logo

మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?

అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు.

Published : 26 Apr 2024 06:44 IST

వైకాపా ప్రభుత్వ తీరుపై ఆవేదన
న్యూస్‌టుడే, పామర్రు

అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. మనశ్శాంతిగా గడవాల్సిన కాలాన్ని వైకాపా సర్కారు దినదినగండంగా మార్చేసింది. నెలవారీ పింఛను నుంచి.. ప్రతి బకాయి కోసం ఆందోళన పడాల్సిన పరిస్థితి. మెడికల్‌ రీయంబర్స్‌మెంటు బిల్లులు కూడా సక్రమంగా ఇవ్వకుండా కోత పెడుతున్నారు. మలివయసులో గౌరవంగా జీవించే అవకాశం లేకుండా పోతోందని పింఛనుదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


డీఆర్‌ అదే తీరు

నాడు.. కేంద్రం డీఏ/డీఆర్‌ మంజూరు చేసిన  వెంటనే ఇక్కడ  కూడా మంజూరు చేసి, ఇచ్చేవారు.

నేడు.. కేంద్రం ప్రకటించిన రెండేళ్ల తర్వాత మంజూరు చేసి, ఇలా పెరిగిన డీఆర్‌ను రెగ్యులర్‌లో కలిపి బకాయిలను చెల్లించకుండా క్యుములేట్‌ చేసుకుంటూ వస్తున్నారు. జులై 2018 నుంచి నేటివరకు 151 నెలల కాలానికి డీఆర్‌ బకాయిలు ఇంకా చెల్లించలేదు.


  • ఈ చిత్రంలో వ్యక్తి పేరు కె.కె.వి.నాయుడు.  ఉద్యోగ విరమణ చేసిన తేదీ 28.2.2019. ఈయనకు అయిదేళ్ల నుంచి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చూస్తే..
  •  172018 నుంచి 31032020 వరకూ రావాల్సిన డీఆర్‌ రూ.95,417
  •  142020 నుంచి 31122021 వరకూ రావాల్సిన పీఆర్సీ రూ.81,630
  •  112022 నుంచి 31032024 వరకూ రావాల్సిన డీఆర్‌ రూ.1,20,875
  •  172018 నుంచి 3132024 వరకూ మధ్యంతర భృతి నష్టం తేడా రూ.77,712 ఈ అయిదేళ్లలో ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయి మొత్తం రూ. 3,75,634 ఇలా నాయుడుకే కాదు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి పింఛనుదారుకు సుమారుగా లక్షన్నర రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సి ఉంది.

మ్మడి జిల్లాలో సుమారు నలభై వేల మంది విశ్రాంత ఉద్యోగులున్నారు. సంక్షేమ పథకాల పేరుతో బటన్‌ నొక్కుతున్నానని చెప్పే సీఎం జగన్‌.. 30, 40 ఏళ్ల పాటు సేవలు అందించిన తమను ఆందోళనకు గురిచేస్తున్నారని  పలువురు విశ్రాంత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ పింఛను సొమ్ము కోసం ఇన్ని ఇబ్బందులు పెట్టలేదని వాపోతున్నారు.


ఇచ్చి నప్పుడే పింఛను

నాడు

ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గత ప్రభుత్వ హయాంలో 1 లేదా 2వ తేదీనే ఖాతాల్లో పింఛను జమయ్యేది.

నేడు

ఏ నెలలోనూ 1వ తేదీన రాలేదు. ఎప్పుడొస్తుందో తెలీదు.


పీఆర్సీ బకాయిలు

నాడు

పదో పీఆర్సీ బకాయిలను నాటి ప్రభుత్వం చెల్లించింది. జూన్‌ 2014 నుంచి మార్చి 2015 వరకు బకాయిలను ఒకేసారి జమ చేశారు.

నేడు

1 ఏప్రిల్‌ 2020 నుంచి 31 డిసెంబరు 2021 వరకూ 21 నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించలేదు. జీవోలు ఇచ్చినా తుంగలో తొక్కుతూ డీఆర్‌, పీఆర్సీ బకాయిలూ చెల్లించలేదు.


మట్టి ఖర్చులు

నాడు

సర్వీసు పెన్షనర్‌ కానీ, వారి కన్నా ముందు వారి భార్య/భర్త కానీ, కుటుంబ పింఛనుదారు ఎవరైనా మరణిస్తే రూ.15 వేలు లేదా నెల పింఛను ఏది ఎక్కువైతే అది.. మట్టి ఖర్చులుగా వెంటనే చెల్లించేవారు.

నేడు

ఒక నెల పింఛను అనే దాన్ని ఎత్తివేసి రూ.25 వేలుగా మార్చారు. అంతకంటే ఎక్కువ పింఛను పొందే 40 శాతం మంది నష్టపోతున్నారు.


పీఆర్సీ ఫిట్‌ మెంట్‌

నాడు

లోటు బడ్జెట్‌లో ఉన్నా పదో పీఆర్సీలో 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చి పీఆర్సీ అమలు చేశారు.

నేడు

పే కమిషన్‌ నివేదిక తుంగలో తొక్కి సీఎస్‌ కమిటీ రిపోర్టు అనే కొత్త ఒరవడి తెచ్చారు. మధ్యంతర భృతి(ఐఆర్‌) 27 శాతం ఇచ్చి, దానికన్నా తక్కువ ఫిట్‌మెంటు ఇచ్చారు. నాలుగు శాతం మైనస్‌ ఫిట్‌మెంట్‌తో ప్రతినెలా నష్టమే.


ఆరోగ్య పథకం

నాడు

ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటే రీయంబర్స్‌మెంటు విధానంలో బిల్లులు పెట్టుకున్న వారికి కోతల్లేకుండా నగదు అందేది.

నేడు

కేడర్‌ ఆధారంగా ఈహెచ్‌ఎస్‌ (ఉద్యోగుల ఆరోగ్య పథకం)కింద ప్రతి నెలా రూ.225, రూ.300 కోత పెడుతోంది. వారికి ఏ ఆసుపత్రిలోనూ నగదు రహిత వైద్యం అందట్లేదు. కనీసం రీయంబర్స్‌మెంటు బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితి.


  • పింఛనుదారులు 14,550
  • సర్వీసు పింఛనర్లు 10,200
  • కుటుంబ పింఛనర్లు 4,350

చెక్‌ బౌన్స్‌తో జరిమానాలు

సకాలంలో పింఛన్లు రాక..  సమయానికి ఈఎంఐలు కట్టలేక చెక్‌బౌన్స్‌లు అయ్యి పలువురికి జరిమానాలు పడుతున్నాయి. 1వ తేదీనే పింఛను ఇవ్వాలని పలుచోట్ల  ‘స్పందన’లో అర్జీ ఇచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.  

పీవీఎన్‌ సూర్యనారాయణ, రాష్ట్ర పింఛనుదారుల సంఘం అధ్యక్షుడు, అనపర్తి


వృద్ధాప్యంలో ముప్పుతిప్పలు..

వృద్ధాప్యంలో దీర్ఘకాలిక జబ్బులు వేధిస్తుంటాయి. వైద్యం, మందుల కోసం చాలామంది నానాపాట్లు పడుతున్నారు. నెలవారీ పింఛను నుంచి కోత పెడుతున్నా కూడా రూ.2 లక్షలకే పరిమితం చేశారు. అది కూడా కోతలతో ఎప్పుడొస్తుందో తెలియదు.

కంచి పార్థసారధి, రాజమహేంద్రవరం


అవసరాలకు డబ్బు ఉండటంలేదు

బొమ్మూరు: మా కుంటుంబానికి ఫించనే ఆధారం. వివాహాలు, కార్యక్రమాలకు వెళ్లాలంటే సమయానికి డబ్బు లేక ఇక్కట్లు పడుతున్నాం. మా పిల్లలకు ఏదైనా అవసరమున్నా సాయం చేయలేకపోతున్నాం. కిరాణా దుకాణంలో సరకులు తెచ్చుకుంటే సకాలంలో డబ్బు చెల్లించలేక మాట పడుతున్నాం. నెలవారీ ఈఎంఐ, ఇంటి అద్దె కట్టడానికి అప్పులు చేయాల్సి వస్తోంది. ఉన్న కాస్త డబ్బుతోనే చిన్న ఆసుపత్రిల్లో వైద్య చేయంచుకుని కాలం గడుపుతున్నాం.

జె.వి.ఎస్‌.అనసూయ, విశ్రాంత ఉపాధ్యాయురాలు తూర్పు గోదావరి జిల్లా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని