logo

ప్రదర్శన దర్పం.. ప్రయోజనం దూరం

వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు రూపొందించిన సృజనాత్మక పరికరాల ప్రదర్శన వేదికన్నారు..  రెండు వందలకు పైగానే నమూనాలను ప్రదర్శించినట్లు ఆర్భాటంగా ప్రకటించారు.

Published : 29 Mar 2024 03:10 IST

రెండువందలని చెప్పి.. పదులసంఖ్యలోనూ ఏర్పాటు చేయని వైనం

విద్యార్థులు, సందర్శకులు లేక బోసిపోయిన స్టాళ్లు

న్యూస్‌టుడే, గాంధీనగర్‌(కాకినాడ): వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు రూపొందించిన సృజనాత్మక పరికరాల ప్రదర్శన వేదికన్నారు..  రెండు వందలకు పైగానే నమూనాలను ప్రదర్శించినట్లు ఆర్భాటంగా ప్రకటించారు. నగర వాసులు, పాఠశాల, కళాశాలల విద్యార్థులు తరలిరావాలన్నారు. తీరా జేఎన్‌టీయూకేలో జరుగుతున్న ఇన్నోవేషన్‌ ఫెయిర్‌కు వెళ్లి చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎంతోఖర్చుతో ఏర్పాటు చేసిన స్టాళ్లన్నీ బోసిపోయాయి.  

ఏం జరిగిందంటే..: జేఎన్‌టీయూకే ప్రాంగణంలో బుధవారం జేఎన్‌టీయూకే డిజైన్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో కేంద్రవిద్యా శాఖలోని నేషనల్‌ ఇనిషియేటివ్‌ ఫర్‌ డిజైన్‌ ఇన్నోవేషన్‌ సహకారంతో రెండురోజుల పాటు జరిగే ఇన్నోవేషన్‌ ప్రదర్శన ప్రారంభించారు. జేఎన్‌టీయూకే వీసీ జీవీఆర్‌ ప్రసాదరాజు, అక్ను వీసీ కె.పద్మరాజు అతిథులుగా హాజరయ్యారు. వందకు పైగా స్టాళ్లను భారీ ఖర్చుతోనే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సమాచారాన్ని ముందుగా మీడియాకు చెప్పకపోవడం గమనార్హం. ఫెయిర్‌ ప్రారంభించాక సాయంత్రం తీరిగ్గా మీడియాకు సమాచారం విడుదల చేశారు.  రెండు వందలకు పైగానే నమూనాలను  ప్రదర్శిస్తున్నట్లు పేర్కొన్నా..  కనీస స్థాయిలో కానరాని దుస్థితి కనిపించింది. దీనిపై సంబంధిత కన్వీనర్‌ ఎ.గోపాలకృష్ణను ‘న్యూస్‌టుడే’ ఆరా తీయగా నిన్ననే వచ్చి వెళ్లిపోయారన్నారు. రెండు రోజుల పాటు జరుగుతుందన్నారు.. కదా అని ప్రశ్నిస్తే బయటకు వెళ్లి ఉంటారని మాటమార్చారు. ఈ విషయాన్ని వీసీ ప్రసాదరాజు వద్ద ప్రస్తావించగా.. ఇన్నోవేషన్‌ ఫెయిర్‌ జరుగుతోందని ప్రాజెక్టుల గురించి  కన్వీనర్‌ను అడగాలని పేర్కొన్నారు.

అంత గోప్యం ఎందుకో..?

జేఎన్‌టీయూకేలో రాష్ట్ర, జాతీయ స్థాయి సదస్సులు, సెమినార్‌లు వంటివి జరుగుతున్నా కనీస సమాచారం ఇవ్వకుండా గోప్యత పాటిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. ఇలాంటి కార్యక్రమాల పేరిట భారీగానే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. విద్యార్థులను నూతన ఆలోచనలు, ఆవిష్కరణలు వైపు నడిపించేలా ఇన్నోవేషన్‌ ఫెయిర్‌ వంటి కార్యక్రమాలకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నా, ఆవిష్కరణల గురించి  ప్రపంచానికి తెలియకుండా చేస్తున్న తీరుతో ఫలితం ఉండటం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని