logo

పార్టీ కోసం పనిచేయాల్సిందే.. ఓటర్లను మభ్యపెట్టాల్సిందే!

ప్రతి ఓటరు నాడి పసిగట్టి లోబర్చుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేయాలని వైకాపా నాయకులు వాలంటీర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు.

Published : 28 Mar 2024 05:54 IST

వాలంటీర్లకు వైకాపా నాయకుల దిశానిర్దేశం

చిన్నాపురంలో నిర్వహించిన రాజకీయ సమావేశంలో వాలంటీర్లు, పార్టీ నాయకులు

కలెక్టరేట్‌ (మచిలీపట్నం), న్యూస్‌టుడే: ప్రతి ఓటరు నాడి పసిగట్టి లోబర్చుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేయాలని వైకాపా నాయకులు వాలంటీర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. కోడ్‌ అమల్లో ఉన్నా ఏమాత్రం లెక్క చేయకుండా గ్రామాల వారీ వాలంటీర్లతో విడతల వారీ సమావేశాలు నిర్వహించి పార్టీ కోసం పనిచేయాల్సిందే.. ఓటర్లను మభ్యపెట్టాల్సిందే అన్న పార్టీ అధిష్ఠానం ఆదేశాలను నూరిపోస్తున్నారు. ఇందులో భాగంగా చిన్నాపురంలో మంగళవారం రాత్రి బందరు మండల పరిధి చిన్నాపురంలో వాలంటీర్లతో అధికార పార్టీ నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ జన్ను రాఘవరావు, మాజీ ప్రజాప్రతినిధి, గ్రామ వైకాపా అధ్యక్షుడితో పాటు పార్టీ అభ్యర్థికి చెందిన పరిశీలకులు ఈ సమావేశం నిర్వహించగా. మొత్తం 20 మంది వాలంటీర్లు హాజరయ్యారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారన్న అభియోగంపై కొద్ది రోజుల కిందట సస్పెన్షన్‌ వేటుకు గురైన ఆరుగురు వాలంటీర్లు హాజరవ్వగా ప్రభుత్వం వచ్చిన వెంటనే వారికి మరింత ఉన్నత బాధ్యతలు అప్పగించనున్నట్టు నాయకులు ప్రకటించారు. ఇద్దరు గ్రామ నాయకుల ముందస్తు అనుమతి తీసుకుని హాజరు కాలేదు. పార్టీ నుంచి రోజుల వ్యవధిలో వచ్చే కరపత్రాలను ఇంటింటికి అందజేయడంతో పాటు ప్రతి ఓటరు నయానో, భయానో వైకాపాకు ఓటు చేసే విధంగా బాధ్యత తీసుకోవాలని సమావేశంలో నాయకులు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో సహకరించని వాలంటీర్లు మాత్రం ప్రభుత్వం వచ్చాక ఇంటికి వెళ్లక తప్పదని స్పష్టం చేశారు. ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ బాధ్యతను ఒకవేళ తప్పిస్తే అవసరాన్ని బట్టి మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని తీర్మానించినట్టు సమాచారం. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటామని అధికారులు చేస్తున్న హెచ్చరికలను అపహాస్యం పాల్జేస్తూ వైకాపాకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి నివాస గృహంలో నిర్వహించిన రాజకీయ సమావేశానికి గంపగుత్తగా వాలంటీర్లు హాజరవ్వడాన్ని బట్టి ముందు ఇంకా ఎన్ని వైచిత్రిలు చూడాల్సి వస్తుందో అన్న అనుమానాలను పత్రిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని