logo

రూ.66 కోట్లు ఎక్కడ జగన్‌?

విజ్జేశ్వరం నుంచి నరసాపురం మండలం బియ్యపుతిప్ప వరకు సుమారు 98 కి.మీ, పోలవరం నుంచి విజ్జేశ్వరం వరకు 45 కి.మీ. మేర ఏటిగట్లు ఉంది. మొత్తం 143 కి.మీ. పొడవున వశిష్ట కుడిగట్టు ఉంది.

Published : 07 May 2024 04:50 IST

ఏటిగట్టు రోడ్డు హామీ గాలికే..

నిడదవోలు, న్యూస్‌టుడే: విజ్జేశ్వరం నుంచి నరసాపురం మండలం బియ్యపుతిప్ప వరకు సుమారు 98 కి.మీ, పోలవరం నుంచి విజ్జేశ్వరం వరకు 45 కి.మీ. మేర ఏటిగట్లు ఉంది. మొత్తం 143 కి.మీ. పొడవున వశిష్ట కుడిగట్టు ఉంది. పోలవరం నుంచి విజ్జేశ్వరం వరకు ఏటిగట్టు రహదారి తరహాలో విజ్జేశ్వరం నుంచి బియ్యపుతిప్ప వరకు ఏటిగట్టు రోడ్డును విస్తరించి బస్సులు, ఇతర వాహనాలు తిరిగేలా తారు రోడ్డు నిర్మించాలి. దీంతో దూరాభారం తగ్గడంతో పాటు, రవాణా సదుసాయం మరింత మెరుగవుతుంది. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే ఎంతో ప్రయోజనం. వైకాపా అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లు పూర్తిగా వదిలేశారు. గతేడాది సాక్షాత్తూ సీఎం జగనే హామీ ఇచ్చినా అడుగు కూడా పడలేదు. ఏటిగట్టు రక్షణ పూర్తిగా వదిలేశారు.

భయపెడుతున్న తవ్వకాలు..

1986లో గోదావరిలో 36 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం రావడంతో ఎక్కడికక్కడ ఏటిగట్లు తెగిపోయాయి. వందల గ్రామాలు నీట మునిగాయి. 2006లో కూడా ఇంచుమించు అదే స్థాయిలో వరదనీరు ప్రవహించింది. ఆ సమయాల్లో ఉభయగోదావరి జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. మళ్లీ ఎప్పుడైనా అదేస్థాయిలో వరదలొస్తే ఏ విధమైన ఇబ్బందులు రాకూడదని ఏటిగట్టు ఆధునికీకరణ చేపట్టారు. పనుల్లో నాణ్యతా లోపంతో ఇబ్బందులు తప్పట్లేదు. నిబంధనల ప్రకారం ఏటిగట్టుకు సుమారు కి.మీ దూరంలో తవ్వకాలు చేయకూడదు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఇష్టారీతిన తవ్వకాలు జరిగాయి. ఏటిగట్టును చేర్చి ఉన్న లంకల్లోనే మట్టిని మీటరు నుంచి మూడు మీటర్ల లోతు తవ్వేశారు. దీంతో గట్టు అనేక చోట్ల జారుతోంది. 2020లో అత్యధికంగా 22.58 లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రవహించింది. ఆ సమయంలో తీర ప్రాంత ప్రజలు వణికిపోయారు. నాయకుల హడావుడి తప్ప చేసిందేం లేదు.

యథేచ్ఛగా ఇసుక లారీలు..

ఏటిగట్టుపై ఏ విధమైన వాహనాలు రాకపోకలు సాగించరాదు. అధికార పార్టీ పుణ్యమా అని ఇసుక లారీలు ఏటిగట్టుపై నుంచే యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో చాలాచోట్ల గట్టు బలహీన పడింది. పెండ్యాల, పందలపర్రు ఇసుకర్యాంపుల నుంచి ఇసుక లారీలు రాకపోకలు సాగించడంతో ఏటిగట్టు చిత్తడిగా మారింది.


గోదావరికి వరదలొచ్చిన ప్రతిసారీ తీరప్రాంత ప్రజలు, రైతులు వణికిపోతారు. కోట్ల రూపాయలతో నిర్మించిన ఏటిగట్టు అభివృద్ధి పనులు నాణ్యత లేకపోవడంతో అనేక ప్రాంతాల్లో గట్టు జారిపోతోంది. ఏటిగట్టును ఆధునికీకరించినా పలుచోట్ల ప్రమాదకరంగానే ఉంది. ఏటిగట్టుపై రహదారి నిర్మాణానికి గతేడాది సెప్టెంబరు 16న కాపునేస్తం పథకం కింద లబ్ధిదారులకు నగదు జమ చేసేందుకు నిడదవోలు వచ్చిన సీఎం జగన్‌ విజ్జేశ్వరం ఆనకట్ట నుంచి పెనుగొండ మండలం సిద్ధాంతం వరకు రూ.66 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. గోదావరి హెడ్‌వర్క్స్‌ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా, అనుమతులు మాత్రం రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని