logo

ఎన్నాళ్లీ ఎదురు చూపులు ?

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉద్యానతోటలు సాగుచేసిన రైతులకు రెండేళ్లుగా సొమ్ము అందలేదు. ఉద్యానతోటల పెంపకాన్ని ప్రోత్సాహించాలనే లక్ష్యంతో రైతులకు మొక్కల కొనుగోలు నుంచి పెంపకం వరకు ఉపాధి హామీ పథకం కింద ప్రోత్సాహం అందించేవారు.

Published : 08 Oct 2022 04:23 IST

రెండేళ్లయినా అందని ప్రోత్సాహకం

ఉద్యాన రైతుల పరిస్థితి దయనీయం

ఈనాడు-గుంటూరు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉద్యానతోటలు సాగుచేసిన రైతులకు రెండేళ్లుగా సొమ్ము అందలేదు. ఉద్యానతోటల పెంపకాన్ని ప్రోత్సాహించాలనే లక్ష్యంతో రైతులకు మొక్కల కొనుగోలు నుంచి పెంపకం వరకు ఉపాధి హామీ పథకం కింద ప్రోత్సాహం అందించేవారు. అయితే గత రెండేళ్లుగా రైతులకు సొమ్ము చెల్లించకపోవడంతో వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వీటికి సామగ్రి విభాగం కింద సొమ్ము చెల్లించాలి. అయితే రాష్ట్రప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న భవనాల నిర్మాణానికి మాత్రమే చెల్లింపులు చేస్తోంది. సామగ్రి విభాగం కింద సమకూరే సొమ్ము మొత్తం గ్రామీణ ఆరోగ్యకేంద్రాలు, డిజిటల్‌ గ్రంథాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, గ్రామసచివాలయాలు, బీఎంసీయూలు నిర్మాణానికి నిధులు వెచ్చిస్తున్నారు. వీటికి కాకుండా సామగ్రి విభాగం సొమ్ము ఇతర పనులకు చెల్లించవద్దని మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో వాటికి చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనాలకు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించాలంటే రాబోయే ఏడాది వచ్చే సామగ్రి విభాగం కింద సమకూరే సొమ్ము కూడా సరిపోతుంది. ఈనేపథ్యంలో రైతులకు ఎప్పుడు చెల్లింపులు చేస్తారోనన్న ఆందోళనతో ప్రస్తుత ఏడాది ఉద్యానతోటల పెంపకానికి ఎవరూ ముందుకురాకపోవడం గమనార్హం.

రూ.20కోట్లకుపైగా బకాయిలు

గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో 2021వ సంవత్సరం నుంచి ఉద్యానతోటలు సాగుచేసిన రైతులకు ప్రోత్సాహకాలు అందించలేదు. అంతకుముందు 2020లో సాగుచేసిన రైతులకు కొందరికీ ఇప్పటికీ సొమ్ము చెల్లించలేదు. మూడు జిల్లాల పరిధిలో రూ.20కోట్లకుపైగా రైతులకు చెల్లించాల్సి ఉంది. మొక్కలు నాటడానికి గోతులు తవ్వడం, మొక్కల కొనుగోలు, రవాణా, నీరు పోయడంతోపాటు మూడేళ్లపాటు సంరక్షణకు ఉపాధి హామీ నిధులు ఇస్తారు. తొలిఏడాది మొక్కలు నాటిన వెంటనే అప్పటివరకు వెచ్చించిన సొమ్ములో నిబంధనల మేరకు సొమ్ము చెల్లిస్తారు. ప్రతినెలా క్షేత్రస్థాయి సిబ్బంది మొక్కల సంఖ్యను అనుసరించి వారికి బిల్లులు చెల్లిస్తారు. ఇలా మూడేళ్లపాటు రైతులకు ప్రోత్సాహకంగా అందిస్తారు. వ్యవసాయ పంటలతో పోల్చితే ఉద్యానపంటలు లాభదాయకంగా ఉండటంతో ఎక్కువమంది రైతులు వీటిసాగుకు మొగ్గుచూపుతున్నారు. సూక్ష్మ సేద్య పరికరాలైన బిందు, తుంపర్ల పరికరాలు అందుబాటులోకి రావడంతో ఉద్యానతోటల సాగుకు ఏటికేడు విస్తరిస్తోంది. ఈక్రమంలో ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే ప్రోత్సాహం కోసం చిన్న, సన్నకారు రైతులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సాగుచేసినవారు అప్పులు తెచ్చి మొక్కలు కొనుగోలు, ఎరువులు, సంరక్షణకు వెచ్చించారు. ఏళ్లు గడస్తున్నా సొమ్ము చెల్లించకపోవడంతో వడ్డీలు పెరిగిపోతున్నాయని వాపోతున్నారు. బిల్లులు చెల్లించాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తామేమి చేయలేమని, ఉన్నతాధికారుల సూచన మేరకు ప్రాధాన్యత భవనాలకే చెల్లింపులు చేస్తున్నామన్నారు. దీంతో చేసేదిలేక రైతులు నిస్సహాయస్థితిలో వెనుదిరిగిపోతున్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాలతో అడ్డుకట్ట

ఉద్యానతోటలు సాగుచేసిన రైతుల వివరాలను క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి సేకరించి ప్రత్యక్షంగా పరిశీలించి ఏపీవో బిల్లులు పథక అధికారి ఎంపీడీవోకు సమర్పిస్తారు. ఎంపీడీవో ఆమోదిస్తే సంబంధిత రైతు ఖాతాకు నేరుగా సొమ్ము జమవుతుంది. అయితే ఉన్నతాధికారుల సూచన మేరకు ఏపీవోలు సమర్పించిన బిల్లులు పథక అధికారి స్థాయిలో ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారు. దీంతో రైతులకు చెల్లింపులు ఆగిపోయాయి. ప్రాధాన్యత భవనాలకు కాకుండా ఉద్యానతోటల పెంపకం, సీసీరోడ్లు, మురుగునీటి కాలువలకు పొరపాటున ఎవరైనా బిల్లులు ఆమోదిస్తే వారిపై కఠినచర్యలు తీసుకుంటున్నారు. గతేడాది నుంచి డ్రాగన్‌ తోటల పెంపకానికి కూడా ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించడంతో పలువురు రూ.లక్షలు వెచ్చించి తోటలు వేశారు. ఇలా సాగుచేసిన రైతులు అప్పులు తెచ్చి సాగుచేస్తే బిల్లులు ఎప్పుడిస్తారని ఉపాధి హామీ అధికారులను నిలదీస్తున్నారు. ఈవిషయాన్ని రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని జిల్లా యంత్రాంగంపై రైతులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రాధాన్యత భవనాలు పూర్తిచేయాలని గడువు విధించడంతో ఎటూ పాలుపోని పరిస్థితి నెలకొందని జిల్లా అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రైతులకు ఉపయోగపడే పని చేయలేకపోతున్నామని, బకాయిలు పేరుకుపోవడంతో రైతులు ఆసక్తి ఉన్నా తోటల సాగుకు వెనుకడుగు వేస్తున్నారన్నారు. రైతులకు ఎప్పటికి సొమ్ము చెల్లిస్తారో తెలియని పరిస్థితి కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని