logo

ఇప్పిస్తారా.. మీరిస్తారా..!

ప్రజలకు ఐటీ, జీఎస్‌టీ టాక్సుల గురించే తెలుసు. కానీ గుంటూరు నగరంలో ప్రజలకు మాత్రం కొత్తగా సీ టాక్స్‌ అనే పేరు వినిపిస్తోంది. ఇది తెలుసుకుని ముక్కున వేలేసుకుంటున్నారు.

Published : 23 May 2022 04:51 IST

ఈనాడు, అమరావతి

ప్రజలకు ఐటీ, జీఎస్‌టీ టాక్సుల గురించే తెలుసు. కానీ గుంటూరు నగరంలో ప్రజలకు మాత్రం కొత్తగా సీ టాక్స్‌ అనే పేరు వినిపిస్తోంది. ఇది తెలుసుకుని ముక్కున వేలేసుకుంటున్నారు. సీ టాక్స్‌ అంటే అదేనండీ కార్పొరేటర్‌ టాక్స్‌ అని అధికారులు విడమరిచి చెబితే వామ్మో ఇదేమిటని బెంబేలెత్తుతున్నారు. ఈ మధ్య కాలంలో గుంటూరు నగరంలో కొందరు టీపీఎస్‌లు, రెవెన్యూ విభాగానికి చెందిన ఆర్‌ఐలు ఇంటి నిర్మాణం చేపడుతున్నా, చేపట్టిన దానికి పన్ను వేయాలన్నా తొలుత సీ టాక్స్‌ సమర్పించుకోమని ప్రజలను కార్పొరేటర్ల గుమ్మం తొక్కించడం వివాదాస్పదమవుతోంది.

నగరంలో కొన్ని డివిజన్లలో ఇళ్లు కట్టుకోవాలన్నా.. దానికి ఆస్తి పన్ను వేయించుకోవాలన్నా, పేరు మార్చుకోవాలన్నా (టైటిల్‌ ట్రాన్స్‌ఫర్‌) ఏదైనా తమకు చెప్పి చేయాలి. ప్రతిదీ మా కనుసనల్లోనే జరగాలని ప్రణాళిక, రెవెన్యూ విభాగం ఉద్యోగులకు కార్పొరేటర్లు హుకుం జారీ చేయడం, వాటిని యంత్రాంగం పాటించడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు. ఇంటి ప్లాన్‌ ఆన్‌లైన్‌లో మంజూరైనా నిర్మాణం చేసుకోనీయకుండా టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్లు, ఏసీపీలను ఆ నిర్మాణం వద్దకు పంపి మరీ అడ్డుపడుతున్నారని కొందరు కార్పొరేటర్లపై బహిరంగంగానే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్లాన్‌ తీసుకుని ఉల్లంఘనలు లేకుండా నిర్మాణం చేసుకుంటున్నా నిర్మాణదారుడి నుంచి ఎంతో కొంత ఇప్పించాలి. వారివ్వకపోతే మీరైనా ఇవ్వాలని (అధికారులను ఉద్దేశించి) స్పష్టం చేసి ఒకవైపు ప్రజలు, మరోవైపు ఉద్యోగులను ముప్పతిప్పలు పెడుతున్నారనే అపవాదును కొందరు కార్పొరేటర్లు మూటగట్టుకున్నారు. అయినా ఈ వ్యవహారంపై మేయర్‌, కమిషనర్‌గానీ నోరు మెదపడం లేదు. పండరీపురంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఆయన్ని సీ టాక్స్‌ సమర్పించుకోవాలని లేదంటే నిర్మాణం ఆపేయాలని సూచించారు. మరో కంటి వైద్యుడిని ఇలాగే బెదిరించారు. వీరిద్దరూ వారికున్న పలుకుబడితో చివరకు తమ జోలికి రాకుండా చూసుకున్నారని ఉద్యోగవర్గాల సమాచారం.

ఓడినోళ్లదీ అదే బాట..

వైకాపా తరఫున గెలిచిన వారిలో కొందరు కార్పొరేటర్లు, ఆ పార్టీ తరఫున ఓటమిపాలైన వారిలో కొందరు ఉద్యోగులను గుప్పిట్లో పెట్టుకుని అక్రమార్జనకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కొందరు తమ పరిధులను దాటి ఎక్కడ నిర్మాణం చేసినా తనకు కప్పం కట్టాల్సిందేనని భయపెడుతున్నారు. బృందావన్‌గార్డెన్స్‌ 8వ లైను, చంద్రమౌళీనగర్‌ ఒకటో లైను, పట్టాభిపురం మెయిన్‌రోడ్‌లో-2, పండరీపురం 2, అశోక్‌నగర్‌ 1 దేవాపురంలో 2, కొత్తపేటలో 4, పట్నంబజార్‌, పాతగుంటూరు, ఏటీ అగ్రహారం, చుట్టుగుంట, నల్లపాడు, గుజ్జనగుండ్ల, జేకేసీ రోడ్డు, గోరంట్ల, రెడ్డిపాలెంలో పలు భవనాలకు అనుమతులు ఉన్నా డబ్బులు ముట్టజెప్పాల్సిందేనని కొందరు కార్పొరేటర్లు టీపీఎస్‌లను పంపి నిర్మాణాలు నిలుపుదల చేయించారని కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇటీవల ఆమె ప్రణాళికాధికారులతో సమీక్ష చేశారు. ఆ క్రమంలో ఓ టీపీఎస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని ఉద్యోగుల్లో ప్రచారం నడుస్తోంది. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సస్పెండ్‌ అవుతారని హెచ్చరించినట్లు తెలిసింది. ఇప్పటికైనా ఈ వ్యవహారంపై మేయర్‌, కమిషనర్లు స్పందించి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలి.

సెలవులో ఉద్యోగులు

కార్పొరేటర్లను మెప్పించలేక.. ప్రజలను డబ్బులు ఇవ్వమని ఒప్పించలేక ప్రణాళిక, రెవెన్యూ విభాగాలకు చెందిన ఉద్యోగులు కొందరు ఇప్పటికే సెలవులోకి జారుకోగా మరికొందరు తమను కార్యాలయ విధులకు మార్చాలని కమిషనర్‌ ఆయా విభాగాల అధిపతులకు లేఖలు పెట్టుకున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోవచ్ఛు నగర ప్రణాళిక విభాగానికి పెద్ద దిక్కుగా భావించే ఇన్‌ఛార్జి సీపీ మధుకుమార్‌ వారం క్రితమే సెలవులోకి వెళ్లిపోయారు. టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ (టీపీఎస్‌) స్రవంతి సెలవులో ఉన్నారు. రేపో, మాపో ఒకరిద్దరు టీపీఎస్‌లు సెలవులోకి వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కార్పొరేటర్లు అడిగే నెలవారీ మామూళ్లు ఇవ్వలేమని, తమను అవుట్‌డోర్‌ విధుల నుంచి తప్పించి కార్యాలయ విధులకు సర్దుబాటు చేయాలని రెవెన్యూ విభాగానికి చెందిన ముగ్గురు ఆర్‌.ఐలు, ఒక ఆర్వో రాతపూర్వకంగా కోరారు. మరో ఆర్వో ఈ బాధలు భరించలేక ఇప్పటికే మూడుసార్లు సెలవులోకి వెళ్లారు. ప్రణాళిక విభాగంలో కీలకమైన సీపీ, డీసీపీలు లేరు. రాష్ట్రంలో అత్యధిక ప్లాన్లు మంజూరయ్యేది గుంటూరులోనే. ఇక్కడ సాలీనా 1400 నుంచి 1600 ప్లాన్లు జారీ అవుతున్నాయి. ఏటా నగరపాలకకు భవన అనుమతుల ఫీజుల ఆదాయం రూ.60-70 కోట్లు వసూలవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని