logo

ఉద్యోగ, ఉపాధ్యాయులతో చెలగాటం

జిల్లా పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ యంత్రాంగం ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటం అడుతోంది. విధి నిర్వహణ పట్ల బాధ్యతా రాహిత్యం, అవగాహన లోపం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు బహిర్గతమైంది.

Published : 05 May 2024 03:46 IST

డ్వామాలో రోజంతా పడిగాపులు
నిరుత్సాహంతో వెనుదిరిగిన ఇతర జిల్లాల ఓటర్లు

డ్వామా కార్యాలయంలో నిరీక్షిస్తున్న కర్నూలు ఉద్యోగులు

అనంతపురం (శ్రీనివాసనగర్‌), న్యూస్‌టుడే: జిల్లా పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ యంత్రాంగం ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటం అడుతోంది. విధి నిర్వహణ పట్ల బాధ్యతా రాహిత్యం, అవగాహన లోపం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు బహిర్గతమైంది. ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి అనంత జిల్లాలో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనంత నగర డ్వామా కార్యాలయ ఆవరణలో జిల్లా స్థాయి ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శనివారం నుంచే ఓటు వేయవచ్చని ముందుగానే తగిన షెడ్యూల్‌ ప్రకటించారు. ఈ ప్రకారం పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేందుకు శ్రీసత్యసాయి, కర్నూలు, అన్నమయ్య, నంద్యాల, వైఎస్‌ఆర్‌ కడప.. వంటి జిల్లాలకు చెందిన అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయులు డ్వామాలో గంటలకొద్దీ నిరీక్షించారు. ఉదయం 9 గంటలకు మొదలు కావాల్సిన ఓటింగ్‌.. సాయంత్రం 4 గంటలైనా కాలేదు. ఇక లాభం లేదంటూ వెనుదిరిగారు. ఆయా జిల్లాల్లోని ఎమ్పీ, ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేస్తున్న పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలు సకాలంలో జిల్లాకు చేరలేదు.

ఉద్యోగుల పేర్లను మొబైల్‌ లైటు వెలుతురులో చూస్తున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

నోడల్‌ అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం

డ్వామాలో జిల్లా స్థాయి ఫెసిలిటేషన్‌ కేంద్రం మొదలు కాలేదన్న విషయం కలెక్టర్‌ వినోద్‌కుమార్‌కు తగిన సమాచారం లేదు. రాప్తాడు నియోజకవర్గ వివాదం నేపథ్యంలో డ్వామా ఫెసిలిటేషన్‌ కేంద్ర జాబితాలో వారి పేర్లు ఉన్నాయా లేదా అని ఆరా తీసేందుకు శనివారం రాత్రి అక్కడికి వచ్చారు. ఈయనతోపాటు వందలాది  ఉద్యోగులు ఆయన వెంట వచ్చారు. ఇక్కడ ఓటింగ్‌ మొదలు కాలేదని తెలుసుకుని అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఫెసిలిటేషన్‌ కేంద్రంలో ఇతర జిల్లాలకు సంబంధించి 951 మంది పేర్లు ఉన్నాయి. వీరందరూ అక్కడే ఓటు వేస్తే... సంబంధిత జిల్లాల ఆర్‌ఓలకు వాటిని పంపిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని