logo

వేటపాలెంలో మహాత్ముడి అడుగు జాడలు!

స్వాతంత్య్రోద్యమం ముమ్మరంగా సాగుతున్న కాలం అది. ఉద్యమంలో భాగంగా మహాత్మాగాంధీ ఊరూరా తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ రోజుల్లో వేటపాలెంలో ఊటుకూరి సుబ్రాయశెట్టి కమలాంబ దంపతుల ఆధ్వర్యంలో ఒక పెంకుటింటిలో గ్రంథాలయం

Published : 15 Aug 2022 06:39 IST

గ్రంథాలయంలో నేటికీ భద్రంగా ఆయన చేతికర్ర


1947 ఆగస్టు 15 నాటి ఆంధ్రపత్రిక తొలి ప్రచురణ భద్రంగా ఫ్రేమ్‌ కట్టించిన దృశ్యం

వేటపాలెం, న్యూస్‌టుడే: స్వాతంత్య్రోద్యమం ముమ్మరంగా సాగుతున్న కాలం అది. ఉద్యమంలో భాగంగా మహాత్మాగాంధీ ఊరూరా తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ రోజుల్లో వేటపాలెంలో ఊటుకూరి సుబ్రాయశెట్టి కమలాంబ దంపతుల ఆధ్వర్యంలో ఒక పెంకుటింటిలో గ్రంథాలయం నిర్వహించేవారు. ఆ సమయంలో ఇంటింటికీ తిరిగి పుస్తకాలను పాఠకులకు అందించేవారు. కాలక్రమంలో గ్రంథాలయానికి కొత్త భవనం అవసరమైంది. దానికి శంకుస్థాపన చేసేందుకు 1929 ఏప్రిల్‌ 4న మహాత్ముడిని ఆహ్వానించగా విచ్చేశారు. ‘గ్రంథాలయం దినదినాభివృద్ధి చెందుగాక’ అని బాపూ తన స్వదస్తూరితో సందర్శకుల పుస్తకంలో రాశారు. దాన్ని సందర్శకుల కోసం లామినేషన్‌ చేయించి ఉంచారు. ఆసమయంలో ప్రజలు తండోపతండాలు ఆయన్ని చూసేందుకు రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ సమయంలో గాంధీజీ చేతికర్ర విరిగిపోవడంతో దాన్ని సారస్వతనికేతన్‌ గ్రంథాలయానికి ఇచ్చేశారు. ఇప్పటికీ అది ఆయన గుర్తుగా ఇక్కడ భద్రంగా ఉంది. నేటికీ గ్రంథాలయాన్ని సందర్శించిన పలువురు దాన్ని చూసి ముగ్ధులవుతున్నారు. ఆతరువాత 1935లో మరోసారి గాంధీజీ వచ్చి స్థానిక పంచాయతీ కార్యాలయంలో వద్ద విరాళాలు సేకరించారు. ఈ గ్రంథాలయంలో గాందీ చరిత్రకు సంబంధించి దాదాపు 2 వేలు పైచిలుకు పుస్తకాలు వివిధ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజు 1947 ఆగస్టు 15నాటి ఆంధ్రపత్రిక కాపీ నేటికీ గ్రంథాలయంలో ఫ్రేమ్‌ కట్టించి భద్రంగా ఉంచడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని