logo

అయిదు గంటల నరకం

గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్‌ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది.

Published : 26 Apr 2024 04:28 IST

వంశీ నామినేషన్‌ ర్యాలీ.. వాహనదారులకు అవస్థలు

కంకిపాడు బైపాస్‌పై ఆగిన లారీలు

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే : గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్‌ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. ఉదయం 9 గంటలకే వంశీ ర్యాలీగా ఆర్వో కార్యాలయానికి వెళతారని ప్రచారం జరగడంతో, పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఏలూరు వైపు నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను హనుమాన్‌జంక్షన్‌ వద్దే నిలిపి వేశారు. సర్వీసు రోడ్డులో వీరవల్లి వరకు వాహనాలు స్తంభించిపోయాయి. ఈ వాహనాలను ముందుకు కదలనీయకుండా పోలీసు పహారా పెట్టారు. విజయవాడ నుంచి వచ్చే వాహనాలను కేసరపల్లి వద్దే నిలిపివేశారు. గన్నవరం కూడలిలో వైకాపా శ్రేణులు రోడ్లపైనే ఉండటంతో సాధారణ ట్రాఫిక్‌ సైతం ఆటంకం ఏర్పడింది. ద్విచక్ర వాహనదార్లు, కార్లు ముందుకు కదలడం దుర్లభంగా మారింది. 

జన సమీకరణలో వాలంటీర్లు

గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్‌ కార్యక్రమం సందర్భంగా గురువారం నియోజకవర్గ వ్యాప్తంగా జన సమీకరణ చేశారు. బుధవారం తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్‌ ర్యాలీకు అనూహ్య స్పందన రావడంతో దానికి మించి వంశీ ర్యాలీ ఉండాలనే లక్ష్యంతో వైకాపా నాయకులు బల ప్రదర్శన తలపెట్టారు. పార్టీ నాయకులతో పాటు నాలుగు మండలాల్లోని వాలంటీర్లకు ఆటోల్లో జనాల్ని తరలించే బాధ్యత అప్పగించారు. రాజీనామాలు చేసిన వాలంటీర్లతో పాటు, రాజీనామాలు చేయనివారు కూడా కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం. దగ్గరుండి తమ పరిధిలోని 50 కుటుంబాలకు చెందిన వారిలో అనుకూలంగా ఉన్న వారిని ఎంపిక చేసుకుని ఆటోల్లో ఎక్కించడంతో పాటు, వారు కూడా తరలి వెళ్లారు. ర్యాలీలో పాల్గొనడానికి వెళ్లిన వారికి రూ.300 నగదు, బిర్యానీ, పురుషులకు మద్యం సీసా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.


ట్రాఫిక్‌లో ఇరుక్కున్న అంబులెన్స్‌

న్యూస్‌టుడే, గన్నవరం గ్రామీణం:  చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై గురువారం ట్రాఫిక్‌ స్తంభించింది. గన్నవరం వైకాపా అభ్యర్థిగా వంశీమోహన్‌ నామినేషన్‌ను పురస్కరించుకొని పలుచోట్ల వాహనాలను మళ్లించారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేసరపల్లి వద్ద ట్రాఫిక్‌లో దాదాపు అరగంట పాటు అంబులెన్స్‌ ఇలా చిక్కుకుంది. మరోవైపు విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు, హైవేపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని