logo

మళ్లీ బాదేస్తున్నారు!

మరో పన్నుల మోతకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్‌ 1 నుంచి పట్టణ, నగర పంచాయతీల్లోని నివాస, వాణిజ్య భవనాలు, ఖాళీ స్థలాలపై పన్ను మోత మోగనుంది. ఇప్పుడున్న పన్నుపై 15 శాతం చొప్పున పెంపుదల ఉండనుంది. దీనికి సంబంధించి నోటీసుల్ని మున్సిపాల్టీలు సిద్ధం చేస్తున్నాయి.

Updated : 31 Mar 2023 06:07 IST

ఆస్తి, ఖాళీస్థలాల పన్ను 15 శాతం పెంపు
ఒకటి నుంచి అమలుకు సన్నాహాలు
సత్తెనపల్లి, పిడుగురాళ్ల, న్యూస్‌టుడే

సత్తెనపల్లి మున్సిపల్‌ కార్యాలయం

రో పన్నుల మోతకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్‌ 1 నుంచి పట్టణ, నగర పంచాయతీల్లోని నివాస, వాణిజ్య భవనాలు, ఖాళీ స్థలాలపై పన్ను మోత మోగనుంది. ఇప్పుడున్న పన్నుపై 15 శాతం చొప్పున పెంపుదల ఉండనుంది. దీనికి సంబంధించి నోటీసుల్ని మున్సిపాల్టీలు సిద్ధం చేస్తున్నాయి. 5నుంచి నోటీసులు ఇవ్వనున్నారు. జిల్లా వాసులపై రూ.కోట్ల భారం పడనుంది.

రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా..: గతంలో రెవెన్యూ జోన్లకు అనుగుణంగా చదరపు అడుగుకు పన్ను పెంపుదల ఉండేది. 2020-21 నుంచి పన్ను పెంపుదలలో ప్రస్తుత ప్రభుత్వం మార్పులు చేసింది. జీవో 198 ప్రకారం రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా పెంపుదల నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ విధానంలో రెండేళ్ల నుంచి ఏడాదికి 15 శాతం చొప్పున పన్నులు పెంచుతూ వస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కాబోతుంది. ఈక్రమంలో నోటీసులు సిద్ధం చేస్తున్నారు.

అభ్యంతరాలు వ్యక్తమైనా..

ఆస్తి మూలధనం విలువ ఆధారంగా పన్నుల పెంపుదలపై పట్టణ ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా వాటిని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆస్తిపన్ను భారం మోయలేకున్నామని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లిన ప్రజాప్రతినిధుల్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. సత్తెనపల్లిలో 20వ వార్డుతోపాటు 24వ వార్డులో ఆస్తిపన్ను పెంపుదలపై మంత్రి అంబటి రాంబాబును భవన యజమానులు ప్రశ్నించగా పరిశీలించాలని ఆయన అధికారులకు సూచించారు.
* వచ్చే నెల 1 నుంచి ఆస్తిపన్ను పెంచితే ఆ భారం అద్దెలకు ఉండే వారిపై పడుతుంది. కొవిడ్‌ తర్వాత చాలా కుటుంబాలు పట్టణాల నుంచి గ్రామాలకు వలస వెళ్లాయి. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఇప్పుడిప్పుడే ఆయా కుటుంబాలు వస్తున్నాయి. పన్నుల భారం కోణంలో అద్దెలు పెంచితే పేద, మధ్యతరగతి వర్గాల జీవనంపై పరోక్షంగా ప్రభావం చూపించే అవకాశముంది.


రూ.కోట్లలో భారం

పల్నాడు జిల్లాలో ఆరు పట్టణాలు, రెండు నగర పంచాయతీలు ఉన్నాయి. 1,32,258 అసెస్‌మెంట్లకు ఆస్తిపన్ను విధిస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి అన్ని కలిపి రూ.46.74 కోట్లు డిమాండుగా ఉంది. 15 శాతం పెంపుదలతో రూ.7.01 కోట్ల అదనపు భారం పడనుంది. అత్యధికంగా నరసరావుపేట పట్టణంలో రూ.14.22 కోట్లు ప్రస్తుతం డిమాండుగా ఉంటే రూ.2.13 కోట్లు, చిలకలూరిపేటలో రూ.11.53 కోట్లకు అదనంగా రూ.1.73 కోట్లు, సత్తెనపల్లిలో రూ.5.57 కోట్లతోపాటు అదనంగా రూ.83.55 లక్షలు భారం పడబోతుంది.

ఖాళీ స్థలాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 4,653 అసెస్‌మెంట్లు ఉన్నాయి. వాటికి రూ.2.49 కోట్లు డిమాండుగా ఉంది. వీటిపై 15 శాతం పెంపుదలతో అదనంగా రూ.37.35 లక్షల భారం మోపనున్నారు.

నివాస గృహాలపై 15 శాతం భారం తప్పనిసరి అని, వాణిజ్య భవనాలతోపాటు నూతన అసెస్‌మెంట్లపై భారం కొంతమేరకు తగ్గవచ్చని అధికారులు చెబుతున్నారు.

వచ్చే నెల 5 నుంచి పన్నుల పెంపుదలకు అనుగుణంగా సిద్ధం చేసిన డిమాండు నోటీసులు అందజేయనున్నారు. అన్ని మున్సిపాల్టీల్లో సన్నాహాలు పూర్తయినట్లు అధికారులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని