logo

ఇక్కడైనా గందరగోళం లేకుండా చూస్తారా?

సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది, అత్యవసర సేవలు అందించే ఉద్యోగులకు సోమవారం నుంచి మూడు రోజుల పాటు పోస్టల్‌ బ్యాలెట్‌ నిర్వహించనున్నారు.

Published : 06 May 2024 06:23 IST

నేటి నుంచి జిల్లాలో ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలట్‌
న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం కలెక్టరేట్‌

సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది, అత్యవసర సేవలు అందించే ఉద్యోగులకు సోమవారం నుంచి మూడు రోజుల పాటు పోస్టల్‌ బ్యాలెట్‌ నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 11,988 మంది నిర్దేశించిన తేదీల్లో తమకు కేటాయించిన ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభమైన పలు జిల్లాల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తి ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ఈ సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు.


ఎదురైన సమస్యలివి..

  • ఓట్లు గల్లంతు కావడం
  • ఆయా నియోజకవర్గాలకు జాబితా పంపక పోవడం
  • సరైన సమాచారం ఇచ్చేవారు లేకపోవడం
  • ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో సౌకర్యాల లేమి
  • చాలామందికి పోస్టల్‌ బ్యాలట్‌ ఇవ్వకపోవడం
  • నిర్దేశించిన సమయానికి ప్రక్రియ ప్రారంభం కాకపోవడం
  • సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం.

ఫెసిలిటేషన్‌ కేంద్రాలివి..

  • అనపర్తి: రామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాల(పీవో, ఏపీవోలకు), జీబీఆర్‌ కళాశాల(ఇతర పోలింగ్‌ సిబ్బందికి)
  • రాజానగరం: బీవీసీ ఇంజినీరింగ్‌ కళాశాల(పాలచర్ల)
  • రాజమహేంద్రవరం నగరం: ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల ఆవరణ
  • రాజమహేంద్రవరం గ్రామీణం: ది ఫ్యూచర్‌ కిడ్స్‌ పాఠశాల కొత్త ప్రాంగణం (కవలగొయ్యి)
  • కొవ్వూరు: సుందరశ్రీ కల్యాణ మండపం - నిడదవోలు: వికాస్‌ జూనియర్‌, డిగ్రీ కళాశాల(సమిశ్రగూడెం)
  • గోపాలపురం: డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాల

వీరికే పోస్టల్‌ బ్యాలట్‌ అవకాశం

  • పీవో, ఏపీవోలు-3,527 మంది
  • ఓపీవోలు-4,865
  • ప్రభుత్వ అధికారులు-1,091
  • సూక్ష్మ పరిశీలకులు-342
  • పోలీసు సిబ్బంది-1,821
  • అత్యవసర సేవల సిబ్బంది- 342  

ఇబ్బందులు లేకుండా చూడాలి
-జె.డి.ఐ.జె.డేనియల్‌బాబు, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు

పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగం విషయంలో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉమ్మడి జిల్లాపరంగా గోకవరం, పెదపూడి మండలాల ఉద్యోగుల్లో గందరగోళం ఉంది. అంగన్‌వాడీ తదితర సిబ్బందికి ఆలస్యంగా ఎన్నికల విధులు కేటాయించారు. వారిలో చాలామంది ఫారం-12 సమర్పించే సమయం లేదు. వీరుకూడా పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునేలా గడువు పెంచాలి.


ఎవరికి.. ఎక్కడ.. ఎప్పుడు..

ఉద్యోగులకు మొదటి విడత శిక్షణలో మాట్లాడుతున్న కలెక్టర్‌

  • 6వ తేదీన: పీవో, ఏపీవోలకు ఆయా నియోజకవర్గాల్లో కేటాయించిన కేంద్రాల్లో ఎన్నికల శిక్షణ ఇస్తారు. అనంతరం అక్కడి ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో పోస్టల్‌ బ్యాలట్‌ సదుపాయం కల్పిస్తారు.
  • 7: పోలీసు సిబ్బందికి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ జరుగుతుంది.
  • అదేరోజు వేంకటేశ్వర ఆనంకళా కేంద్రంలో మైక్రో అబ్జర్వర్లకు ఉదయం 9 గంటలకు ఎన్నికల శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత ఆర్ట్స్‌ కళాశాలలో ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పిస్తారు.
  • అత్యవసర సేవల ఉద్యోగులకు రాజమహేంద్రవరం గ్రామీణం కవలగొయ్యి వద్ద ఉన్న ఫ్యూచర్‌ కిడ్స్‌ పాఠశాల కొత్త ప్రాంగణంలో ఉదయం 9 నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పిస్తారు.
  • 8న: ఇతర పోలింగ్‌ సిబ్బంది(ఓపీవో)కి పోస్టల్‌ బ్యాలెట్‌ జరుగుతుంది.

గందరగోళానికి గురవుతున్నారు
- మీసాల మాధవరావు, ఏపీ ఎన్జీవో సంఘ నగర ఉపాధ్యక్షుడు, రాజమహేంద్రవరం

ఉద్యోగికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడి ఫెసిలిటేషన్‌ కేంద్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ వేసే అవకాశం కల్పించినప్పుడే ఎక్కువ మంది ఓటు వినియోగించుకోగలరు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని శిక్షణ పూర్తిచేసిన కేంద్రాల్లో పోస్టల్‌ బ్యాలట్‌ ఇవ్వకపోవడంతో చాలామంది గందరగోళానికి గురవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని