logo

రద్దీ ఉన్నా.. లైన్లేవి?

గుంటూరు రైల్వే డివిజన్‌కు ప్రయాణికుల ఆదరణ మెండుగా ఉంది. కానీ ఈ రద్దీకి తగ్గట్టు రైళ్లను నడపడంలో, సౌకర్యాల కల్పనలో అధికారుల ఉదాసీనత వైఖరి ప్రదర్శిస్తున్నారు.

Updated : 22 Nov 2022 04:39 IST

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే

గుంటూరు రైల్వే డివిజన్‌కు ప్రయాణికుల ఆదరణ మెండుగా ఉంది. కానీ ఈ రద్దీకి తగ్గట్టు రైళ్లను నడపడంలో, సౌకర్యాల కల్పనలో అధికారుల ఉదాసీనత వైఖరి ప్రదర్శిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా కొత్త లైన్లకు చాలినన్ని నిధుల్ని రైల్వే బోర్డు కేటాయించకపోవడమే ప్రధాన సమస్యగా ఉంది. ఇప్పుడు కొత్తగా రైళ్లను డివిజన్‌కు కేటాయించినా నడపలేని స్థితి. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ మంగళవారం గుంటూరుకు వస్తున్న సందర్భంగా న్యూస్‌టుడే అందిస్తున్న ప్రత్యేక కథనం.

గుంటూరు రైల్వే స్టేషన్‌లో ప్రస్తుతం ఏడు లైన్లు ఉన్నప్పటికీ కేవలం 1, 4 ప్లాట్‌ఫారాల వద్ద ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలిపేందుకు అవసరమైన మౌలిక వసతులున్నాయి. మిగిలిన లైన్లలో 24 బోగీల రైళ్లను నిలిపేందుకు సాంకేతిక ఇబ్బందులున్నాయి. అదేవిధంగా నిర్వహణ కోసం కోచ్‌పిట్‌ వద్దకు రైళ్లను సకాలంలో పంపలేకపోతున్నారు. దీనివల్ల గుంటూరు నుంచి ఉదయం 6 గంటలకు వెళ్లాల్సిన కాచిగూడ రైలు చాలాసార్లు ఆలస్యంగా బయలుదేరుతుండటం గమనార్హం.

యార్డు రీమోడలింగ్‌ అవసరం:

రైళ్ల రద్దీ దృష్ట్యా గుంటూరు రైల్వే స్టేషన్‌ యార్డు ఆధునికీకరించాలని కొన్నేళ్ల కిందటే నిర్ణయించారు. ప్రతిపాదనలు తయారు చేసి రైల్వే బోర్డుకు పంపారు. ఇప్పటివరకు అనుమతి రానందున పనులు ప్రారంభించలేకపోయారు. ఆధునికీకరణ పనులు చేయగలిగితే సిగ్నల్‌ కోసం స్టేషన్‌ బయట రైళ్లు నిలపాల్సిన పరిస్థితి ఉండదు. కంప్యూటర్‌ ద్వారా సిగ్నల్స్‌ అందుతాయి వెంట వెంటనే రైళ్ల రాకపోకలకు వీలవుతుంది.

ప్రయాణికుల రైళ్లు నడిపేలా..

నడికుడి-శ్రీకాళహస్తి మార్గంలో న్యూ పిడుగురాళ్ల-శావల్యాపురం పనులు పూర్తిచేశారు. ఆ మార్గంలో గత ఏడాది నుంచి కేవలం సరకుల రైళ్లను మాత్రమే నడుపుతున్నారు. ప్రయాణికుల రైళ్లను నడిపేందుకు అవసరమైన మానవ వనరులను కేటాయిస్తే ఈ మార్గాన రైళ్లు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది.

పూర్తికాని నీటి సరఫరా ప్రత్యేక లైను:

గుంటూరు రైల్వే స్టేషన్‌కు అవసరమైన నీటికోసం కేసీకెనాల్‌ నుంచి గుంటూరు వరకు ప్రత్యేక పైపులైను నిర్మాణం పనులు మొదలు పెట్టి ఐదేళ్లు దాటింది. ఇప్పటికీ పూర్తికాలేదు. ఈ లైను పూర్తయితే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

వంతెనల ప్రతిపాదనలేమయ్యాయి...?:

అరండల్‌పేట పైవంతెన(ఆర్‌వోబీ)పై వాహనాల రద్దీ విపరీతంగా పెరగడంతో దీనికి సమాంతరంగా మరో వంతెన నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ఈ ప్రాజెక్టును పట్టా లెక్కించేందుకు ఉన్న అడ్డంకుల్ని తొలగించాల్సిన అవసరంఉంది. అదేవిధంగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, సంజీవయ్యనగర్‌ రైల్వే గేటు వద్ద ఆర్‌వోబీలు, శ్యామలానగర్‌ వద్ద ఆర్‌యూబీల నిర్మాణంపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

సాగుతూనే ఉన్న కోచ్‌పిట్‌ పనులు:

నల్లపాడులో నిర్మిస్తున్న కొత్త కోచ్‌పిట్‌ పనులు గత మూడేళ్ల నుంచి చేస్తూనే ఉన్నారు. ఈ పనులు త్వరగా పూర్తిచేయగలిగితే గుంటూరు స్టేషన్‌లో ఉన్న రద్దీని కొంతమేర తగ్గించవచ్చు. కొత్త రైళ్లను ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది.

అనుమతిస్తే ప్రత్యామ్నాయ మార్గం :

గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలోని విష్ణుపురం మీదుగా మోటుమర్రి వరకు నూతన రైల్వే మార్గం నిర్మించారు. ఈ మార్గంలో గత రెండేళ్ల నుంచి సరకుల రవాణా రైళ్లు నడుపుతున్నారు. ప్రయాణికుల రైళ్లను నడిపేందుకు ఇప్పటివరకు అనుమతించకపోవడం గమనార్హం. ఈ మార్గంలో రైళ్లను అనుమతిస్తే విజయవాడ-సికింద్రాబాద్‌ మధ్య 60 కి.మీలు దూరం తగ్గనుంది. ప్రత్యామ్నాయ రైలుమార్గంగా ఉపయోగపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని