logo

పల్లె కలలకు... జగన్‌ తూట్లు

వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది.

Updated : 26 Apr 2024 06:08 IST

వైకాపా పాలనలో పంచాయతీలు నిర్వీర్యం
విద్యుత్తు బిల్లుల పేరుతో ఆర్థిక సంఘం నిధులు ఖాళీ
ప్రత్తిపాడు, మేడికొండూరు, తుళ్లూరు, తాడికొండ, ఫిరంగిపురం గ్రామీణం, మంగళగిరి, న్యూస్‌టుడే

చెప్పిందిదీ..!
‘పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి చూపుతాం. గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.’ ఇవీ వేదికలపై సీఎం జగన్‌ నుంచి స్థానిక ఎమ్మెల్యేల వరకు తమ ఊకదంపుడు ఉపన్యాసాల్లో చెప్పే మాటలు.


చేసిందిదీ..!
‘పంచాతీయలను నిర్వీర్యం చేశారు. వైకాపా ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను మళ్లించి సర్పంచులను ఉత్సవ విగ్రహాల్లా మార్చింది. కనీసం బ్లీచింగ్‌ చల్లేందుకు కూడా నిధులు వెతుక్కోవాల్సి వస్తోంది.’ ఇవీ సర్పంచుల ఆవేదన

వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. గ్రామాల్లో రోడ్లు అభివృద్ధి, తాగునీరు, మురుగు కాలువలు, వీధి దీపాలు, విద్యుత్తు బల్బులు, పారిశుద్ధ్య కార్మికుల జీతాలు వంటి పనులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తుంది. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం పని చేస్తుంది. జనాభా ప్రాతిపదికన నిధులు విడుదల చేస్తారు. ఈ విధంగా మంజూరైన డబ్బులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయాలన్న నిబంధన ఉంది. అయితే వాటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం కరెంట్‌ బిల్లు పేరిట లాగేసుకుంది. పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలన్నా దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.


ఇక్కడ వింత పరిస్థితి..

ముఖ్యంగా తుళ్లూరు మండలంలో మొత్తం 19 గ్రామ పంచాయతీలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నీరుకొండ, కురగల్లు గ్రామాల్లో సర్పంచి ఎన్నికలు లేకపోవడంతో అసలు పాలకవర్గాలే ఏర్పడలేదు. దీంతో నిధుల్లేక ఆయా చోట్ల ప్రగతి పూర్తిగా పడకేసింది.


బ్లీచింగ్‌ కూడా కొనలేని పరిస్థితి..

- పూల నాగమణి, సర్పంచి, మేడికొండూరు

గతంలో ఆర్థిక సంఘం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించేది. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి ఇవ్వకపోగా ఆర్థిక సంఘం నిధులను కనీస సమాచారం లేకుండా విద్యుత్తు బకాయిలకు మళ్లించారు. బ్లీచింగ్‌ కూడా కొనలేని పరిస్థితికి తెచ్చారు.  


గళం వినిపించినా ఫలితం లేదు..

 - కల్లూరి శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు, సర్పంచుల సంఘం

మార్చి, 2024లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామ రూ.900 కోట్ల నిధులు ఇచ్చింది. ఈ నిధులను జగన్‌ ప్రభుత్వం దారిమళ్లీంచింది. మళ్లీ సర్పంచులు నిరసన తెలిపాల్సి వచ్చింది. చివరకు ఎన్నికల కమిషన్‌ను కలిసి వినతి పత్రం అందిస్తే  ఏప్రిల్‌ 18న జీవో ఇచ్చింది. కానీ నిధులు ఇంకా గ్రామ పంచాయతీ ఖాతాలకు రాలేదు. 


సొంత డబ్బులు వెచ్చిస్తున్నాం..

- కంభం పెద్దబాబు, సర్పంచి, గుండాలపాడు

రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలకు 2019 నుంచి 2024 మార్చి వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సంఘం నిధులు రూ.8,629 కోట్లు విడుదల చేసింది. వీటిని వైకాపా ప్రభుత్వం సర్పంచుల ప్రమేయం లేకుండా నేరుగా విద్యుత్తు బిల్లు రూపేణా మొత్తం లాగేసుకుంది. సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేయించాల్సిన పరిస్థితి నెలకొంది.


అభివృద్ధి ఎలా చేయగలం

- పాటిబండ్ల కృష్ణప్రసాద్‌, సర్పంచి, పెదపాలెం

మా పంచాయతీకి విద్యుత్తు బిల్లు నెలకు రూ. 50 వేలు వస్తుంది. నిర్వహణ ఖర్చులతో కలిపి ఏడాదికి రూ. 10.8 లక్షలు ఖర్చవుతుంది. ఆర్థిక సంఘ నిధులు రూ. 10 లక్షలు వీటికే సరిపోతున్నాయి. ఇక అభివృద్ధి ఎలా చేయగలం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని