logo

చేర్చుకుని..నిర్ణయం మార్చుకుని..

ఏపీ పీజీసెట్‌ రాయకుండా విశ్వవిద్యాలయాల్లో తక్షణ(స్పాట్‌) ప్రవేశాల్లో సీటు పొందిన పీజీ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సాధారణ కౌన్సెలింగ్‌ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, పీజీ క్యాంపస్‌లు, పీజీ కళాశాలల్లో వివిధ పీజీ కోర్సులో సీట్లు మిగిలిపోయాయి. వాటి భర్తీకి ఏపీ ఉన్నత విద్యా మం

Published : 20 May 2022 05:45 IST

నన్నయ వర్సిటీ

న్యూస్‌టుడే, నన్నయ విశ్వవిద్యాలయం(రాజానగరం) : ఏపీ పీజీసెట్‌ రాయకుండా విశ్వవిద్యాలయాల్లో తక్షణ(స్పాట్‌) ప్రవేశాల్లో సీటు పొందిన పీజీ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సాధారణ కౌన్సెలింగ్‌ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, పీజీ క్యాంపస్‌లు, పీజీ కళాశాలల్లో వివిధ పీజీ కోర్సులో సీట్లు మిగిలిపోయాయి. వాటి భర్తీకి ఏపీ ఉన్నత విద్యా మండలి గత నెల 4న తక్షణ ప్రవేశాలకు ప్రకటన ఇచ్చింది. దానిని అనుసరించి నన్నయ విశ్వవిద్యాలయం ఆ నెల 11న నోటిఫికేషన్‌ జారీ చేసింది. పీజీ సెట్‌ రాసిన, రాయని అభ్యర్థులు హాజరు కావొచ్చని అందులో పేర్కొన్నారు. ఆ మేరకు ఏప్రిల్‌ 18, 19 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు కేటాయించారు. వీరిలో సెట్‌ రాయని వారు వర్సిటీలో 85 మంది వరకు ప్రవేశాలు పొందారు. పీజీ సెంటర్లలో మరికొందరు ఉన్నారు. ఈ నెల అయిదో తేదీ వరకు తరగతులకు హాజరయ్యారు. ఇంతలో పీజీ సెట్‌ రాయని వారికి సీట్లు కేటాయించవద్దని, వారు ప్రవేశాలకు అర్హులు కాదని ఏపీ ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఆ విద్యార్థుల ప్రవేశాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో వారంతా లబోదిబోమంటున్నారు.

ఇప్పుడు ఏం చేయాలి..?

వర్సిటీలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో పీజీ సెట్‌ రాయని పలువురు విద్యార్థులు సీట్లు పొందారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో విద్యా సంవత్సరం కోల్పోతున్నామని, ప్రైవేటు కళాశాలల్లో చేరేందుకూ ఈ నెల రెండో తేదీ నాటికి సమయం ముగిసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలస్య రుసుంతో ప్రవేశం పొందాలంటే మే 2 నుంచి రోజుకు రెండు వేలు చెల్లించవలసి ఉందని అంత సొమ్ము ఎలా కట్టగలమని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జూన్‌ నెలాఖరున మొదటి సెమిస్టర్‌ పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికీ ప్రవేశాల గురించి తేలని పరిస్థితిలో పరీక్షలు ఎలా రాయగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సెట్‌ రాయలేకపోయా..

ఏపీ పీజీ సెట్‌ రాసేందుకు ఫీజు కట్టా. అనివార్య కారణాల వల్ల పరీక్షకు హాజరుకాలేక పోయా. ఏటా సెట్‌ రాయని వారికి సైతం తక్షణ ప్రవేశాల సమయంలో సీట్లు ఇచ్చారు. ఈ ఏడాది సైతం అలాగే ఇచ్చారని, విద్యా సంవత్సరం వృథా కాదని సంతోషించా. సీట్లు ఇచ్చి విద్యాభ్యాసం కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలి. - చంద్రశేఖర్‌

విద్యా సంవత్సరం వృథా కానివ్వొద్దు

ఎంతో ఆశతో పీజీ కోర్సులో చేరాం. ఇప్పుడు ప్రవేశాలు రద్దు చేస్తామనే ప్రభుత్వం నిర్ణయం వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు. ఎంతో విలువైన ఒక విద్యా సంవత్సరం నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. - రాధాకృష్ణ

అనుమతి కోసం లేఖ రాశాం

తక్షణ ప్రవేశాల్లో పీజీసెట్‌ రాయని వారికి సైతం సీట్లు కేటాయించే విధంగా అనుమతి ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ఉన్నతా విద్యామండలికి లేఖ రాశాం. దీనివల్ల విద్యార్థులకు మేలు జరగడంతోపాటు విశ్వవిద్యాలయాలు, పీజీ కళాశాలల్లో సీట్లు మిగిలిపోయే పరిస్థితి ఉండదు. - ఆచార్య టి.అశోక్‌, రిజిస్ట్రార్‌, నన్నయ విశ్వవిద్యాలయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని