logo

తీరంలో ఇసుక దొంగలు

సముద్ర తీరంలో ఇసుక దందా ఆగడం లేదు. సీఆర్‌జెడ్‌ పరిధిలోనూ యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. అధికార పక్ష నాయకుల అండదండలతోనే ఈ దందా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Published : 07 May 2024 04:42 IST

వైకాపా పెద్దల అండ.. పట్టించుకోని అధికారులు
న్యూస్‌టుడే, మలికిపురం

మలికిపురం మండలం తూర్పుపాలెంలో తవ్వుతున్న బొండు ఇసుక

ముద్ర తీరంలో ఇసుక దందా ఆగడం లేదు. సీఆర్‌జెడ్‌ పరిధిలోనూ యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. అధికార పక్ష నాయకుల అండదండలతోనే ఈ దందా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఐదేళ్లలో అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించే ఆక్వా చెరువులను తొలగించాలని, వారిపై చర్యలు తీసుకోవాలని కొంత కాలం క్రితం ఎన్జీటీ ఆదేశాలు జారీ చేయగా కలెక్టరు ఉత్తర్వులతో మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో సీఆర్‌జెడ్‌ పరిధిలోని చెరువులను ధ్వంసం చేయడానికి తహసీల్దార్లు నోటీసులు జారీ చేసి తూతూమంత్రంగా చర్యలు తీసుకున్నారు. ప్రజలు ఆందోళన చేసినప్పుడల్లా నాలుగైదు ట్రాక్టర్లను సీజ్‌ చేసి వదిలేస్తున్నారు. యంత్రాంగం కఠినంగా వ్యవహరించకపోవడంతో ఇసుక, ఆక్వా చెరువుల తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇసుక లోడుతో సిద్ధంగా ట్రాక్టర్లు


అంతర్వేది నుంచి కాట్రేనికోన వరకు..

జిల్లాలో సఖినేటిపల్లి మండలం అంతర్వేది నుంచి మలికిపురం, అల్లవరం మండలాలతో పాటు కాట్రేనికోన మండలం గచ్చకాయలపోర వరకు సుమారు 94 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది. సీఆర్‌జెడ్‌ పరిధిలో సముద్రం ఒడ్డున కెరటాలు వచ్చే ప్రాంతం వరకూ తీరాన్ని తవ్వేస్తున్నారు. మలికిపురం మండలంలో తూర్పుపాలెం, శంకరగుప్తం, చింతలమోరి, సఖినేటిపల్లి మండలం అంతర్వేదికర, కేశవదాసుపాలెం, అంతర్వేది దేవస్థానం, అల్లవరం మండలం కొమరగిరిపట్నం తదితర తీరప్రాంత గ్రామాల్లో ఎక్కువగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇటీవల తూర్పుపాలెం, కేశనపల్లి గ్రామ సర్పంచులు తెల్లవారుజామున తమ గ్రామాల పరిధిలో కాపు కాసి ఇసుక ట్రాక్టర్లను నిలుపుదల చేసి అధికారులకు ఫిర్యాదు చేసిన సంఘటనలు ఉన్నాయి. అయినా అధికారులు పట్టించుకోలేదని ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ రెండు గ్రామాల నుంచి రోజూ 50పైగా ట్రాక్టర్లపై అక్రమంగా బొండు ఇసుకను తరలిస్తున్నారు.


నిబంధనలకు విరుద్ధంగా చెరువులు

తీరంలో ఇసుక దిబ్బలు, రైతుల జిరాయితీ పొలాలు, సొసైటీ భూములను నిబంధనలకు విరుద్ధంగా తవ్వేసి ఆక్వా చెరువులుగా మార్చేస్తున్నారు. సముద్ర తీరానికి, పర్యావరణానికి రక్షణగా ఉన్న సరుగుడు తోటలను కూడా నరికేస్తున్నారు. అక్రమార్కులు కొందరు ట్రాక్టరుకు రూ వెయ్యి నుంచి రూ.1500 వరకు రైతుకు ఇచ్చి ఐదారు అడుగుల లోతు వరకు ఇసుక తవ్వేసి ట్రాక్టరు ఇసుకను రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు దూరాన్ని బట్టి వసూలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని