logo

AP News: తెలుగు రాద్దామనుకుంటే.. హిందీ ప్రశ్నపత్రం వచ్చింది

కస్తూర్బా విద్యాలయం ఉపాధ్యాయినులు, సిబ్బంది చేసిన తప్పిదంతో పదో తరగతి విద్యార్థినికి అన్యాయం జరిగింది. బాధితురాలి వివరాల మేరకు .. కారంపూడిలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థిని బాణావత్‌ ప్రియాంకబాయి పదోతరగతి చదువుతోంది.

Updated : 19 Mar 2024 07:59 IST

ఉపాధ్యాయుల తప్పిదంతో పదో తరగతి విద్యార్థినికి అన్యాయం

హిందీ పేపరు చూపిస్తున్న ప్రియాంకబాయి

కారంపూడి: కస్తూర్బా విద్యాలయం ఉపాధ్యాయినులు, సిబ్బంది చేసిన తప్పిదంతో పదో తరగతి విద్యార్థినికి అన్యాయం జరిగింది. బాధితురాలి వివరాల మేరకు .. కారంపూడిలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థిని బాణావత్‌ ప్రియాంకబాయి పదోతరగతి చదువుతోంది. సోమవారం నుంచి పది పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలుగు పరీక్ష రాసేందుకు విద్యార్థిని ఆదర్శ పాఠశాలలోని పరీక్షా కేంద్రానికి వెళ్లింది. అక్కడ ఇన్విజిలేటర్‌ హిందీ ప్రశ్నపత్రం ఇవ్వడంతో విద్యార్థిని అవాక్కైంది. తాను తెలుగు మీడియం చదువుతున్నానని, ప్రథమ భాషగా తెలుగు పరీక్ష రాయాల్సి ఉందని విద్యార్థిని చెప్పినా వినలేదు. హాల్‌ టిక్కెట్టులో ప్రథమ భాష హిందీ నమోదైందని, అందువల్లనే హిందీ పేపరు ఇస్తున్నట్లు ఇన్విజిలేటర్‌ వెల్లడించారు. దీంతో ఆమె బోరున విలపించింది. దిక్కుతోచని స్థితిలో పరీక్ష ముగిసేవరకు పరీక్ష గదిలోనే కూర్చుని ఉండిపోయింది. పరీక్ష సమయం ముగిసిన వెంటనే జరిగిన విషయాన్ని విద్యాలయం ప్రిన్సిపల్‌కు తెలిపింది. కుటుంబీకులు విద్యాలయం సిబ్బందిని ప్రశ్నించగా విద్యార్థిని దరఖాస్తు చేసే సమయంలోనే తప్పు జరిగిందని, విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని పేర్కొన్నారు. అయితే విద్యాలయం ఉపాధ్యాయినులు, సిబ్బంది దరఖాస్తును క్షుణంగా పరిశీలించి, వివరాలు పంపాల్సి ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని