logo

లారీలతో తొక్కిపడేశారు..

వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు.

Published : 26 Apr 2024 06:28 IST

నేటి నుంచి ఒకవైపే రాకపోకలు

బేరింగ్‌ అమరిక పనుల కోసం ఒకవైపు రాకపోకలకు ఏర్పాట్లు

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. ఎన్నికల సమయంలో కూడా అదే ధోరణి కనిపిస్తోంది. పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలిగించడంతో పాటు గోదావరిపై వంతెనలకు చేటు తెచ్చేలా తవ్వకాలు జరుగుతున్నాయి. గామన్‌ వంతెన సమీపంలో కాతేరు, కొవ్వూరు వైపు, రోడ్‌కం రైలు వంతెన సమీప ర్యాంపుల్లో రాత్రివేళల్లో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ ప్రభావం వంతెనపై పడుతోంది. నెలక్రితం ఓవైపు బేరింగ్‌ కుంగడంతో పనులు చేపట్టారు. ఇప్పుడు రెండోవైపు బేరింగ్‌ కుంగినట్లు గుర్తించారు.

గామన్‌ వంతెన సమీపంలోని గోదావరి ఒడ్డున డ్రెడ్జింగ్‌ వ్యవస్థ, యంత్రాలు

ఇప్పుడేం చేస్తారంటే..

రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు వచ్చే వరుసలో 28వ స్తంభం వద్ద రాపిడి (ఫ్రిక్షన్‌) సరిగా లేదని గుర్తించడంతో ఆ బేరింగ్‌ను మార్చాలని నిపుణులు సూచించారు. దాన్ని మార్చేందుకు పాత్‌ ఇండియా సంస్థ (టోల్‌ప్లాజా నిర్వాహక సంస్థ) సిద్ధమైంది. ఆర్డీసీ అధికారులు పర్యవేక్షణలో ఈ పనుల కోసం శుక్రవారం నుంచి ఆ లైనులో రాకపోకలను నిషేధించడంతో మళ్లీ ఓ వైపు రాకపోకలు తప్పవు.

మొన్నటి వరకు ఇలా...

గామన్‌ వంతెనపై 52వ యాక్షన్‌ జాయింట్‌ వద్ద వాహనాలు తిరిగే క్రమంలో బేరింగ్‌ కుంగింది. అంగుళంన్నర మేర ఆ బ్లాక్‌ కిందికి దిగబడింది. దీంతో రాజమహేంద్రవరం వెళ్లే వైపు రెండు లైన్ల మార్గాన్ని నిలిపివేశారు. రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు వచ్చే రెండో లైనులో ప్రయాణాలకు అనుమతించారు. నెలపాటు రాకపోకలను ఆపి బేరింగ్‌లు మార్చారు. పనులు పూర్తవ్వడంతో ఈనెల 23న రెండువైపులా రాకపోకలు పునరుద్ధరించారు. అయితే మరోవైపు స్పాన్లు ఎలా ఉన్నాయో తనిఖీ చేయాలని అధికారులు ఆదేశించారు.

వంతెన సమీపంలోనే తవ్వకాలు

ఓపెన్‌ ర్యాంపుల్లో బోట్స్‌మెన్‌ సొసైటీల పేరుతో జిల్లా పరిధిలో 25 ర్యాంపుల్లో దందా నడిచింది. డీసిల్టేషన్‌ ర్యాంపుల్లో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేకంగా వంతెనలకు సమీపంలో యంత్రాలతో తవ్వుతున్నారు. గతంలో రెవెన్యూ, పోలీసు, భూగర్భ గనుల శాఖ అధికారులు దాడులు చేసేవారు. వాహనాలు సీజ్‌ చేసి, భారీగా జరిమానాలు విధించేవారు. ఇపుడు ఆ పరిస్థితి ఎక్కడా లేదు. దీనికి తోడు అనుమతికి మించి భారీ వాహనాల రాకపోకలు కూడా వంతెన ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 50 టన్నుల లోపు వాహనాలనే అనుమతిస్తున్నారు. భూపాల్‌ నుంచి 16 అదనపు బేరింగులను తెప్పించడంతో 10 రోజుల్లోగా పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని