logo

అతిథుల హాహాకారాలు

సంతానోత్పత్తికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైబీరియా నుంచి చిలమత్తూరు మండలం వీరాపురం వచ్చిన పక్షులకు ఆహారం దొరకడం గగనంగా మారింది.

Updated : 27 Mar 2024 05:22 IST

వట్టిపోయిన చెరువులు
రోజూ వందల కిలోమీటర్లు తిరిగినా లభించని ఆహారం

ఎండిన చెట్టుపై విదేశీ పక్షులు

హిందూపురం అర్బన్‌, చిలమత్తూరు, న్యూస్‌టుడే: సంతానోత్పత్తికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైబీరియా నుంచి చిలమత్తూరు మండలం వీరాపురం వచ్చిన పక్షులకు ఆహారం దొరకడం గగనంగా మారింది. గడిచిన ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులతో ఒక్క చెరవుకు నీరు చేరలేదు. దీంతో పరిసరాల్లో చెరువులన్నీ ఎండి పోయాయి. రోజూ వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించినా ఆహారం (చేపలు) దొరకక హాహాకారాలు చేస్తున్నాయి. కనీసం చిన్నపిల్ల పక్షుల గొంతు తడిపేందుకైనా సమీప ప్రాంతాల్లో నీరులేక అనేక ఇబ్బందులు పడుతున్నాయి. ఎండల దాటికి నీరులేక పిల్ల పక్షులు కింద పడి చనిపోతున్నాయి. దాదాపు నెల రోజులుగా పక్షులు ఇంతటి క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్నా కనీస సంరక్షణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ పక్షులు గుడ్లు పొదిగేందుకు గూళ్లు ఏర్పాటు చేయకపోయినా కనీసం చెరువుల్లో బోర్లు వేసి నీటి సౌకర్యం కల్పించటం, సమీపంలో నీటి తొట్టెలు ఏర్పాటు చేసి అందులో నీటిని నిల్వచేయటం, రోజూ ఇతర ప్రాంతాల నుంచి చేపలను తీసుకొచ్చి ఇక్కడ ఉంచితే ఇవి అహారంగా తీసుకొంటాయి. గ్రామంలో ఉన్నచెట్లు అంతరించి పోతుంటే భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా ఒక్క మొక్కైనా పెంచకపోవటం వీటి సంక్షణకు ఎలాంటి చర్యలు తీసుకొంటున్నారో అర్థమవుతోంది. దీనిపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా వీరి బాధలు పట్టించుకొన్న నాథుడే లేడు.

పచ్చదనం తరిగిపోతోందని ఆందోళన

గ్రామ సమీపంలో చెట్లు నరికివేస్తుండంతో పచ్చదనం తరిగిపోతోందని పర్యావరణ పరిరక్షణ నాయకుడు భాస్కరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్ల కొట్టేసేందుకు అధికారులు అనుమతించటమే కాకుండా అనధికారికంగా నరికేస్తున్నారని ఫిర్యాదు చేసినా అటవీ అధికారులు పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ప్రాంతంలో పచ్చదనం కనుమరుగయ్యే అవకాశాలున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వట్టిపోయిన చెరువులో  సైబీరియా పక్షులు


నీటి సదుపాయం కల్పించాలి

పిల్ల పక్షులకు పెద్దవి నీరు అందించాలన్నా సమీప ప్రాంతాల్లో అందుబాటులో లేవు. అందువల్ల ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు వెంటనే బోర్లు తవ్వి కుంటలు ఏర్పాటు చేసి అందులోకి నీటిని వదిలితే వెంటనే చిన్న పిల్ల పక్షులకు నీరు అందే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్రామంలో ఉన్న చెట్లు దెబ్బతిని ఎండిపోతున్నాయి. అందువల్ల గ్రామంలో ఉన్న రెండు ఎకరాల ప్రభుత్వ భూమిలో మొక్కలు పెంచితే అవి భవిష్యత్తులో చెట్లుగా పెరిగి ఈ పక్షులకు ఆవాసంగా మారే అవకాశం కలుగుతుంది.

శివారెడ్డి, వీరాపురం, చిలమత్తూరు మండలం


సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం..

సైబీరియా నుంచి పక్షులు ఇక్కడికి కొన్ని వందల సంవత్సరాలనుంచి వస్తుండటంతో ఈ గ్రామానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ సంవత్సరం వీటికి నీరు, ఆహారం అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ప్రభుత్వం, అధికారులు వీటికి సౌకర్యాలు ఏర్పాటు చేయటంలో ఘోరంగా విఫలమయ్యారు. వెంటనే చర్యలు తీసుకొని నీరు, ఆహారం ఏర్పాటు చేయాలి. లేదంటే వన్యప్రాణుల పరిరక్షణ చట్టం కింద సుప్రీం కోర్టునైనా ఆశ్రయిస్తాం.

ఆచార్య భాస్కర్‌నాయుడు, పర్యావరణ పరిరక్షణ వేత్త


తగిన చర్యలు తీసుకుంటాం

ఎక్కడినుంచో ఈ ప్రాంతాన్ని నమ్ముకొని వస్తున్న పక్షులకు నీరు, ఆహారం అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకొంటాం. గత సంవత్సరం ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం వీటిని అందుబాటులోకి తీసుకొస్తాం. కిందపడిన చిన్న పక్షులకు అన్నివిధాలా సంరక్షణ చర్యలు తీసుకొంటున్నాం. గ్రామస్థులు సొంతబిడ్డల వలే ఈ పక్షులను చూస్తున్నారు.

అక్బర్‌, అటవీశాఖ అధికారి, హిందూపురం


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని