logo

దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు

దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు.

Published : 26 Apr 2024 06:24 IST

రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి

తాడిపూడిలో రోడ్‌షోలో పురందేశ్వరి, వెంకటేశ్వరరావు, అచ్చిబాబు తదితరులు

తాళ్లపూడి, కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. కొవ్వూరు మండలం ఆరికిరేవుల నుంచి తాళ్లపూడి మండలం తాడిపూడి మీదుగా అన్ని పంచాయతీల పరిధిలో గురువారం రోడ్డుషో నిర్వహించారు. అన్నదేవరపేటలో జరిగిన సభలో పురందేశ్వరి మాట్లాడుతూ గోదావరిలో ఇసుకను పరిమితికి మించి తవ్వడంతో రోడ్‌కం రైలు బ్రిడ్జి కుంగిందన్నారు. డ్రగ్స్‌ మాఫియా, బ్లేడ్‌బ్యాచ్‌తో ప్రజలను భయపడేలా చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం, మెగా డీఎస్సీల పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు. దిశా యాప్‌ పనిచేస్తుందా అని ప్రశ్నించారు. 56 బీసీ కార్పొరేషన్లు పెట్టి, నిధులు లేకుండా చేశారన్నారు. దళిత డ్రైవర్‌ను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును పక్కన పెట్టుకుని సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ కులానికి న్యాయం జరగలేదన్నారు. కేంద్రం.. నేషనల్‌ హైవేలను నిర్మిస్తే దాని పక్కన రాష్ట్ర రహదారులు అధ్వానంగా ఉన్నాయన్నారు. కేంద్రం నుంచి వచ్చిన ఖర్చు పెట్టే ఉద్దేశం వీరికి లేదని, వాటిని జేబులో వేసుకుంటున్నారని ఆరోపించారు. పంచాయతీలకు డబ్బులు వేస్తే సర్పంచులకు అందకుండా చేశారన్నారు. ద్విసభ్యకమిటీ సభ్యులు సుబ్బారాయచౌదరి, రామకృష్ణ, అల్లూరి విక్రమాదిత్య, టీవీ రామారావు, మారిశెట్టి వెంకటేశ్వరరావు, నామన పరమేశ్వరరావు, వట్టికూటి వెంకటేశ్వరావు, భాజపా నాయకులు పరిమిరాధాకృష్ణ, పిక్కిన నాగేంద్ర పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని