ఆ కళాశాల విద్యార్ధి హాల్‌టికెట్‌ కోసమని కళాశాలకు వెళ్లి అడిగాడు. విద్యాదీవెన డబ్బులు పడలేదు .. రుసుము  చెల్లిస్తేనే హాల్‌టికెట్‌ ఇస్తామని కళాశాల ప్రతినిధులు తెలిపారు. దీంతో ఆ విద్యార్థి తన తండ్రికి చెప్పగా ఆయన కళాశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించి తానే రెండురోజుల్లో చెల్లిస్తానని సహకరించాలని కోరగా హాల్‌టికెట్‌ ఇచ్చారు.
ఇది ఒక విద్యార్ధి సమస్య మాత్రమే కాదు బందరు, పెడన నియోజకవర్గాల పరిధిలోని వందలాదిమంది డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు విద్యాదీవెన సాయం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ వస్తుంది కదా పిల్లలను చదివించుకోవచ్చని పేదకుటుంబాలకు చెందిన వారు కూడా అనేక కష్టాలకోర్చి కళాశాలల్లో చేర్పించారు. ప్రస్తుతం సాయం అందక పోవడంతో వారంతా అప్పులు చేసి కళాశాలలకు ఫీజు చెల్లించాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.
ఆది నుంచీ అవస్థలే:  విద్యాదీవెన డబ్బులు సకాలంలో జమకాకపోవడంతో కొన్ని సార్లు తల్లిదండ్రులే ఫీజులు చెల్లించాల్సిన దుస్థితి దాపురించింది. ఇలా అనేక  ఇబ్బందులు పడుతుంటే ఎన్నికలు సమీపించడంతో పథకంలో పలు మార్పులు చేశారు. మొదట్లో ప్రభుత్వం బోధన రుసుములను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసేది. గతేడాది చివరిలో విద్యార్థులు వారి తల్లులతో బ్యాంకులో సంయుక్త ఖాతాలు తెరవాలనే నిబంధన విధించారు. సంయుక్త ఖాతాల్లో మాత్రమే రుసుము జమ చేస్తామని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడం పట్ల కూడ విమర్శలు వ్యక్తమయ్యాయి.


బటన్‌ నొక్కినా ఫలితం లేదు

జిల్లా వ్యాప్తంగా బీసీ సామాజికవర్గానికి చెందిన విద్యార్థులు మొత్తం  31,966మంది విద్యార్థులు విద్యాదీవెన పథకంలో లబ్ధిపొందుతున్నట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. బందరు, పెడన నియోజకవర్గాల పరిధిలోని 15 కళాశాలల్లో వేలాదిమంది విద్యార్థులు డిగ్రీ కోర్సులు చదువుతున్నారు. వీరిలో ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యాదీవెన నిధులు కేవలం 20శాతం మందికి మాత్రమే జమ అయ్యాయని, 80శాతం మందికి అందలేదని కళాశాలల యాజమాన్యాలే చెబుతున్నాయి. ఈ ఏడాది మార్చి ఒకటిన పామర్రులో ముఖ్యమంత్రి జగన్‌ విద్యాదీవెన బటన్‌ నొక్కి వెళ్లిపోయారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఫీజు డబ్బులు మాత్రం ఖాతాలకు చేరలేదు.


విద్యావ్యవస్థ నిర్వీర్యం

వైకాపా ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసింది. గత ఎన్నికల్లో అన్న వస్తున్నాడు..మంచి రోజులు వస్తున్నాయి..కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్య ఉచితంగా అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం విద్యావ్యవస్థను పూర్తిగా గాలికొదిలేశారు. విద్యాదీవెన, వసతి దీవెన నిధులను కూడా పక్కదారి పట్టించారు.

మాదిరెడ్డి సుబ్రహ్మణ్యం, స్టూడెంట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ స్టేట్‌ కన్వీనర్‌


ఓట్లు దండుకునేందుకే..

ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను పూర్తిగా అంధకారంలోకి నెట్టేసింది. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించారు. విద్యార్థుల ఓట్లు దండుకునే ప్రయత్నాలు తప్ప ప్రభుత్వం వారికి చేసిందేమి లేదు.

బొడ్డు వంశీకృష్ణ, ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని