logo

గజిబిజి.. గందరగోళం

జిల్లాలో సోమవారం ప్రారంభమైన పోస్టల్‌ బ్యాలెట్‌ అంతా గజిబిజి.. గందరగోళంగా మారిపోయింది. కొన్ని నియోజకవర్గాల్లోని ఫెసిలిటేషన్‌ కేంద్రాల వద్ద కొందరు ఉద్యోగులు ఓటు వినియోగించుకోలేని పరిస్థితిలో వెనుతిరగాల్సి వచ్చింది.

Published : 07 May 2024 04:56 IST

పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగంలో తప్పని పాట్లు
న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం), దేవీచౌక్‌, గోపాలపురం

గోపాలపురంలో తమ ఓటు ఎక్కడ ఉందని అధికారులను నిలదీస్తున్న ఎన్నికల సిబ్బంది

జిల్లాలో సోమవారం ప్రారంభమైన పోస్టల్‌ బ్యాలెట్‌ అంతా గజిబిజి.. గందరగోళంగా మారిపోయింది. కొన్ని నియోజకవర్గాల్లోని ఫెసిలిటేషన్‌ కేంద్రాల వద్ద కొందరు ఉద్యోగులు ఓటు వినియోగించుకోలేని పరిస్థితిలో వెనుతిరగాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇతర జిల్లాల్లో ఓటు ఉండి ఇక్కడి ఎన్నికల విధుల్లో ఉన్నవారిలో కొందరు పీవోలు, ఏపీవోలకు పోస్టల్‌ బ్యాలెట్‌ రాకపోవడంతో మళ్లీ ఫారం-12 సమర్పించాల్సి వచ్చింది. ఏ నియోజకవర్గంలో ఓటుందో అక్కడ.. లేక ఎన్నికల డ్యూటీ ఎక్కడ పడిందో అక్కడి ఫెసిలిటేషన్‌ కేంద్రాల వద్ద పోస్టల్‌ బ్యాలెట్‌ వేసేందుకు వీలుంది. ఈ విషయంలో ముందునుంచి అవగాహన, పూర్తి సమాచారం  అందించకపోవడంతో చాలామంది వెనుదిరిగారు.

రాజమహేంద్రవరంలో జాబితాలో తమ పేరుందో లేదో పరిశీలించుకుంటూ..

  • రాజమహేంద్రవరం అర్బన్‌ నియోజకవర్గానికి సంబంధించి ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద ఉదయం 11.15 గంటల వరకు ప్రక్రియ ప్రారంభం కాలేదు. పోలింగ్‌ సామగ్రి, ఇతర ఏర్పాట్ల విషయంలో కొంతజాప్యం జరిగింది.
  • రంపచోడవరంలో ఓటున్న ఉద్యోగికి కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎన్నికల విధులు కేటాయించారు. ఎక్కడికి వెళ్లి వేయాలనే దానిపై సమాచారం లేకపోవడంతో ఇక్కడి ఫెసిలిటేషన్‌ కేంద్రానికి ఇబ్బందులు పడుతూ వచ్చి వెనుతిరగాల్సి వచ్చింది. జగ్గంపేటలో పోస్టల్‌ బ్యాలెట్‌ ముందుగా నిర్వహించడంతో అక్కడ కూడా ఓటు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది.

రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాలలో ఉదయం 11 గంటలకు ఉద్యోగుల నిరీక్షణ

  • అర్బన్‌ నియోజకవర్గంలోని కొందరికి గోపాలపురంలో ఎన్నికల డ్యూటీ వేశారు. ముందు ఎక్కడైనా ఫారం-12 సమర్పించవచ్చని చెప్పడంతో పక్క నియోజకవర్గంలో ఇటీవల నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఫారం-12 సమర్పించామని.. తీరా ఇప్పుడేమో జాబితాలో పేరు లేేకపోవడంతో దీనిపై అడిగితే సొంత నియోజకవర్గంలో లేక డ్యూటీ పడిన నియోజకవర్గంలోని శిక్షణ కేంద్రం వద్ద ఇవ్వాలని  చెబుతున్నారని పలువురు వాపోయారు.
  • గోపాలపురం అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన పోస్టల్‌ బ్యాలెట్‌లో తమ ఓటు ఎక్కడ అంటూ పీవో, ఏపీవోలు ఏఆర్వోను నిలదీశారు. ఫారం-12డి ఇచ్చినా ఓటు కనిపించడం లేకపోవడంతో తమకు ఓటు వినియోగించుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. ఈ గందరగోళం మధ్య మధ్యాహ్నం 3.15 గంటలకు ఓటింగ్‌ ప్రారంభమైంది.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని