logo

జగన్‌ తెచ్చిన నల్లచట్టంపై తిరుగుబాటు చేయాలి: ముప్పాళ్ల

రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై ప్రజలు తిరుగుబాటు చేయాలని ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు, ఐఏఎల్‌ రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు పిలుపునిచ్చారు.

Updated : 06 May 2024 07:10 IST

ముమ్మిడివరంలోని తెదేపా కార్యాలయంలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టుపై రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న ముప్పాళ్ల సుబ్బారావు

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై ప్రజలు తిరుగుబాటు చేయాలని ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు, ఐఏఎల్‌ రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు పిలుపునిచ్చారు. ముమ్మిడివరంలోని తెదేపా కార్యాలయం వద్ద బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు దాసరి సత్యనారాయణ ఆధ్వర్యంలో న్యాయవాదులు, మేధావులతో ఆదివారం రౌండ్‌టేబుల్‌ సమావేశంలో సుబ్బారావు మాట్లాడారు. ప్రజల ఆస్తి హక్కుకు భంగం కలిగేలా ఈ చట్టంలో పొందుపర్చారన్నారు. భాజపా పాలిత రాష్ట్రాల్లోసైతం అమలు చేయకుండా వదిలేసిన ఈ నల్ల చట్టాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయడమేంటని ముప్పాళ్ల ప్రశ్నించారు. నీతి ఆయోగ్‌ నుంచి డ్రాప్ట్‌ రెజల్యూషన్‌ రాకుండా ఐదు నెలల ముందుగానే రాష్ట్రంలో బిల్లు పాస్‌ చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గోప్యంగా చేస్తున్న తప్పు.. నేడు బహిర్గతం కావడంతో ప్రజలు తమ ఆస్తి హక్కును కాపాడుకోవాలని ముందుకు రావడంతో భయపడి ఈ చట్టాన్ని అమలు చేయడం లేదని చెబుతున్నారంటే పాలకుల కుట్రను అర్థం చేసుకోవాలన్నారు. చట్టాన్ని అమలు చేయకపోతే 512 జీవోను ఎలా ఇచ్చారని సుబ్బారావు ప్రశ్నించారు. ఇది 2023 అక్టోబరు 31 నుంచి అమలులోకి వస్తుందని గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా ఎలా చెప్పారన్నారు. ప్రభుత్వం అధికారులను నియమించి.. చట్టబద్ధత కల్పిస్తే.. బడుగు, బలహీన, సామాన్య, ఆదివాసీ, మధ్యతరగతి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుందన్నారు. ఇప్పటికీ ప్రజలకు న్యాయస్థానాలపైనే గౌరవం ఉంది. రాష్ట్రంలో ఇసుక, మూడు రాజధానుల విషయంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ఉల్లంఘించడం పరిపాటిగా మారిందన్నారు.

ఐఏఎస్‌లు సైతం అయ్యా ఎస్‌ అనే పరిస్థితికి వచ్చి.. న్యాయస్థానాల ముందు చేతులు కట్టుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. నాయకులు అయ్యాజీవేమా, ఆనందసాగర్‌, శ్రీనివాసరావు, న్యాయవాదులు అభిప్రాయాలు వెల్లడించారు. కుచ్చర్లపాటి తాతంరాజు, చింతపల్లి అజయ్‌కుమార్‌, రెడ్డి సత్యనారాయణమూర్తి, బీర ప్రసాద్‌, రామాయణ మణేశ్వరరావు, తాడి నరసింహారావు, ఈఎస్‌ బాబు, రేవు సుబ్రహ్మణ్యం, బొంతు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని