logo

మా దురదృష్టం.. ఆర్థిక సంఘం నిధులు పొందలేకున్నాం

‘ఆర్థిక సంఘం నిధులను పొందటం, వార్డులను అభివృద్ధి పరచటం కౌన్సిలర్ల హక్కు. మా దురదృష్టమేమో ఇటీవల ఆర్థిక సంఘం నిధులు పొందలేకున్నాం.

Published : 01 Jun 2023 04:24 IST

అధికార పార్టీ కౌన్సిలర్ల ఆందోళన

కౌన్సిల్‌లో మాట్లాడుతున్న సభ్యుడు కల్యాణ్‌

నేలపై బైఠాయించిన కౌన్సిలర్‌ దిల్షాద్‌ఉన్నిసా

కదిరి, న్యూస్‌టుడే : ‘ఆర్థిక సంఘం నిధులను పొందటం, వార్డులను అభివృద్ధి పరచటం కౌన్సిలర్ల హక్కు. మా దురదృష్టమేమో ఇటీవల ఆర్థిక సంఘం నిధులు పొందలేకున్నాం. వార్డుల అభివృద్ధి చేయలేకున్నాం. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు.’ అంటూ అధికార పార్టీ ఏడో వార్డు కౌన్సిలర్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కదిరి మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం ఛైర్‌పర్సన్‌ నజిమున్నిసా అధ్యక్షతన నిర్వహించారు. కౌన్సిల్‌ ఆమోదానికి పెట్టిన అజెండాలోని ఆర్థిక సంఘం నిధులను ముందే చేసిన పనులకు చెల్లించాలన్న ప్రతిపాదనపై కౌన్సిలర్‌ కల్యాణ్‌ పై విధంగా స్పందించారు. మున్సిపాలిటీ వార్డుల్లో కౌన్సిలర్లు తలెత్తుకుని తిరిగేలా అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని కోరారు. తమ వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. పదో వార్డు కౌన్సిలర్‌ దిల్షాద్‌ఉన్నిసా ఆవేదన వ్యక్తం చేశారు. వార్డులో తాగునీటి సమస్య పరిష్కారానికి పైపులైను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆమె నేలపై కూర్చొని బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన కమిషనర్‌ శ్రీహరిబాబు తగిన చర్యలు చేపడతామని తెలిపారు. పురపాలికల్లో లీజు కాలం ముగిసిన దుకాణ గదులకు కాల పరిమితి పెంచాల్సిన అంశాన్ని వాయిదా వేయాలని సభ్యులు కోరారు. చెత్తసేకరణకు ఈ-ఆటోలను కొనుగోలు చేయాలని సూచించారు. సమావేశంలో వైస్‌ ఛైర్‌ పర్సన్‌ గంగాదేవి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.


పన్నులు వసూలు చేస్తారు.. పనులు చేయరు

సమస్యలను వివరిస్తున్న కౌన్సిలర్‌ పురుషోత్తంరెడ్డి

మాట్లాడుతున్న ఛైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే : ‘పన్నుల రూపేణ ధర్మవరం పట్టణంలో రూ.కోట్లు వసూలు చేస్తున్నారు. కానీ ప్రజలకు కనీస వసతులు కల్పించడం లేదు. ప్రగతి పనులు చేయడంలేదు.’ అంటూ ఇన్‌ఛార్జి ఛైర్‌ పర్సన్‌ భాగ్యలక్ష్మి, మరి కొందరు అధికార పార్టీ కౌన్సిలర్లు మండిపడ్డారు. బుధవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ఇన్‌ఛార్జి ఛైర్‌ పర్సన్‌ భాగ్యలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేయగా.. పై విధంగా ఆమె స్పందించారు. ‘వార్డు సమస్యలు పరిష్కరించాలని చెప్పినా అధికారులు పట్టించుకోవడంలేదు. ఏప్రిల్‌ 14న సూర్య పాఠశాల వద్ద ప్రమాదకరంగా ఉన్న వంతెన పనులు చేపట్టాలని విన్నవించినా కమిషనర్‌ మల్లికార్జున, ఇంజినీరింగ్‌ అధికారులు స్పందించలేదు. సమస్య పరిష్కరించనప్పుడు కౌన్సిల్‌ సమావేశానికి ఎందుకు రావాలి...? ఇక కౌన్సిల్‌ సమావేశానికి హాజరుకాను..’ అని కౌన్సిలర్‌ గోరకాటి పురుషోత్తంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నీటి శుద్ధి కేంద్రాలు అనుమతి లేకుండా సరఫరా చేస్తున్నా మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదని కోఆప్షన్‌ సభ్యుడు రామకృష్ణ ఆరోపించారు. వీధి దీపాలు లేక కాలనీల ప్రజలు అవస్థలు పడుతున్నారని పలువురు కౌన్సిలర్లు వాపోయారు. కౌన్సిల్‌ సమావేశంలో ప్రజా సమస్యలు విన్నవించడమే కానీ వాటికి పరిష్కారం లభించడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో వైస్‌ఛైర్మన్‌ నాగరాజు, కౌన్సిలర్లు, అదనపు కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి, ఈఈ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని