logo

ఉత్తమ ప్రదర్శనగా ‘నాన్న! నేనొచ్చేస్తా’

లింగారావుపాలెంలో మూడు రోజులుగా నిర్వహించిన కొండవీటి కళా పరిషత్‌ నాటికల పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. అర్ధరాత్రి నిర్వహించిన బహిరంగ సభలో న్యాయనిర్ణేతలు పోటీల్లో గెలుపొందిన నాటికల వివరాలు వెల్లడించారు.

Updated : 25 Apr 2023 05:55 IST

‘నాన్న! నేనొచ్చేస్తా’, నాటిక దర్శకురాలు అమృతలహరికి బహుమతి అందజేస్తున్న కళా పరిషత్‌ సభ్యులు

యడ్లపాడు, న్యూస్‌టుడే: లింగారావుపాలెంలో మూడు రోజులుగా నిర్వహించిన కొండవీటి కళా పరిషత్‌ నాటికల పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. అర్ధరాత్రి నిర్వహించిన బహిరంగ సభలో న్యాయనిర్ణేతలు పోటీల్లో గెలుపొందిన నాటికల వివరాలు వెల్లడించారు. అనంతరం కళా పరిషత్‌ కార్యవర్గ సభ్యులు, అతిథులు విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రదర్శనలకు వరుసగా రూ.20 వేలు, రూ.19 వేలు, రూ.18 వేలుతో పాటు జ్ఞాపిక అందజేశారు. జ్యూరీలో గెలుపొందిన ప్రదర్శనకు రూ.17 వేలు, జ్ఞాపిక అందజేశారు. ఉత్తమ దర్శకుడికి రూ.3 వేలు, ఉత్తమ రచయితకు రూ.2 వేలు, వ్యక్తిగత విభాగంలో ప్రతిభ కనబరిచిన నటులకు రూ.వెయ్యి వంతున బహుమతులు అందజేశారు. పోటీల్లో పాల్గొన్న నాటికల నిర్వాహకులకు ప్రదర్శన పారితోషికం రూ.15 వేలు అందజేశారు.

బహుమతులు అందుకున్న ప్రదర్శనలు

ఉత్తమ ప్రదర్శనగా అమృతలహరి థియేటర్‌ ఆర్ట్స్‌, గుంటూరు వారి ‘నాన్న! నేనొచ్చేస్తా’, ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా చైతన్య కళాభారతి, కరీంనగర్‌ వారి ‘చీకటి పువ్వు’, ఉత్తమ తృతీయ ప్రదర్శనగా సిరిమువ్వ కల్చరల్‌ అసోసియేషన్‌, హైదరాబాదు వారి ‘థింక్‌’, జ్యూరీ ప్రదర్శనగా కళాంజలి హైదరాబాదు వారి ‘రైతే రాజు’ గెలుపొందాయి. ఉత్తమ దర్శకుడిగా మంచాల రమేష్‌(చీకటి పువ్వు), ఉత్తమ రచయిత తాళ్లాబత్తుల వెంకటేశ్వరరావు(నాన్నా నేనొచ్చేస్తా) గెలుపొందారు. వ్యక్తిగత విభాగంలో ఉత్తమ నటుడు సతీష్‌కుమార్‌(థింక్‌), ఉత్తమ నటి గుడివాడ లహరి(చీకటి పువ్వు), ఉత్తమ ప్రతినాయకుడు గోపరాజు విజయ్‌(ప్రేమతో నాన్న), ఉత్తమ హాస్యనటుడు టి.వెంకటేశ్వరరావు (నాన్న నేనొచ్చేస్తా), ఉత్తమ సహాయ నటి కుసుమసాయి(కాపలా), ఉత్తమ సహాయ నటుడు ఎస్‌కేడీ హసన్‌(నాన్న నేనొచ్చేస్తా), ఉత్తమ క్యారెక్టర్‌ నటి అమృతవర్షిణి (నాన్న నేనొచ్చేస్తా), ఉత్తమ క్యారెక్టర్‌ నటుడు కేశవాచార్యులు(స్థిరాస్తి), ఉత్తమ సంగీతం నాగరాజు(చీకటి పువ్వు), ఉత్తమ రంగాలంకరణ నోరి రామ్మోహన్‌(వెండి అంచులు), ఉత్తమ ఆహార్యం అమృతవర్షిణి(థింక్‌), మరో ఆరుగురికి జ్యూరీ బహుమతులు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని