logo

అక్కడికెళ్తేనే ఓటరు స్లిప్పులిస్తారట..

ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులను అందజేయాల్సి ఉన్నప్పటికీ కొందరు బీఎల్‌వోలు సచివాలయాల నుంచి కదలడంలేదు. ఓటర్లనే గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పిస్తున్నారు. దీంతో మండుటెండలో ఇబ్బందులు పడుతూ అక్కడికి వెళ్లాల్సి వస్తోంది.

Published : 04 May 2024 05:15 IST

ఇంటింటికీ వెళ్లకుండా ఓటర్లను సచివాలయాలకు రప్పిస్తున్న వైనం
ఇదీ జిల్లాలో కొందరు బీఎల్‌వో తీరు
న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం)

శుక్రవారం ఉదయం 11.55 గంటల సమయంలో రాజమహేంద్రవరం గ్రామీణంలోని
గ్రామ సచివాలయంలో ఓటరు సిప్పుల కోసం నిరీక్షిస్తున్న ఓటర్లు

ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులను అందజేయాల్సి ఉన్నప్పటికీ కొందరు బీఎల్‌వోలు సచివాలయాల నుంచి కదలడంలేదు. ఓటర్లనే గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పిస్తున్నారు. దీంతో మండుటెండలో ఇబ్బందులు పడుతూ అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలోని 1,577 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో మొత్తం 16,23,149 మంది ఓటర్లు ఉన్నారు. వీరు ఓటు హక్కు కలిగి ఉన్నారనే నిర్ధారణకు, పోలింగ్‌ కేంద్రాల వివరాలు తెలియజేసేందుకు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు స్లిప్పులను జారీచేశారు. వీటిని బీఎల్‌వోలు ఆయా కేంద్రాల పరిధిలోని ఇళ్లకు వెళ్లి అందజేసి సంతకాలు తీసుకోవాలి. ఈ మేరకు ఆర్వోలు ఇటీవల నియోజవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. గత నెల 30న కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ సైతం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఓటు హక్కు ఉందనే నిర్ధారణ, పోలింగ్‌ కేంద్రాల వివరాలు తెలియజేయడమే సిప్పుల పంపిణీ ముఖ్య ఉద్దేశమని, ఈ నెల 13న ఓటు వేసేందుకు సంబంధిత కేంద్రానికి వచ్చేటప్పుడు ఎపిక్‌కార్డు లేదా ఎన్నికల కమిషన్‌ గుర్తించిన ఏదైనా ఫొటో ఆధారిత గుర్తింపుకార్డు తప్పనిసరిగా వెంట తీసుకురావాలనే విషయాన్ని ఓటర్లకు వివరించాలని సూచించారు.

గతంలోనూ అంతే..

జిల్లాలో కొందరు బీఎల్‌వోలు  ఓటర్ల ఇళ్లకు వెళ్లకుండా స్లిప్పులు ఇచ్చేందుకు వారినే సచివాలయాలకు రప్పిస్తున్నారని పలువురు చెబుతున్నారు. ఓటర్ల జాబితా ధ్రువీకరణ(వెరిఫికేషన్‌) విషయంలోనూ క్షేత్రస్థాయిలోకి వెళ్లకుండానే మమ అన్పించడం వల్లే జనవరిలో ప్రచురించి విడుదల చేసిన తుది జాబితాలో అనేక తప్పులు బయటపడటానికి కారణమనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఓటు నమోదుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిశీలన, ధ్రువీకరణ లేకుండానే చాలామంది దరఖాస్తులు తిరస్కరణ(రిజెక్టు) చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఓటర్లు స్లిప్పుల పంపిణీ విషయంలోనూ ఇంటింటికీ వెళ్లకుండా కొందరు బీఎల్‌వోలు ఓటర్లను సచివాలయాలకు రప్పించడంతో సచివాలయాల వద్ద వరుసలో నిలబడాల్సి వస్తుందని అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని