logo

ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి

ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్‌ కె.ఆర్‌.సూర్యనారాయణ అన్నారు.

Published : 26 Apr 2024 04:17 IST

మాట్లాడుతున్న కేఆర్‌ సూర్యనారాయణ. పక్కనే కరణం హరికృష్ణ, బాజీ పఠాన్‌, పాపారావు, రవీంద్రబాబు తదితరులు

విజయవాడ(అలంకార్‌కూడలి): ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్‌ కె.ఆర్‌.సూర్యనారాయణ అన్నారు. గురువారం ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఉద్యోగుల అంతర్గత సమావేశాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేపథ్యంలో కొందరు భయాలు సృష్టిస్తున్నారని తెలిపారు. ప్రజలకు-ఉద్యోగులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు తెలియజేసేందకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక సమావేశాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఎన్నికల వేళ ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా స్వేఛ్ఛగా తమ ప్రాథమిక హక్కులు, విధులను చర్చించుకునేలా చాలా స్పష్టంగా రాజ్యాంగంలో ఉందని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోనూ ఉన్నాయని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి.. కేవలం రాజకీయ నాయకులు, ఎన్నికల్లో పోటీ చేసే వారికి మాత్రమేనని, ఇది ఉద్యోగుల అంతర్గత సమావేశాలకు వర్తించదని తెలిపారు. ఉద్యోగులు ఎన్నికల నియమావళిపై పూర్తి అవగాహన తెచ్చుకోవాలని సూచించారు. సీపీఎస్‌-జీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ పునరుద్ధరించాలని, 12వ పీఆర్‌సీ అమలు చేయాలని కోరారు. సకాలంలో డీఏల  చెల్లింపు, రూ.25వేల కోట్ల పెండింగ్‌ పీఆర్సీ, ఏపీజీఎల్‌ఐ బకాయిలు చెల్లించాలని కోరారు. ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు, పింఛను చెల్లింపు చట్టబద్ధం చేయడం, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌, పింఛనర్లకు అడిషనల్‌ క్వాంటం ఆఫ్‌ ఫైనాన్స్‌ అమలు చేయాలని కోరారు. మెరుగైన ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ను అమలు చేయాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. నాయకులు కరణం హరికృష్ణ, బాజీ పఠాన్‌, పాపారావు, కేదారేశ్వరరావు, రవీంద్రబాబు, నరసింహారావు, అబ్దుల్‌ రజాక్‌, మాగంటి శ్రీనివాసరావు, కిషోర్‌, ఐక్యవేదిక నాయకులు నాగసాయి, విజయ్‌, రంగనాథ్‌, బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని