logo

పెద్దల సభకు ముగ్గురు!

కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల నుంచి ముగ్గురు పెద్దల సభలో అడుగిడనున్నారు. శాసనమండలిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను వైకాపా సోమవారం ప్రకటించింది.

Published : 21 Feb 2023 06:19 IST

వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
ఈనాడు, కాకినాడ - న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌, అమలాపురం పట్టణం, అల్లవరం

కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల నుంచి ముగ్గురు పెద్దల సభలో అడుగిడనున్నారు. శాసనమండలిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను వైకాపా సోమవారం ప్రకటించింది. గవర్నర్‌ కోటాలో కాకినాడ నుంచి కర్రి పద్మశ్రీ (బీసీ/వాడబలిజ).. స్థానిక సంస్థల కోటాలో అమలాపురం నుంచి కుడుపూడి సూర్యనారాయణ (బీసీ/శెట్టిబలిజ).. ఎమ్మెల్యేల కోటా నుంచి బొమ్మి ఇజ్రాయిల్‌ (ఎస్సీ/మాదిగ) పేర్లు ఖరారు చేసింది.


‘కుడుపూడి’ని వరించిన అవకాశం

కుడుపూడి సూర్య నారాయణరావు.. మాజీ డీఐజీ గోపాలకృష్ణ గోఖలే, మహాలక్ష్మి కుమారుడు. భార్య డాక్టర్‌ విజయ. ఏయూ విద్యార్థి సంఘ నాయకుడిగా 12 ఏళ్లు వ్యవహరించారు. ప్రస్తుతం న్యాయవాదిగా ఉన్నారు. 1986లో శెట్టిబలిజ మహానాడు స్థాపించారు. ఉభయ రాష్ట్రాల శెట్టిబజలిజ సంఘ, ఆంధ్రప్రదేశ్‌ బీసీ కుల సంఘాల కన్వీనర్‌గా ఉన్నారు. ఈయన మాజీ మంత్రి కుడుపూడి ప్రభాకరరావు అన్న కుమారుడు. మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయ్‌కి దూరపు బంధువు. 2000లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా పనిచేశారు. 2004లో తెదేపా తరఫున రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం తరఫున ముమ్మిడివరం నుంచి బరిలో దిగి ఓటమి చవిచూశారు. 2019లో వైకాపాలో చేరి ఉభయగోదావరి జిల్లాల్లో పార్టీ విజయానికి కృషి చేశారు. చిట్టబ్బాయ్‌ సంస్మరణ సభలో.. వైవీ సుబ్బారెడ్డి పాదాలకు మంత్రి వేణు నమస్కరించడంతో.. శెట్టిబలిజల ఆత్మగౌరవం తాకట్టు పెట్టారనే కోపంతో సూర్యనారాయణరావు పార్టీకి దూరంగా ఉన్నా.. ఇటీవల మారిన సమీకరణాలతో మళ్లీ దగ్గరయ్యారు. మంత్రులు విశ్వరూప్‌, వేణుకు దూరంగా ఉన్న సుభాష్‌కు ప్రత్యామ్నాయంగా సూర్యనారాయణరావుకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. కోనసీమ జిల్లా పేరు మార్పుపై జరిగిన అల్లర్ల ఘటనలో అధిక సంఖ్యలో శెట్టిబలిజలపై కేసులు పెట్టడంతో వారు పార్టీకి దూరం అవుతున్నారనే ఉద్దేశంతోనే కుడుపూడికి అవకాశమిచ్చారనే వాదన వినిపిస్తోంది.


ఉపసర్పంచిగా మొదలై...

అల్లవరం మండలం గోడి గ్రామస్థుడు.. బొమ్మి ఇజ్రాయిల్‌. అమలాపురం ఎస్‌కేబీఆర్‌ కళాశాలలో బీఏ చదివారు. వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ.. రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2008-2013 వరకు గోడి ఉప సర్పంచిగా చేశారు. 2021 ఎన్నికల్లో భార్యను గోడి పంచాయతీ ఎన్నికల బరిలో నిలపగా.. ఈమె తెదేపా మద్దతుదారు చేతిలో ఓడిపోయారు. ఇటీవల మాదిగ ఉపకులాలతో అమలాపురంలో బహిరంగ సమావేశం నిర్వహించి.. తమ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా ఇజ్రాయిల్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారైందనే ప్రచారం సాగుతోంది.


మత్స్యకార మహిళకు గుర్తింపు

కాకినాడ నగర మత్స్యకార మహిళ.. కర్రి పద్మశ్రీ. ఆంగ్ల మాధ్యమంలో ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌, ఫిలాసఫీ చేశారు. ఆమె భర్త నారాయణరావు ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రధాన అనుచరుడు. 2009, 2014, 2019 ఎన్నికల్లో ద్వారంపూడి తరఫున పనిచేశారు. వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. పద్మశ్రీ నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ ఫిషర్‌మెన్‌ (ఎన్‌ఏఎఫ్‌) మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలిగా, మత్స్యకార సంక్షేమ సమతి మహిళా విభాగం అధ్యక్షురాలిగా, అఖిల భారతీయ కాస్యాప్‌ మహిళా సంఘ్‌ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆమె తాత గరికిన సత్తిరాజు కార్గోబోట్స్‌ వ్యవస్థాపకులుగా పనిచేశారు. మరోతాత డాక్టర్‌ బర్రి రామచంద్రరావు రాజ్యసభ మాజీ సభ్యులు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆంధ్రా వర్సిటీ వీసీగా పనిచేశారు. ఈమె భర్త వైకాపా నాయకుడిగా ఉన్నా.. పద్మశ్రీ భాజపా నాయకులతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే ప్రోత్సాహంతో ఆమెకు ఈ అవకాశం దక్కినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని