logo

పుస్తకాలు ఉర్దూలో... బోధన ఇతర భాషల్లో...

ఉర్దూ పాఠశాలల్లో చదివే పిల్లల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. పాఠాలు ఉర్దూ భాషలో ఉండటం, బోధన మాత్రం తెలుగు, ఆంగ్లంలలో జరుగుతుండటంతో పరీక్షల సమయంలో తిప్పలు పడుతున్నారు.

Published : 08 Jun 2023 04:39 IST

ఉర్దూ పాఠశాల

తాడేపల్లి, న్యూస్‌టుడే: ఉర్దూ పాఠశాలల్లో చదివే పిల్లల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. పాఠాలు ఉర్దూ భాషలో ఉండటం, బోధన మాత్రం తెలుగు, ఆంగ్లంలలో జరుగుతుండటంతో పరీక్షల సమయంలో తిప్పలు పడుతున్నారు. గతేడాది ఈ సమస్యను తీర్చేందుకు ఉర్దూ-ఆంగ్లంలలో పాఠ్యాంశాలు ముద్రించి ఇస్తామని విద్యాశాఖాధికారులు చెప్పినప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఈ విద్యా సంవత్సరంలోనైనా అందుబాటులోకి తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

పాఠాలు అర్థంకాక అవస్థలు...

జిల్లాలో దాదాపు 140 ఉర్దూ ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిల్లో 5,000 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. 1వ తరగతి నుంచి 5 వరకు ఉర్దూ భాషలో ముద్రితమైన పాఠ్య పుస్తకాలు ఇచ్చి ఉర్దూలోనే బోధన చేస్తున్నారు. 6వ తరగతి నుంచి ఆ మాధ్యమంలో చదివే అవకాశం లేకపోవడంతో కచ్చితంగా ఆంగ్లం, తెలుగులోనే పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. దీంతో బాలబాలికలు ఒక్కసారిగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పాఠాలు అర్థం కాక భయంతో బడి మానేస్తున్నారు. తెలుగు మాధ్యమంలో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పాఠ్య పుస్తకాల్లో తెలుగు-ఆంగ్లం రెండు భాషల్లో పాఠాలున్నాయి. దీని వల్ల చిన్నారులకు ఆంగ్లంపై కాస్త అవగాహన కలుగుతోంది. 6వ తరగతిలో వారు ఆంగ్ల మాధ్యమంలోకి మారినప్పటికీ ఇబ్బంది ఉండదు. ఉర్దూ స్కూళ్లలో ముస్లిం చిన్నారులతో పాటు ఇతర మతాలు, కులాలకు చెందిన పిల్లలూ చదువుతుంటారు. వారికి కూడా అర్థమయ్యేలా ఉర్దూతో పాటు తెలుగు-ఆంగ్లంలో పాఠ్యాంశాలు ముద్రించి బోధించేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

గతేడాది నెరవేరని హామీ...

గతేడాది ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉర్దూ-ఆంగ్లంలో పాఠాలుండే పుస్తకాలు ఇస్తామన్నారు. ఇవి కేవలం పట్టణ స్థాయిలోనే కొద్ది స్కూళ్లకే మాత్రమే అందాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉర్దూ విద్యాలయాలకు ఇచ్చిన పుస్తకాలన్నీ ఆ భాషలోనే ఉన్నాయి. పిల్లల సౌకర్యం కోసం ఉపాధ్యాయులు మార్కెట్‌లో తెలుగు-ఆంగ్లం పుస్తకాలు కొనుకొచ్చి పాఠాలు బోధించారు. అయితే సమ్మెటివ్‌, ఫార్మెటివ్‌ ప్రశ్నాపత్రాలన్నీ ఉర్దూలోనే ఉండటంతో అర్థం కాక చిన్నారులు అయోమయానికి గురయ్యారు. ఈ ఇబ్బందిని ఈ ఏడాదైనా లేకుండా చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని