logo

కుంటపై కన్నేశారు.. పూడ్చేందుకు రాళ్లేశారు!

కరవు ప్రాంతానికి ప్రతీకగా నిలిచే జిల్లాలో ప్రతి నీటి బొట్టూ వృథా కాకుండా భూమిలో ఇంకింపజేయాలి. జలవనరులను సంరక్షించుకోవాలన్న నినాదాలతో అప్పట్లో ఇంకుడు గుంతలు, కుంటలు ఏర్పాటు చేశారు. వాటిని కాపాడాల్సిన నాయకులే నేడు వాటిపై కన్నేశారు.

Published : 27 Mar 2024 04:42 IST

ఉప్పరపల్లి కుంట మధ్యలో తోలిన బండరాళ్లు, మట్టికుప్పలు

గోరంట్ల, న్యూస్‌టుడే: కరవు ప్రాంతానికి ప్రతీకగా నిలిచే జిల్లాలో ప్రతి నీటి బొట్టూ వృథా కాకుండా భూమిలో ఇంకింపజేయాలి. జలవనరులను సంరక్షించుకోవాలన్న నినాదాలతో అప్పట్లో ఇంకుడు గుంతలు, కుంటలు ఏర్పాటు చేశారు. వాటిని కాపాడాల్సిన నాయకులే నేడు వాటిపై కన్నేశారు. వారి స్వార్థానికి పూడ్చేస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని గౌనివారిపల్లి రెవెన్యూ గ్రామపరిధిలోని ఉప్పరపల్లికుంట పూడిపోతుండడంతో ఆయకట్టు రైతులు కంటతడి పెడుతున్నారు. 15 ఎకరాల ఆయకట్టు సామర్థ్యం కలిగిన ఈ కుంటకింద సుమారు 20 మందికి పైగా రైతులున్నట్లు చెబుతున్నారు. ఈకుంట సమీపంలో జరుగుతున్న 716జీ జాతీయ రహదారి విస్తరణ పనులకు సంబంధించి తొలగిస్తున్న మట్టి, గుండ్లు, పెద్దబండరాళ్లు కుంటమధ్యలోకి, చుట్టూ తోలుతుండడంతో పూడిపోతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో టిప్పర్లతో తోలారని, సుమారు నెలరోజులుగా ఈతంతు కొనసాగుతోందని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సమీప గ్రామానికి చెందిన ఓ వైకాపా నాయకుడి పొలంలోకి దారి వేసుకోవడానికే అలాతోలుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కళ్లముందే కుంట పూడిపోతుంటే ఏం చేయాలో దిక్కుతోచక అల్లాడిపోతున్నారు. ఈ విషయంపై నీటిపారుదల శాఖా డీఈ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కుంటను పరిశీలించానని, సమస్య వాస్తవమేనని తెలిపారు. జాతీయరహదారి పనులు చేస్తున్న కంపెనీ వారితో మాట్లాడినట్లు చెప్పారు. అందులో తోలిన మట్టి, రాళ్లు, గుండ్లు తక్షణం తొలగించే చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని