logo

ఆర్టీసీ నగరబాట హామీ.. నగుబాటేనోయి!

  గుంటూరు నగరంలో 11 లక్షల మంది నివసిస్తున్నారు. రోజు వారీగా లక్ష మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. 159 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నగరం విస్తరించింది

Published : 28 Mar 2024 06:14 IST

సిటీ సర్వీసుల ప్రారంభం ఎప్పుడు?

ఆటో ఛార్జీలతో పేదలపై భారం

గుంటూరు ఆర్టీసీ బస్టాండు బయట ఆటోల రద్దీ

 గుంటూరు నగరంలో 11 లక్షల మంది నివసిస్తున్నారు. రోజు వారీగా లక్ష మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. 159 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నగరం విస్తరించింది. దీంతో శివారు ప్రాంతాల నుంచి కీలకమైన ఆర్టీసీ బస్టాండు, ఆస్పత్రులు, రైల్వేస్టేషన్‌, మార్కెట్‌, వివిధ విద్యా సంస్థలకు చేరుకోవడానికి చాలా దూరం ప్రయాణించాలి. నగరానికి సమీప మండల కేంద్రాలు, గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం రోజువారీగా రాకపోకలు సాగించేవారు ఉన్నారు. ఆర్టీసీ సిటీ సర్వీసులు నగరంలో తిప్పకపోవడంతో ప్రైవేటు బస్సులు, ఆటోలను సామాన్యులు ఆశ్రయించాల్సి వస్తోంది. ఒకచోట నుంచి మరోచోటకు చేరుకోవాలంటే ఆటో ఎక్కి దిగితే రూ.20 వసూలు చేస్తున్నారు. పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరగడంతో ఆటో ఛార్జీలు పెంచేశారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజల జేబుకు చిల్లుపడుతోంది.

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, పట్నంబజారు : గుంటూరు నగరంలో ఆర్టీసీ సిటీ సర్వీసులు తిప్పాలని 2017లో నిర్ణయించి కొన్నాళ్ల పాటు నడిపారు. వివిధ ప్రాంతాల నుంచి తెనాలి, మంగళగిరి, చేబ్రోలు తదితర ప్రాంతాలతో అనుసంధానం చేశారు. ఇలా 60 సర్వీసులు తిరుగుతున్నా సకాలంలో సమయానికి బస్సులు రాక నగరవాసులు అందుబాటులో ఉన్న ప్రైవేటు సర్వీసులు, ఆటోల్లో వెళ్లిపోయేవారు. దీని వల్ల ఆర్టీసీలో రద్దీ కనిపించేది కాదు. ప్రణాళిక లోపం, సరైన పర్యవేక్షణ కొరవడి కొన్ని నెలలకే గిట్టుబాటు కాదని ఆపేశారు. నిజానికి నగరంలో ప్రధాన మార్గాలు, కీలక ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఆర్టీసీ సర్వీసులు నడపాల్సి ఉంది. నగరంలోనే ఆర్టీసీ బస్టాండు నుంచి అన్ని ప్రధాన ప్రాంతాలకు ఎక్కువ సర్వీసులు నడిపితే ప్రయాణికుల ఆదరణ పొందవచ్చు. ప్రధాన మార్గాలు విస్తరించినందున ఉద్యోగులు, విద్యార్థులు విద్యా సంస్థలు, కార్యాలయాలకు వెళ్లే సమయానికి అనుకూలంగా సర్వీసులు ఉంటే వారి ఆదరణ పొందవచ్చు. కాలుష్యం, ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా ప్రజలు ప్రజారవాణాకు మొగ్గుచూపే అవకాశం ఉంది.

కనీస ఛార్జీ రూ.20..

నగరంలో ఆటో ఎక్కిదిగితే దూరంతో సంబంధం లేకుండా రూ.20 వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు అయితే కనీస ఛార్జీ రూ.10 కావడంతో తక్కువ దూరం ప్రయాణించేవారికి కలిసొస్తుంది. దీనికితోడు బస్సులో సౌకర్యవంతంగా ఉంటుంది. శివారు కాలనీలకు వరుసగా సర్వీసులు నడిపితే ప్రయాణికుల ఆదరణ లభిస్తుంది. కొన్నేళ్లుగా నగరవాసులు ఆర్టీసీ బస్సులు నడపాలని కోరుతున్నారు. గత అనుభవాలు సాకుగా చూపి ఆర్టీసీ నిరాకరిస్తోంది. నగర ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారు. గత అయిదేళ్లలో నగర నేతలు చొరవ చూపకపోవడం గమనార్హం.

ప్రణాళిక అమలు చేస్తే..

ఆర్టీసీ బస్సులు ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తాయని నగరవాసులు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో ఎక్కించడంతో పాటు రద్దీని అనుసరించి ప్రతి అయిదు నుంచి పది నిమిషాల వ్యవధిలో ఒక సర్వీసు వెళ్లేలా ప్రణాళిక అమలు చేస్తే ఆదరణ ఉంటుంది. ఆర్టీసీ సిటీ సర్వీసుల ముందు ఆటోలు ఆపి ప్రయాణికులను ఎక్కించకుండా చర్యలు తీసుకోవాలి. గుంటూరు నగరంలో ప్రధాన రోడ్లు వెడల్పుగానే ఉన్నందున ఆయా ప్రాంతాలకు సర్వీసులు నడపాలి. ప్రధాన ప్రాంతాల నడుమ వీలైనన్ని సర్వీసులు నడుపుతూ ఆర్టీసీ బస్సు వస్తుందనే నమ్మకం నగరవాసుల్లో కల్పిస్తే కొంతసేపు వేచిచూసి అయినా ప్రయాణిస్తారు.

ఇలా చేస్తే మేలు..

శంకర్‌విలాస్‌కూడలి నుంచి బయలుదేరే సర్వీసు అమరావతి రోడ్డు మీదుగా ఇన్నర్‌రింగ్‌రోడ్డు చేరుకోవాలి. అక్కడి నుంచి విజయవాడ మార్గం చేరుకుని ఆర్టీసీ బస్టాండు వరకు నడపాలి. దీని వల్ల అమరావతి రోడ్డులో వివిధ కళాశాలలు, కార్యాలయాలు, ఇన్నర్‌రింగ్‌రోడ్డులో కొత్తగా వచ్చిన కార్యాలయాలు, దుకాణాలు, ఆసుపత్రులు, విజయవాడ రోడ్డులో వివిధ వాణిజ్య సముదాయాలు ఇలా అన్నింటిని కలుపుతూ సర్వీసులు తిరిగితే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. శంకర్‌విలాస్‌కూడలి నుంచి అమరావతి రోడ్డు మీదుగా ఇన్నర్‌రింగ్‌రోడ్డు నుంచి ఆర్టీవో కార్యాలయం, జేకేసీ కళాశాల, కొరిటిపాడు మీదుగా తిరిగి మార్కెట్‌ సెంటర్‌ వరకు సర్వీసులు నడిపితే ఈ మార్గంలో వివిధ పనుల నిమిత్తం వచ్చేవారికి సౌకర్యంగా ఉంటుంది.
* లక్ష్మీపురంలోని బాలీవుడ్‌, హాలీవుడ్‌ థియేటర్ల నుంచి మారుతినగర్‌, స్తంభాలగరువు, తురకపాలెం, పెదపలకలూరు, నల్లపాడు మీదుగా మార్కెట్‌ సెంటర్‌ వరకు సర్వీసులు నడపవచ్చు.
* జేకేసీ కళాశాల నుంచి ఎస్వీఎన్‌కాలనీ, ఉద్యోగనగర్‌, విజ్ఞాన్‌నిరులా కళాశాల, పెదపలకలూరు, రాజీవ్‌గృహకల్ప, దామరపల్లి, పొన్నెకల్లు వరకు నగర సర్వీసులు నడపవచ్చు.
* ఆర్టీసీబస్టాండు నుంచి పాతబస్టాండు, లీలామహల్‌ సెంటర్‌, బోసుబొమ్మ సెంటర్‌, నెహ్రూనగర్‌ గేటు, రెడ్డిపాలెం, ఇన్నర్‌రింగ్‌రోడ్డు, గోరంట్ల మీదుగా మార్కెట్‌ సెంటర్‌ వరకు సర్వీసులు నడపాలి.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని