logo

ముచ్చటగా.. మూడో వాహనం!

డివిజన్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కార్పొరేటర్లు నెత్తి నోరు కొట్టుకుంటున్నా వారి మొర ఆలకించని నగరపాలక అనవసర వ్యయాలకు పెద్దపీట వేస్తోందనే విమర్శలను మూటగట్టుకుంటోంది.

Updated : 31 May 2023 06:25 IST

రూ.42 లక్షలకు పైగా సాధారణ నిధుల వెచ్చింపు
ప్రభుత్వ అనుమతి లేకుండానే కొనుగోలు
నగరపాలక తీరుపై విమర్శలు

ఈనాడు, అమరావతి: డివిజన్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కార్పొరేటర్లు నెత్తి నోరు కొట్టుకుంటున్నా వారి మొర ఆలకించని నగరపాలక అనవసర వ్యయాలకు పెద్దపీట వేస్తోందనే విమర్శలను మూటగట్టుకుంటోంది. విధి నిర్వహణలో భాగంగా కమిషనర్‌ ప్రయాణించడానికి ఇప్పటికే రెండు వాహనాలు ఉన్నాయి. అవి రెండూ మంచి కండీషన్‌లోనే ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఇన్నోవా కాగా మరొకటి స్కార్పియో. అవి చాలవన్నట్లు ఇటీవల మూడో వాహనాన్ని కొనుగోలు చేశారు. దాని కొనుగోలుకు అక్షరాలా రూ.42 లక్షలకు పైగా వెచ్చించారు. అవి కూడా నగరపాలక జనరల్‌ ఫండ్స్‌ నిధులే. సాధారణగా జనరల్‌ ఫండ్స్‌ను ప్రజాప్రయోజనం కోసం వెచ్చించాలి. ప్రజల నుంచి స్వీకరించే పన్నుల ఆదాయాల్ని జనరల్‌ ఫండ్స్‌ ఖాతాలో చూపుతారు. ఆ నిధులు తిరిగి నగరంలో మౌలిక వసతుల కల్పనకే వినియోగించాలి. ఇందుకు విరుద్ధంగా వాహనం కొనుగోలుకు వెచ్చించడం ఏమిటి? నగరపాలక ఆదాయం తగ్గుతున్న వేళ ఇలాంటి ఆడంబరాలు ఎందుకు? ఇప్పటికే రెండు వాహనాలు ఉండగా మూడో వాహనం కొనుగోలుకు స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలపడం ఏమిటని ఉద్యోగుల్లోనే చర్చ జరుగుతోంది. దాని కొనుగోలుకు ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా ఆమోదం తెలిపారనే విమర్శలు స్టాండింగ్‌ కమిటీపై వచ్చాయి. డివిజన్ల అభివృద్ధికి నిధులు లేవని చెప్పే పాలకులు, అధికారులు ఈ వాహనం కొనుగోలుకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని కొందరు కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా ఆ వాహనం కొనుగోలుకు కేవలం స్టాండింగ్‌ కమిటీ ఆమోదం ఒక్కటే సరిపోదు. ప్రభుత్వ అనుమతి ఉండాలి. అయితే ప్రభుత్వ అనుమతి లేకుండానే హడావుడిగా వాహనాన్ని కొనుగోలు చేయడం గమనార్హం. దీనిపై వాహనాల వ్యవహారాలు చూసే కార్యనిర్వాహక ఇంజినీరింగ్‌ అధికారి కొండారెడ్డిని వివరణ కోరగా స్టాండింగ్‌ కమిటీ ఆమోదం పొందామని, ప్రభుత్వ అనుమతికి దస్త్రం పంపామన్నారు. ఆ దస్త్రానికి ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాకుండానే వాహనం ఎలా కొనుగోలు చేశారని ప్రశ్నిస్తే రొటీన్‌గానే అనుమతి వస్తుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని