logo

నిరుద్యోగులకు రూ.3వేలు భృతి

‘‘తెదేపా సూపర్‌సిక్స్‌ పథకాలతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో రద్దయిన సంక్షేమ పథకాలన్నీ రానున్న కూటమి ప్రభుత్వంలో పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.

Published : 05 May 2024 03:43 IST

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు
బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు
రాయదుర్గం తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు

‘‘తెదేపా సూపర్‌సిక్స్‌ పథకాలతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో రద్దయిన సంక్షేమ పథకాలన్నీ రానున్న కూటమి ప్రభుత్వంలో పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేలా తోడ్పాటు అందిస్తామన్నారు. యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. రైతులు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. రాయదుర్గం నియోజకవర్గంలో వ్యవసాయం, విద్య, వైద్యం, రహదారులు, సంక్షేమం, ఉపాధి తదితర రంగాల అభివృద్ధికి ప్రజల సహకారంతో కృషి చేస్తామని ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక ముఖాముఖిలో తెలిపారు.

న్యూస్‌టుడే రాయదుర్గం

పింఛన్లు రూ.4వేలకు పెంపు

ఈ ఏప్రిల్‌ నుంచే పింఛన్లలో సమూల మార్పులు తీసుకొస్తున్నాం. 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రతి నెలా రూ.4వేలు పింఛను ఇస్తాం. తద్వారా లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. దివ్యాంగులకు రూ.6వేలు, కిడ్నీ వ్యాధిగ్రస్థులకు రూ.10 వేలు పంపిణీ చేస్తాం.

బీసీలకు ఆదరణ పథకం కింద పరికరాలు

బీసీ సబ్‌ ప్లాన్‌ ద్వారా ఐదేళ్లల్లో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం. నామినేటెడ్‌ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా భూములు కొనుగోలు చేయించి పంపిణీ చేస్తాం. వాహనాల కొనుగోలు ద్వారా యువతకు స్వయం ఉపాధికి సహకరిస్తాం. బీసీలకు ఆదరణ పథకం కింద వృత్తి పరికరాలు సరఫరా చేస్తాం. ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించి కార్మికులకు ఉపాధి కల్పిస్తాం.

ధరలు నియంత్రిస్తాం

రానున్న కూటమి ప్రభుత్వంలో డీజిల్‌, పెట్రోల్‌, నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రిస్తాం. ఏడాదికి మూడు వంట గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తాం. పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఆస్తి, చెత్త పన్నులు తగ్గించడంతోపాటు అనవసర పన్నులు తొలగించి ప్రజల ఆదాయం రెట్టింపయ్యేలా చూస్తాం. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తాం.

యువతకు ఏటా 4లక్షల ఉద్యోగాలు

యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రతి నెలా రూ.3వేలు చొప్పున నిరుద్యోగ భృతి, ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తాం. మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతాం. వాలంటీర్లకు రూ.5వేల నుంచి రూ.10వేలకు జీతాలు పెంచుతాం. నిరుద్యోగులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పిస్తాం. విదేశీ పెట్టుబడులను ఆకర్షించి తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.

ప్రతి రైతుకు ఏటా రూ.20వేల ఆర్థిక సాయం

వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుచేస్తాం. కూటమి ప్రభుత్వం రాగానే వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తాం. ప్రతి రైతుకు ఏటా రూ.20వేల ఆర్థిక సాయం అందిస్తాం. వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్తు ఇస్తాం. మార్కెట్‌ యార్డులను బలోపేతం చేసి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాం. రాయితీపై బిందు సేద్య, యంత్ర పరికరాలు పంపిణీ చేస్తాం.

ఒకటో తేదీనే జీతాలు

ప్రతి నెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తాం. మెరుగైన పీఆర్‌సీ, ఐఆర్‌లు కల్పిస్తాం. డీఏ బకాయిలు చెల్లిస్తాం. సీపీఎస్‌, జీపీఎస్‌ విధానాలపై సమీక్షించి ఉద్యోగులకు ఏదీ ఉత్తమమో అమలు చేస్తాం. బదిలీల్లో పారదర్శకత పాటిస్తాం.పెన్షనర్లకు సకాలంలో పింఛన్లు చెల్లిస్తాం.

హజ్‌యాత్ర వెళ్లే ముస్లింలకు రూ.లక్ష సాయం

ముస్లిం మైనార్టీలకు రక్షణ కల్పిస్తాం. దుల్హన్‌ పథకాన్ని సులభతరం చేసి అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. హజ్‌యాత్రకు వెళ్లే ముస్లింలకు రూ.లక్ష సాయం అందిస్తాం. ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజన్‌లకు రూ.5వేలు ఇవ్వనున్నాం. రంజాన్‌ తోఫా అందిస్తాం.

కనీస సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి

నియోజకవర్గంలో రూ.4,500 కోట్లతో గతంలో అభివృద్ధి పనులు చేపట్టాం. వాటిలో కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. రాయదుర్గంలో బాలికల జూనియర్‌ కళాశాలకు సొంత భవనం సమకూరుస్తాం. ఇండోర్‌ స్టేడియం, వంద పడకల ఆసుపత్రి, రైల్వే వంతెనలు, టిడ్కో ఇళ్లు, బీసీ బాలికల ఆశ్రమ పాఠశాలను పూర్తి చేయిస్తాం. అన్ని గ్రామాలకు శుద్ధజలం సరఫరా, నగరవనాన్ని అభివృద్ధి చేస్తాం. గ్రామీణ రహదారులను బాగు చేయిస్తాం.  

మహిళలకు ప్రతినెలా రూ.1,500

మా ప్రభుత్వంలో 19 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలకు ప్రతినెలా రూ.1,500 అందజేస్తాం. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు రూ.3లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచుతాం. దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు హస్టల్‌ వసతి కల్పిస్తాం. విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకం ద్వారా రుణాలిచ్చి వారికి అండగా నిలుస్తాం. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు చొప్పున ఇంట్లోని పిల్లలందరికీ వర్తింపు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా ఆర్థిక భరోసాతోపాటు ఉపాధికి అండగా నిలిచేందుకు అవకాశం కలుగుతుంది.

టెక్స్‌టైల్‌ పార్కులో యూనిట్ల ఏర్పాటుకు కృషి

లక్ష ఎకరాలకు సాగు నీరందించేందుకు బీటీపీకి కృష్ణాజలాలు మళ్లిస్తాం. ఆవులదట్ల, మాల్యం వద్ద హంద్రీనీవా కాలువల ద్వారా 28 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు కృషి చేస్తాం. 5 టీఎంసీల సామర్థ్యంతో ఉంతకల్లు వద్ద బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మిస్తాం. తద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందేలా చర్యలు చేపడతాం. గార్మెంట్స్‌ పరిశ్రమ మనుగడకు నిరంతర విద్యుత్తు అందిస్తాం. టెక్స్‌టైల్‌ పార్కులో వంద శాతం యూనిట్ల ఏర్పాటుకు కృషి చేస్తాం. నేమకల్లు-హిర్దేహాళ్‌ మధ్యలో సెజ్‌ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని