logo

వణికిస్తున్న వాయుగుండం

ఆగ్నేయ బంగాళా ఖాతంలో వాయుగుండం ప్రభావం వల్ల వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో అన్నదాత వెన్నులో మరోసారి వణుకు మొదలైంది.

Published : 06 Dec 2022 06:02 IST

ఆందోళనలో అన్నదాతలు

కుప్పపై పరదా కప్పుతున్న రైతు

న్యూస్‌టుడే, తోట్లవల్లూరు: ఆగ్నేయ బంగాళా ఖాతంలో వాయుగుండం ప్రభావం వల్ల వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో అన్నదాత వెన్నులో మరోసారి వణుకు మొదలైంది. ఉన్నట్టుండి సోమవారం తెల్లవారుజామున జిల్లాలోని పలు ప్రాంతాల్లో కారు మబ్బులు కమ్ముకున్నాయి. దీనికి తోడు చల్లని గాలులు తోడవడంతో పంట నేల వాలుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డెల్టాలో చాలా చోట్ల వరి పంట కోశారు. మరికొన్ని చోట్ల యంత్రాలతో కోసి పరదాలపై వడ్లు ఆరబోశారు. ఈ ఏడాది ఖరీఫ్‌ ప్రారంభం నుంచి ఎన్నో ఒడిదొడుకులకు గురైనా బాగా పండింది. పంట చేతికొచ్చి తమ కష్టాలు తీరతాయని రైతులు భావించారు. ప్రస్తుతం పొంచి ఉన్న వాయుగుండం ముప్పు తమ ఆశలపై నీళ్లు చల్లిందని అన్నదాతలు కలత చెందుతున్నారు.
జిల్లాలో 1.72 లక్షల హెక్టార్లలో రైతులు ఖరీఫ్‌ వరి సాగు చేశారు. ఎకరాకు 30 నుంచి 45 బస్తాల వరకు దిగుబడి వస్తోందని రైతులు చెబుతున్నారు. పలు మండలాల్లో 35 శాతం వరకు పంట కోసి పొలాల్లో పనలుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రకృతి ప్రకోపిస్తే ఎకరాకు రూ.45 వేల వరకు పెట్టుబడితోపాటు ఆరుగాలం శ్రమ నీటి పాలవుతుందని భయాందోళన చెందుతున్నారు.

* కోస్తాలో సాధారణంగా ఏటా అక్టోబరు, నవంబరు, డిసెంబరు మాసాల్లో తుపానులు సంభవిస్తుంటాయి. నాలుగేళ్లుగా ఇదే సమయంలో రైతులను ప్రకృతి విపత్తులు వెంటాడుతున్నాయి. దీంతో వరి రైతులకు నవంబరు, డిసెంబరు నెలలంటేనే భయం పట్టుకుంది.

కోతలు వాయిదా వేసుకోవాలి.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడి తీవ్ర తుపానుగా మారే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ సోమవారం హెచ్చరికలు జారిచేసిందని తోట్లవల్లూరు మండల వ్యవసాయాధికారి జి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెల 8వ తేదీ నాటికి ఈ తుపాను ప్రభావం ఉండొచ్చన్నారు. రైతులందరూ వరి కోతలు డిసెంబరు 10వ తేదీ వరకు వాయిదా వేసుకోవాలని ఆయన సూచించారు.

రంగు మారకుండా ఇలా చేయండి

వర్షాల వల్ల వరి పైరు వాలిపోకుండా ఎక్కడికక్కడ నాలుగైదు దుబ్బుల తలలను కలిపి దగ్గరకు చేర్చి కట్టుకోవాలి. భారీ వర్షాలు కురిస్తే 100 లీటర్ల నీటిలో 2 కిలోల కళ్లు ఉప్పును కలిపి కట్టగా కట్టుకున్న పంటతోపాటు ఓదెల మీదున్న వరి పూర్తిగా తడిసేలా పిచికారీ చేస్తే ధాన్యం రంగు మారకుండా నిరోధించవచ్చు. వర్షం నీరు పొలంలో నిలిచిపోకుండా చిన్న కాలువలు తీసి, గట్లకు గళ్లు పెట్టుకుని బయటకు పోయే విధంగా అమర్చుకోవాలి.

జి.నాగేశ్వరరావు, మండల వ్యవసాయాధికారి, తోట్లవల్లూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని