logo

సాంకేతికత తోడుగా.. అమ్మకు అండ

ప్రతి మహిళ తన జీవితంలో మాతృత్వం ఓ వరంగా భావిస్తుంది. గర్భం దాల్చినప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తల్లి, బిడ్డల సంరక్షణకు కేంద్రం పలు పథకాలను అమలు చేస్తున్నా, ఇంకా మాతా శిశు మరణాల శాతం ఆశించిన మేరకు తగ్గడం లేదు.

Published : 23 Mar 2023 05:12 IST

కిల్కారీ విధానంలో గర్భిణులు, బాలింతలకు సేవలు
మాతాశిశు మరణాల నివారణే లక్ష్యం
శావల్యాపురం, వినుకొండ, న్యూస్‌టుడే

గర్భిణికి వైద్య పరీక్షలు చేస్తున్న జిల్లా వైద్యాధికారిణి శోభారాణి (పాతచిత్రం)

ప్రతి మహిళ తన జీవితంలో మాతృత్వం ఓ వరంగా భావిస్తుంది. గర్భం దాల్చినప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తల్లి, బిడ్డల సంరక్షణకు కేంద్రం పలు పథకాలను అమలు చేస్తున్నా, ఇంకా మాతా శిశు మరణాల శాతం ఆశించిన మేరకు తగ్గడం లేదు. గర్భం దాల్చిన, బాలింత సమయాల్లో క్షేత్రస్థాయిలో సిబ్బంది పర్యవేక్షణ కొరవడంతో వైద్య పరీక్షలు, సలహాలు, టీకాలు పరంగా అందకపోవడమే దీనికి కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యలో కిల్కారీ పేరిట నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, వైద్య పరీక్షలు తదితర అంశాలపై అప్రమత్తం చేసేందుకు దీన్ని అమలు చేస్తున్నారు. గర్భిణులకు సరైన సమయంలో వైద్యసేవలు అందేలా చర్యలు చేపడతారు. ఈ క్రమంలో గర్భిణి త్రైమాసికం నుంచి 72 వారాల (చిన్నారికి ఏడాది వచ్చే వరకు) వారికి ఒక ఆడియో వాయిస్‌ రూపంలో అందుబాటులోకి తెచ్చారు. ఈ దశల్లో పాటించాల్సిన జాగ్రత్తలు ఆ సందేశం ద్వారా వినవచ్చు.

సందేశం ఎలా వస్తుందంటే..

నమోదైన ప్రతి గర్భిణి నుంచి సిబ్బంది చరవాణి నెంబరు తీసుకుంటారు. వారికి (0124-468800) నంబరు నుంచి ఫోన్‌ చేస్తారు. వారికి అందిన వివరాల ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయించుకోవాల్సిన వైద్యం గురించి వివరిస్తారు. ఆ సమయంలో మాట్లాడటం కుదరకపోతే 14423 నంబరుకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకునేలా ఈ విధానాన్ని రూపొందించారు. ఆండ్రాయిడ్‌ ఫోన్‌తో పాటు కీప్యాడ్‌ ఫోన్‌ ఉన్నా సేవలు వినియోగించుకోవచ్చు.

మారుమూల గ్రామాల్లో సైతం

మారుమూల గ్రామాల్లో సైతం గర్భిణులు, బాలింతలకు సకాలంలో వైద్యసేవలు అందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. క్షేత్రస్థాయిలో సిబ్బందికి అవగాహన పెరుగుతుంది. మాతా శిశు మరణాలను చాలా వరకు నివారించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని వైద్య అధికారులు పేర్కొంటున్నారు.


ఎంతో ప్రయోజనం

- సయ్యద్‌ ఇబ్రహీమ్‌ వైద్యాధికారి శావల్యాపురం

కిల్కారీ విధానం గర్భిణులు, బాలింతలకు ప్రయోజనం. గర్భిణికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేలా చరవాణి నంబరు ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. స్థానిక ఆరోగ్య, ఆశ కార్యకర్తలు కూడా కీలకంగా పని చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య పరిస్థితిపై వారు సమగ్ర నివేదిక అందించాలి. అప్పుడే వారిక సరైన  వైద్యసేవలు అందుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని