logo

ఓటేసేందుకు వెళ్లారని సచివాలయ సిబ్బందికి వేధింపులు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసేందుకు వెళ్లిన ఏడుగురు సచివాలయ సిబ్బందిని మండల పరిషత్‌ అధికారులను వేధింపులకు గురిచేశారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకోగా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది.

Published : 08 May 2024 05:35 IST

రామకుప్పం, న్యూస్‌టుడే: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసేందుకు వెళ్లిన ఏడుగురు సచివాలయ సిబ్బందిని మండల పరిషత్‌ అధికారులను వేధింపులకు గురిచేశారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకోగా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు.. రామకుప్పం మండలం నారాయణపురం, ముద్దనపల్లి, వీర్ణమల, మణేంద్రం, బందార్లపల్లె సచివాలయాల్లో పనిచేస్తున్న ఏడుగురు సిబ్బంది కుప్పంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటేసేందుకు సోమవారం వెళ్లారు. అదే సమయంలో ఈవోపీఆర్డీ రాధాకృష్ణ సచివాలయ పరిశీలనకు రాగా తాళం వేసి కనిపించాయి. వెంటనే సిబ్బందికి ఫోన్‌ చేసి ఓటేసేందుకు వెళ్లామని చెబుతున్నా వినకుండా మంగళవారం మండల కార్యాలయానికి రావాలని సూచించారు. వీరంతా ఉదయం కార్యాలయానికి వెళ్లగా ఈవోపీఆర్డీ ఛాంబర్‌లో సిబ్బందిని రెండు గంటల పాటు నిలబెట్టి కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు ఎంపీడీవో దగ్గర అనుమతి తీసుకున్నామని చెబుతున్నా వినిపించుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయంపై ఈవోపీఆర్డీ వివరణ కోరగా అలాంటిదేమి లేదని దాటవేశారు. ఎంపీడీవో ఈశ్వరన్‌ను వివరణ కోరగా ఓటు హక్కు వినియోగంచుకోవడానికి తామే అనుమతి ఇచ్చామన్నారు. అయితే సిబ్బంది కార్యాలయాలకు తాళాలు వేసి వెళ్లారని.. పనిదినాల్లో ఇలా చేయడం తప్పన్నారు. ఆమేరకు పిలిచి మందలించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని