logo

పేరు జనఔషధి.. తీరు దోపిడీ

తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్‌ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు.

Published : 26 Apr 2024 04:15 IST

అయిదు రెట్ల ధరకు అమ్ముతున్న మాత్రల సీసా ఇదే..

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్‌ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు దోపిడీ పర్వం కొనసాగిస్తున్నారు. దీంతో రోగులు హతాశులవుతున్నారు. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రి ఏ, బీ, సీ బ్లాక్‌ల ఆవరణలో జన ఔషధి  మందుల దుకాణాన్ని ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్టు ఇచ్చారు. సదరు దుకాణం నగరంలోని వైకాపా ప్రజాప్రతినిధికి చెందినది. ఔషధాలే కాకుండా లెప్రసీ మాత్రలను కూడా అధిక ధరలకు అమ్ముతున్నారు. ఈ వ్యవహారంలో కొందరు వైద్యులకు దుకాణం నుంచి మామూళ్లు అందుతున్నాయని బహిరంగంగానే పలువురు సిబ్బంది మాట్లాడుకుంటున్నారు. జనరిక్‌ ధరల పట్టికకు అనుగుణంగా మందుల అమ్మకాలు జరగాలి. కానీ ఇక్కడ నిబంధనలు తోసిరాజంటున్నారు. ఇరవై మాత్రలున్న నికోరండిల్‌ మందు సీసాను రూ.200లకు విక్రయిస్తున్నారు. అదే మాత్రల సీసా పాతబస్తీలోని మందుల దుకాణాల్లో రూ.42 లభిస్తోంది. మిగతా మందుల ధరల్లోనూ వ్యత్యాసాలున్నట్లు పలువురు ఆరోపించారు. ఆసుపత్రిలో ఉచితంగా ఇవ్వాల్సిన ఈ మందులు దొరకడం లేదు. జనరిక్‌ మందుల దుకాణంలో ఈ మందులు కొనుక్కోండని వైద్యులు చెబుతుండటంపై అనుమానాలున్నాయని రోగులు ఆరోపిస్తున్నారు.

  • ఈ అంశంపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.వెంకటేశ్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా దుకాణంలో విక్రయాల తీరును పరిశీలిస్తామని, నిబంధనల ప్రకారం అమ్మకం లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని