logo
Published : 06 Aug 2022 06:39 IST

నిధులొచ్చాయి.. రావాల్సింది విధివిధానాలే

ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షలు మంజూరు

కాకినాడ గ్రామీణ మండలం, ఇంద్రపాలెం సచివాలయం

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో గుర్తించిన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పల్లెలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి ఒక్కో గ్రామ/వార్డు సచివాలయం పరిధిలో రూ.20 లక్షలు మంజూరు చేస్తూ ఈ నెల 2న ఉత్తర్వులు జారీ చేశారు.

ఇప్పటికే సీఎం అభివృద్ధి నిధి (సీఎండీఎఫ్‌) కింద ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.2 కోట్లు చొప్పున మంజూరు చేశారు. దీంతో జిల్లాలోని ఏడుగురు ఎమ్మెల్యేలకు రూ.14 కోట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నిధులతో చేపట్టనున్న పనులకు సంబంధించి ప్రతిపాదనలు కోరుతున్నారు. ఇప్పటి వరకు తుని ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా తన పరిధిలో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా ప్రణాళిక శాఖ కార్యాలయానికి పంపారు.

జిల్లాకు రూ.124 కోట్లు మంజూరు
కాకినాడ జిల్లాలో 620 గ్రామ/వార్డు సచివాలయాలకు రూ.20 లక్షల చొప్పున రూ.124 కోట్ల నిధులు మంజూరు చేశారు. దీంతో పల్లెల్లో 445 గ్రామ సచివాలయాల పరిధిలో రూ.89 కోట్లు, పట్టణాల్లోని 175 వార్డు సచివాలయాల పరిధిలో రూ.35 కోట్ల మేర నిధులు అందుబాటులోకి వచ్చాయి. వీటితో అక్కడ గుర్తించిన అభివృద్ధి పనులు, రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు, తాగునీటి అవసరాలు, విద్యుత్తు సౌకర్యం, సామాజిక భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రుల్లో వసతులు కల్పించేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

బిల్లుల చెల్లింపే ప్రధానం..?
వైకాపా ప్రభుత్వం వచ్చాక.. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంపై గుత్తేదారులు ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు బిల్లులు నిలిచిపోయాయి. ఈ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, ఆరోగ్య కేంద్రాలు, డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం వంటి పనులకు బిల్లుల చెల్లింపులోనూ తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. తాజాగా నియోజకవర్గానికి రూ.2 కోట్లు, సచివాలయానికి రూ.20 లక్షలు చొప్పున మంజూరు చేసిన నిధులతో చేపట్టే పనులు ఒక్కొక్కటి రూ.5 లక్షలలోపు ఉండే అవకాశం ఉంది. పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా రూ.5 లక్షల లోపు పనులు చేపడితే నామినేషన్‌ విధానంలో మంజూరు చేసే అవకాశం ఉంది. వీటిని పూర్తి చేసినా బిల్లులు ఏ విధంగా వస్తాయనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఎంపీ ల్యాడ్స్‌ మాదిరిగా కలెక్టర్‌ ఖాతాలో ఈ నిధులు జమ చేసి, పనులు పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లించే విధానం అమలు చేస్తే మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  


మార్గదర్శకాలు రావాల్సి ఉంది..
- కె.శ్రీరమణి, సచివాలయాల నోడల్‌ అధికారి, కాకినాడ జిల్లా

గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒక్కో సచివాలయం పరిధిలో రూ.20 లక్షల చొప్పున కేటాయింపులు చేశారు. వీటి వినియోగానికి సంబంధించి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన పనులకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయి. పల్లెలు, పట్టణాల్లో మౌలిక వనరులు సమకూరతాయి.

Read latest East godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని