logo

చెరువులు చెరపడుతున్నారు..!

క్రోసూరు మండల కేంద్రంలో 494 ఎకరాల చిన్ననీటిపారుదల విభాగం చెరువు ఉంది.  శ్రీకృష్ణదేవరాయల కాలంలో తవ్విన పురాతన చెరువు ఇది. ఇందులో 22 ఎకరాలు వేరు చేసి నల్లచెరువుగా గుర్తించి బ్రిటీష్‌వాళ్ల కాలంలోనే ఇళ్ల నిర్మాణానికి ఇచ్చారు. 250 ఎకరాల విస్తీర్ణం వరకు ప్రస్తుతం నీరు నిలుస్తోంది.

Published : 18 Aug 2022 06:15 IST

ఉమ్మడి జిల్లాలో 837 ఎకరాలు పరాధీనం
ఈనాడు-అమరావతి


క్రోసూరు చెరువును ఆక్రమించి పంటలు సాగుచేసిన దృశ్యం

క్రోసూరు మండల కేంద్రంలో 494 ఎకరాల చిన్ననీటిపారుదల విభాగం చెరువు ఉంది.  శ్రీకృష్ణదేవరాయల కాలంలో తవ్విన పురాతన చెరువు ఇది. ఇందులో 22 ఎకరాలు వేరు చేసి నల్లచెరువుగా గుర్తించి బ్రిటీష్‌వాళ్ల కాలంలోనే ఇళ్ల నిర్మాణానికి ఇచ్చారు. 250 ఎకరాల విస్తీర్ణం వరకు ప్రస్తుతం నీరు నిలుస్తోంది. మిగిలిన భూభాగంలో నీరు నిల్వకపోవడంతో క్రమంగా ఆక్రమణలకు గురైంది కొందరైతే శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం సుమారు 150 ఎకరాల వరకు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది.

సామాజిక ఆస్తుల ఆక్రమణకు ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడం అక్రమార్కులకు కలసివస్తోంది. ఇదీ ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో చెరువుల ఆక్రమణ తీరు.

దర్జాగా చెరువుల కబ్జా
చిన్ననీటిపారుదలశాఖ ఆధ్వర్యంలోని 23చెరువుల పరిధిలో 224 ఎకరాల విస్తీర్ణం ఆక్రమణకు గురైంది. అదేవిధంగా పంచాయతీరాజ్‌ విభాగం పరిధిలో 108 చెరువుల్లో 613 ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయి.

మొత్తం 837 ఎకరాల చెరువు భూములు అక్రమణలో ఉన్నాయి. భూముల విలువ పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వభూములు ఎక్కడ ఉన్నా పర్యవేక్షణ లేకపోతే అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు.వర్షపునీటిని నిల్వచేసి వరదలకు అడ్డుకట్ట వేయడంతోపాటు పల్లె ప్రజలకు తాగు, సాగునీరు అందించే చెరువులను కొందరు స్వార్థపరులు కబ్జా చేసి శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. మున్సిపల్‌ పట్టణాలు, గుంటూరు నగరం చుట్టుపక్కల ఉన్న చెరువుభూములను ఆక్రమించి శాశ్వత నిర్మాణాలు చేపట్టి ఆవాసాలు ఏర్పాటుచేసుకున్నారు. వాగులు ఆక్రమించి ఎక్కడికక్కడ గోడలు కట్టడంతోపాటు మట్టితో వర్షపునీటికి అడ్డుకట్టలు వేయడంతో చాలా చెరువుల్లోకి నీరు చేరడం లేదు. కాలక్రమంలో చెరువులు కనుమరగయ్యే పరిస్థితి నెలకొంది. గుంటూరు జిల్లాకేంద్రానికి సమీపంలో ఉన్న తాడికొంండలో అక్కదేవ చెరువులో ప్రభుత్వకార్యాలయాలను నిర్మించడం గమనార్హం. రాజకీయపార్టీల అండ ఉన్న నేతలు చెరువుభూములను సాగుచేయడం ప్రారంభించి క్రమంగా సొంతం చేసుకున్నారు. కొందరైతే ఏకంగా చెరువుభూములను సైతం క్రయవిక్రయాలు చేస్తున్నారు. చెరువులకు నీరు తీసుకువచ్చే సప్లయిచానళ్లను ఎక్కడికక్కడ రైతులు గట్లు చెరిపేసి పొలాల్లో కలిపేసుకోవడంతో చెరువులకు నీటిచేరిక తగ్గిపోయింది. ఏటా నీరు చేరకపోవడంతో చెరువులోనే బోర్లు వేసి భూములు సాగుచేశారు. ఎప్పుడైనా భారీవర్షాలు పడి చెరువులకు నీరు చేరితే పంటలు ముంపునకు గురవుతాయనే ఆందోళనతో చెరువుకట్టలు తెంపి నీటిని దిగువకు వృథాగా వదిలేస్తున్నారు.

ఎవరికి వారే.... యమునాతీరే
జలవనరులకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా వాటిని అక్రమణకు గురికాకుండా జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో కలసి కమిటీ ఏర్పాటుచేశారు. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీ సమావేశమై జలవనరులను రక్షించడంతోపాటు ఆక్రమణకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. జిల్లాలో ఎప్పుడో ఒకసారి నామమాత్రపు సమీక్షలతో సరిపెడుతున్నారే కానీ నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.  ఎవరికివారు యమునాతీరే అన్నట్లు ప్రభుత్వశాఖల నడుమ సమన్వయలోపం కూడా ఆక్రమణదారులకు కలిసొచ్చింది. కొన్నేళ్లుగా ఆక్రమణల తొలగింపుపై దృష్టిపెట్టకపోవడంతో ఏకంగా శాశ్వతనిర్మాణాలు చేపడుతున్నారు. గతంలో చెరువులో నీరు ఉండటం వల్ల పరిసర బోరుబావుల్లో భూగర్భజలాలు పుష్కలంగా ఉండటంతోపాటు గ్రామానికి తాగునీటి కొరత లేని విషయాన్ని గ్రామస్థులు గుర్తించాలి. గ్రామస్థులు అధికార యంత్రాంగం సహకారంతో ఖాళీ చేయించడానికి ప్రయత్నించాలి. మన గ్రామానికి చెందిన చెరువును మనమే బాగుచేసుకోవాలన్న లక్ష్యంతో ముందడుగు వేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని