logo

ప్రజాసేవకే అంకితమవుతా..

విద్య, వైద్య రంగాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన భగవాన్‌ శ్రీసత్యసాయిబాబా స్ఫూర్తితో తాను ప్రజాసేవకే అంకితమవుతానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ ప్రతిజ్ఞ చేశారు.

Updated : 27 Mar 2023 06:05 IST

సత్యసాయి స్ఫూర్తితో కార్యక్రమాలు
ప్రతిజ్ఞ చేసిన యువనేత నారా లోకేశ్‌

అభివాదం చేస్తూ ..

ఈనాడు డిజిటల్‌, అనంతపురం, పుట్టపర్తి, గోరంట్ల, న్యూస్‌టుడే: విద్య, వైద్య రంగాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన భగవాన్‌ శ్రీసత్యసాయిబాబా స్ఫూర్తితో తాను ప్రజాసేవకే అంకితమవుతానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ ప్రతిజ్ఞ చేశారు. పాదయాత్రకు బయలుదేరే ముందు విడిది కేంద్రం వద్ద సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించారు. ప్రపంచానికి ప్రేమతత్వం, సేవాభావాన్ని నేర్పించిన భగవానుడు నడయాడిన నేలలో పాదయాత్ర చేయడం ఆనందంగా ఉందన్నారు. యువగళం పాదయాత్ర 51వ రోజు ఆదివారం ఓడీసీ మండలం రామయ్యపేట నుంచి మొదలైంది. కార్యకర్తల సందడి, అభిమానుల కేరింతల నడుమ పుట్టపర్తి నియోజకవర్గంలో రెండో రోజు పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. పగడాలవారిపల్లిలో భోజన విరామ సమయంలో బీసీలు, యువతతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారికి భరోసా ఇచ్చారు.

పాదయాత్రకు తరలివచ్చిన అభిమానులు

పెనుకొండలోకి ప్రవేశం

గౌనివారిపల్లి వద్ద పాదయాత్ర పెనుకొండ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. సరిహద్దు వద్ద కార్యకర్తలు తోరణాలు కట్టి, గజమాలతో లోకేశ్‌కు స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చి నీరాజనాలు పలికారు. తనను కలవడానికి వచ్చిన ప్రజలు, యువత, అభిమానులను అప్యాయంగా పలకరించి అందరితో ఫొటోలు దిగుతూ యువనేత ముందుకు సాగారు. ఎస్సీలు యువనేతను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ప్రైవేట్‌ కళాశాలల యజమానులు, ఆటో కార్మికులు, మహిళలు సమస్యలు చెప్పుకొన్నారు.


నేటి వివరాలు..

భారీ గజమాలతో పెనుగొండ నియోజకవర్గానికి లోకేశ్‌కు స్వాగతం

గోరంట్ల, న్యూస్‌టుడే: సోమవారం ఉదయం 9.00 గంటలకు కొండాపురం పంచాయతీ రెడ్డిచెరువుకట్ట విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం. ఉదయం 9.15 గంటలకు రెడ్డిచెరువుకట్ట వద్ద స్థానికులతో మాటామంతీ, 10.05 చలమయ్యగారిపల్లిలో వడ్డెర సామాజిక వర్గీయులతో భేటీ, 11.15 జీనవాండ్లపల్లిలో నాయీబ్రాహ్మణులతో సమావేశం, 12.10 తిప్పరాజుపల్లి వద్ద బోజన విరామం, 2.25 గోరంట్లలో స్థానికులతో సమావేశం, 3.40 గోరంట్లలోని పంచాయతీ బస్టాండు కూడలిలో స్థానికులతో మాటామంతీ, 4.30 గుమ్మయ్యగారిపల్లి వద్ద బహిరంగసభలో లోకేశ్‌ ప్రసంగం, 6.15 గుమ్మయ్యగారిపల్లికి సమీపంలో ఏర్పాటుచేసిన విడిది కేంద్రంలో బస.


కియా.. విజయం తెచ్చే కిక్‌..

గౌనివారిపల్లె-కొరెవాండ్లపల్లి మధ్య కియా ప్ల్లాంటు బస్సులో వెళుతున్న ఉద్యోగులతో సెల్ఫీ

సంక్షోభంలో అవకాశాలను సృష్టించడం చంద్రబాబుకే సాధ్యమని లోకేశ్‌ అన్నారు. లోటు బడ్జెట్‌లో ఏర్పడిన నవ్యాంధ్రకు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోటీపడి మరీ ప్రపంచ ప్రఖ్యాత కార్ల కంపెనీ కియాను సాధించుకొచ్చారన్నారు. కరవు నేల అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడంతో ఇక్కడ తలసరి ఆదాయం గతంతో పోలిస్తే రూ.25 వేలు పెరిగిందన్నారు. యువగళం పాదయ్రాత ఓడీసీ నుంచి గోరంట్ల మార్గంలో సాగుతున్న సమయంలో అటువైపుగా వెళ్తున్న కియా ఉద్యోగుల బస్సును లోకేశ్‌ గమనించి సెల్ఫీ తీసుకుని ఆనందపడ్డారు. విజయం ఇచ్చే కిక్‌ ఇలానే ఉంటుందని పేర్కొన్నారు. పాదయాత్రలో నారా లోకేశ్‌ వెంట మాజీ మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, కాలవ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, బీటీ నాయుడు, రాష్ట్ర తెదేపా కార్యనిర్వహక కార్యదర్శి సవిత, పూల నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ  పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని