logo

అంతా అడ్డగోలు.. ఆపై పదోన్నతులు!

ఎస్కేయూలో అడ్డగోలు వ్యవహారాలు నడుస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా నియామకాలు, పదోన్నతులు చేపడుతున్నారు. అభ్యర్థులతో భారీగా ముడుపులు స్వీకరించి అర్హతలేకపోయినా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. 10వ ఆర్థిక సంఘం కింద నియమితులైన సహాయాచార్యులకు ఉద్యోగోన్నతి కల్పిస్తుండమే ఇందుకు నిదర్శనం.

Published : 04 Oct 2022 02:35 IST

ఎస్కేయూలో ఇష్టారాజ్యం

అధికారుల తీరుపై విమర్శలు

న్యూస్‌టుడే: ఎస్కేయూ

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం

స్కేయూలో అడ్డగోలు వ్యవహారాలు నడుస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా నియామకాలు, పదోన్నతులు చేపడుతున్నారు. అభ్యర్థులతో భారీగా ముడుపులు స్వీకరించి అర్హతలేకపోయినా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. 10వ ఆర్థిక సంఘం కింద నియమితులైన సహాయాచార్యులకు ఉద్యోగోన్నతి కల్పిస్తుండమే ఇందుకు నిదర్శనం. 2005లో తాత్కాలికంగా చేపట్టిన నియామకాలను కొంతకాలానికి రెగ్యులర్‌ చేశారు. తాజాగా పదోన్నతులు కల్పిస్తున్నారు. అప్పట్లో రోస్టర్‌ పాటించకుండానే నియామకాలు చేపట్టారు. దీంతో అన్యాయం జరుగుతోందని ఇతర ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పదో ఆర్థిక సంఘం.. ఏమాకథ
10వ ఆర్థిక సంఘం కింద యూజీసీ నుంచి 2003లో ఎస్కేయూకు రూ.70.20 లక్షల నిధులు మంజూరయ్యాయి. వీటిని ఖర్చు చేయడానికి కొన్ని విభాగాల్లో సహాయాచార్యులను ఒప్పంద పద్ధతిలో నియమించాలని నిర్ణయించారు. ఎనిమిది మంది నియామకానికి 2005 ఏప్రిల్‌ 6న ప్రకటన జారీ చేశారు. అదే సంవత్సరం జూన్‌ 4, 5 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. 2005 నుంచి 2007 మార్చి 31 వరకు మాత్రమే సహాయాచార్యులను నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బయోటెక్నాలజీలో 2, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో 2, ఫిజిక్స్‌లో 2, తెలుగు 1, వ్యాయామ విద్యవిభాగంలో ఒకటి చొప్పున పోస్టులు భర్తీ చేశారు. ఇందులో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో విద్యార్హత లేకపోయినా ఇద్దరిని నియమించారు. అప్పట్లోనే అభ్యంతరాలు వచ్చాయి. అర్హత ఉన్న అభ్యర్థులు లేనందున నియమించినట్లు అధికారులు తెలియజేశారు. ఆ ఇద్దరు 2007లోపు విద్యార్హత పూర్తిచేయడానికి యూజీసీ అవకాశం కల్పించింది. గడువులోపు విద్యార్హత సాధించలేదు. ఓ అభ్యర్థి 18-2-2009 నాటికి, మరో అభ్యర్థి 6-11-2011 నాటికి విద్యార్హత పొందారు. యూజీసీ గడువు ఇచ్చిన మూడేళ్ల తర్వాత వారు విద్యార్హత సాధించారు. అయినా సహాయాచార్యులుగానే కొనసాగిస్తూ వచ్చారు. వాస్తవానికి నియామకాలే తప్పు. ఆపై రెగ్యులర్‌ చేశారు. మళ్లీ పదోన్నతులు కల్పించేందుకు సిద్ధం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆడిట్‌శాఖ అభ్యంతరం
8 మంది సహాయాచార్యుల్లో ఏడుగురు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నారు. వారిని 17-12-2008వ తేదీన రెగ్యులర్‌ చేశారు. అరియర్స్‌ కూడా చెల్లించారు. నిబంధనలకు విరుద్ధంగా బకాయిలు చెల్లించారని ప్రిన్సిపల్‌ అకౌంట్స్‌ జనరల్‌ ఆడిట్‌ (రాష్ట్రఆడిట్‌శాఖ) అభ్యంతరం తెలిపింది. తీసుకున్న సొమ్ము వెనక్కు ఇవ్వాలని సూచించింది. దీంతో యూనివర్సిటీ అధికారులు  సహాయాచార్యులకు షోకాజు నోటీసులు జారీ చేశారు. దీనిపై అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇలా అనేక వివాదాలున్నా సహాయాచార్యులకు ఆచార్యులుగా పదోన్నతులు కల్పించే విషయంపై చర్చ జరుగుతోంది.


రోస్టర్‌ ఉల్లంఘన

స్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగుల సంక్షేమశాఖల నుంచి రోస్టర్‌ అప్రూవల్‌ లేకుండానే నియామకాలు చేపట్టారు. రోస్టర్‌ పుస్తకంలో ఖాళీలు చూపించి, అవసరమున్న చోట మాత్రమే రోస్టర్‌ పొందుపరిచారు. నియామక కమిటీలో కోరం కూడా లేదనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఈ పోస్టులు ప్రభుత్వం మంజూరు చేయలేదు. వర్సిటీ అధికారులే నియమించుకున్నారు.


నిబంధనల ప్రకారమే
- ఆచార్య రామకృష్ణారెడ్డి, ఉపకులపతి, ఎస్కేయూ

ఆచార్యులుగా పదోన్నతులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటన జారీ చేశాం. ఇందులో 10వ ఆర్థిక సంఘం అని ప్రత్యేకంగా లేదు. అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని పరిశీలించిన తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. యూజీసీ నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని