logo

నమో గోదారి.. తెలుగు జనఝరి

వేదంలా ఘోషించే తీరాన.. జన గోదావరి పరవళ్లు తొక్కింది. ప్రజాకంటక వైకాపా పాలనపై కూటమి సమర నినాదం మోగించింది. దక్షిణ గంగ పరవళ్లు తొక్కే రాజమహేంద్రిలో ప్రజాగళమై గర్జించింది.

Published : 07 May 2024 05:25 IST

ప్రజాగళంలో... నమో.. నారా.. పవనోత్సాహం
ఈనాడు, కాకినాడ, రాజమహేంద్రవరం - న్యూస్‌టుడే, టి.నగర్‌, దానవాయిపేట, కంబాలచెరువు, కడియం, ధవళేశ్వరం, ఏవీఏ రోడ్డు, బొమ్మూరు

వేదంలా ఘోషించే తీరాన.. జన గోదావరి పరవళ్లు తొక్కింది. ప్రజాకంటక వైకాపా పాలనపై కూటమి సమర నినాదం మోగించింది. దక్షిణ గంగ పరవళ్లు తొక్కే రాజమహేంద్రిలో ప్రజాగళమై గర్జించింది. భాజపా అగ్రనేత, భారత ప్రధాని నరేంద్ర మోదీ, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఇతర కీలక నేతలు హాజరైన ప్రజాగళం బహిరంగ సభ సోమవారం దద్దరిల్లింది. రాష్ట్ర ప్రజానీకానికి మేమున్నామంటూ భరోసానిచ్చింది. కొత్త చరిత్రను లిఖించబోతున్నామంటూ స్పష్టమైన సందేశాన్నిచ్చింది. వెరసి ప్రజాగళం సూపర్‌ హిట్టయ్యింది.


  • ‘నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు.. రాజమహేంద్రవరం వాసులకు నమస్కారాలు.. గోదావరి మాతకు ప్రణామాలు..’ అంటూ తెలుగులో మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

  • తెలుగులో తొలి కావ్యాన్ని రచించిన ఆదికవి నన్నయ నడయాడిన స్థలం నుంచే కూటమి సరికొత్త చరిత్ర ప్రారంభమవుతోందని మోదీ చెప్పారు.

  • ప్రసంగానంతరం  హరీష్‌ మాథుర్‌ , నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని భుజం తట్టి మోదీ  ప్రోత్సహించారు.

సభా వేదిక పైనుంచి జనానికి అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ, పవన్‌కల్యాణ్‌, లోకేశ్‌, పురందేశ్వరి తదితరులు

రాజమహేంద్రవరం సమీప వేమగిరి జాతీయ రహదారి పక్కన ప్రజాగళం బహిరంగ సభ సోమవారం మధ్యాహ్నం జరిగింది. తూర్పుగోదావరి, కాకినాడ, డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు.. అభిమానులు, ప్రజలు తరలివచ్చారు.

జేజేలతో హోరెత్తి..: మోదీ, పవన్‌కల్యాణ్‌, లోకేశ్‌ వేదికపైకి వచ్చే సమయంలో మూడు పార్టీల శ్రేణుల నినాదాలతో సభ హోరెత్తింది. ప్లకార్డులు చూపుతూ.. అగ్రనేతలకు జేజేలు పలికారు. తెదేపా- భాజపా- జనసేన జెండాలతో ఉత్సాహంగా నృత్యాలు చేశారు. రాజమహేంద్రవరంలో స్థిరపడిన వందలాది ఉత్తరాది రాష్ట్రాల వారు ముందువరుసలో కూర్చున్నారు. కాషాయ పాగా ధరించి, కమలం గుర్తు పట్టుకుని, మోదీ మాస్కులు ధరించి ఉత్సాహంగా కనిపించారు.

యుద్ధానికి సిద్ధం: విల్లును ఎక్కుపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ


అగ్రనేతలు.. అభ్యర్థులు..

ప్రజాగళం వేదికపై ప్రధాని నరేంద్రమోదీకి ఎడమవైపున పవన్‌కల్యాణ్‌, కుడివైపు  భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, చంద్రబాబు తనయుడు లోకేశ్‌ కూర్చున్నారు.  ఎంపీ అభ్యర్థులు తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌, గంటి హరీష్‌మాథుర్‌, శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే అభ్యర్థులు  బుచ్చయ్యచౌదరి, నల్లమిల్లి , కందుల దుర్గేశ్‌, ఆదిరెడ్డి శ్రీనివాస్‌, మద్దిపాటి వెంకటరాజు, బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. భాజపా పూర్వ అధ్యక్షుడు సోమువీర్రాజు, సాగి కాశీవిశ్వనాథరాజు, సూర్యనారాయణరాజు, చిలుకూరి రామ్‌కుమార్‌ తదితరులు వేదికపై కూర్చున్నారు. భాజపా రాష్ట్ర ప్రచార కార్యదర్శి, లోక్‌సభ ఎన్నికల పర్యవేక్షకులు సాగి కాశీవిశ్వనాథరాజు అధ్యక్షతన సభ జరిగింది. మోదీ ప్రసంగాన్ని రాకా సుధాకర్‌ అనువదించారు.


జ్ఞాపకం ఉండి పోయేలా..

వేదికపైకి ప్రధాని మోదీ, పవన్‌కల్యాణ్‌ వచ్చినప్పుడు సభాప్రాంగణం మారుమోగింది. ఆయనతో పవన్‌కల్యాణ్‌, లోకేశ్‌ కాసేపు వేర్వేరుగా ముచ్చటించారు. లోకేశ్‌.. ప్రధానిని సత్కరించి వేంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు. పవన్‌కల్యాణ్‌ ప్రధాని మోదీ కాళ్లకు నమస్కరించగా వద్దని ఆయన వారించారు. అనంతరం పవన్‌కల్యాణ్‌ వెంకన్న జ్ఞాపికను ప్రధానికి అందించారు. నరసాపురం లోక్‌సభ అభ్యర్థి శ్రీనివాస వర్మ ప్రధానికి విల్లు బహూకరించారు.  పురందేశ్వరి  సత్కరించారు.


మండే ఎండల్లో.. ఉప్పొంగిన అభిమానం..

ఎండ అధికంగా ఉన్నా ప్రజలు పోటెత్తారు. సభా ప్రాంగణంలో ఆహుతులు ఇబ్బందులు పడకుండా కూలర్లు ఏర్పాటుచేశారు. వేదిక స్పష్టంగా కనిపించేలా 30 డిజిటల్‌ తెరలు పెట్టారు. భద్రత దృష్ట్యా నీటి సీసాలను ప్రాంగణంలోకి అనుమతించలేదు. మజ్జిగ, నీరు బకెట్లతో తీసుకెళ్లి గ్లాసులతో అందించారు.


కట్టుదిట్టంగా..

ప్రజాగళం సభకు ప్రధాని వచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ధవళేశ్వరం కూడలి నుంచి సభావేదిక వరకు కి.మీ మేర ఆంక్షలు విధించారు. గంట ముందు నుంచి పాదచారులను సైతం నడవనివ్వలేదు. కొందరు పొలాల్లో, నర్సరీల నుంచి నడుచుకుంటూ సభ వద్దకు చేరుకున్నారు. సభ ముగిసి ప్రధాని చాపర్‌లో వెళ్లిన అరగంట తర్వాత రాకపోకలకు అవకాశం ఇచ్చారు. కొందరు బారికేడ్లకు కట్టిన తాళ్లు విప్పుకొని బయటకొచ్చారు. ప్రధాని భద్రతకు సంబంధించి చిలకలూరిపేటలో చోటుచేసుకున్న వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోడానికి పోలీసులు అధిక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.


తళుకులీనిన ఉత్తరాది సంప్రదాయం

  • వీఐపీ గ్యాలరీలకు నీటి సీసాలను భద్రత కోణంలో ఆపేశారు. ఆ గ్యాలరీల్లో నీటి కోసం ఇబ్బందిపడ్డారు. సాధారణ ప్రజలకు నీటి వసతి కల్పించారు.
  • సభా నిర్వాహకులు మోదీ అని పిలవగా.. జనం నిరంతరాయంగా ఉచ్ఛరిస్తూ ఉత్సాహం ప్రదర్శించారు. 3.36 గంటలకు మోదీ వేదికపైకి చేరుకున్నారు.
  • ప్రత్యేక తలపాగాలతో వీఐపీ గ్యాలరీలో పలువురు ఉత్తరాది సంప్రదాయంతో తళుక్కుమన్నారు.

అనూహ్య స్పందన

  • పవన్‌ కల్యాణ్‌ను ప్రసంగించమని చెప్పగానే అభిమానులు, కార్యకర్తల నుంచి అనూహ్య స్పందన లభించింది. వరుస ప్రచారాలు, ప్రసంగాలతో ఆయన  గొంతు బొంగురు పోయింది.
  • పురందేశ్వరి, నారా లోకేష్‌ పది నిమిషాల చొప్పున ప్రసంగించగా.. పవన్‌కల్యాణ్‌ వారిద్దరి కంటే కాస్త ఎక్కువ సమయం మాట్లాడారు.

  • ‘ఫిర్‌ ఏక్‌బార్‌.. మోదీ సర్కార్‌’’.. అని లోకేష్‌ అనడంతో సభా ప్రాంగణంలో కేరింతలు కొట్టారు.
  • పవన్‌ అన్నకు..:  తన ప్రసంగంలో ‘నాకు అన్న సమానమైన పవన్‌ అన్నకు’ అని లోకేష్‌ అనగానే జనం అరిచారు.
  • లోకేష్‌ ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా రుచి చూడాలని మోదీని కోరారు.

ఉరకలెత్తిన ఉత్సాహం: రాజమహేంద్రవరంలోని ప్రజాగళం సభలో శ్రేణుల సంబరం

మా మద్దతు మీకే.. మది నిండుగా.. మోదీ ఉండగా..

సభకు తరలివస్తున్న కూటమి అభిమానులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని