logo

పట్టుతప్పితే.. ప్రాణాలు గల్లంతే

దారుణంగా దెబ్బతిన్న రహదారి. పాదచారులే ప్రాణాలు అరచేత పట్టుకుని రాకపోకలు సాగించాల్సిన చోట ఇక వాహనదారుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఎదురుగా ద్విచక్ర వాహనం వచ్చినా దిక్కుతోచని స్థితి వాహనదారులది

Published : 28 Mar 2024 06:20 IST

అధ్వానంగా కృష్ణా కరకట్ట రోడ్డు

 

ఈ రహదారిలో వాహనాలు ఎదురైతే ఇంతే

కొల్లూరు, న్యూస్‌టుడే: దారుణంగా దెబ్బతిన్న రహదారి. పాదచారులే ప్రాణాలు అరచేత పట్టుకుని రాకపోకలు సాగించాల్సిన చోట ఇక వాహనదారుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఎదురుగా ద్విచక్ర వాహనం వచ్చినా దిక్కుతోచని స్థితి వాహనదారులది. దీంతో వాహనాలు ఆ రహదారిలో గంటల కొద్దీ సమయం నిలిచిపోవడం నిత్యకృతంగా మారింది. ఈ రహదారి వల్ల ఏటా గాలిలో కలిసిపోయే ప్రాణాలు కొన్నైతే, క్షతగాత్రులు ఎందరో లెక్కే లేదు. ఆరేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. కొల్లూరు - ఈపూరు కరకట్ట రహదారి దుస్థితి ఇది. కేవలం కిలోమీటరు మేర దెబ్బతిన్న ఈ రహదారి నిర్మాణానికి సంబంధిత నదీపరిరక్షణ శాఖ న్యాయపరమైన అడ్డంకులను సాకుగా చూపి కాలం గడుపుతోంది. ప్రజాప్రతినిధులు సైతం కనీసం స్పందించక పోవడం విస్మయం కలిగిస్తోంది. 15సంవత్సరాల క్రితం కృష్ణానది పశ్చిమ కరకట్టపై విజయవాడ నుంచి కొల్లూరు మండలం దోనేపూడి వరకు సుమారు 47 కిలోమీటర్ల మేర నదీ పరిరక్షణ శాఖ తారు రోడ్డు నిర్మాణం చేసింది. దీంతో కొల్లూరు నుంచి విజయవాడ వెళ్లేందుకు దూరం 60 నుంచి 40 కిలోమీటర్లకు తగ్గింది. ఈ రహదారి గుండా ఆర్టీసీ బస్సులను కూడా నడుపుతోంది. ఎనిమిదేళ్ల క్రితం దీన్ని డబుల్‌ రోడ్డుగా నిర్మాణం చేశారు. అయితే కొల్లూరు - ఈపూరు మధ్య కరకట్ట, కాలువ నడుమ ఉన్న భూమిని ఓ మాజీ సైనికుడికి కేటాయించారు. కరకట్ట రహదారి విస్తరణలో భాగంగా కొల్లూరు లాకుల వంతెన నుంచి ఈపూరు వైపు కిలోమీటరు పొడవునా డబుల్‌ రోడ్డు నిర్మాణం చేసేందుకు నదీ పరిరక్షణశాఖ పనులు ప్రారంభించగా ఈ కరకట్ట రహదారి విస్తరణ జరిగితే తనకు కేటాయించిన భూమిని కోల్పోవాల్సి రావడంతో ఆ మాజీ సైనికుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో ఇక్కడ కిలోమీటరు పొడవున విస్తరణ చేసేందుకు న్యాయపరమైన అవరోధాలు ఏర్పడ్డాయి. న్యాయస్థానంలో ఈ వివాదం కొనసాగుతోంది. నిత్యం ఈ రహదారి వెంట ఇసుక రవాణా చేసే వాహనాలతో పాటు వివిధ భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో అంచులు దెబ్బతిని క్రమంగా ప్రయాణానికి వీలు లేని విధంగా తయారయింది. దీంతో ఈ కొద్ది దూరం ప్రయాణించేందుకు వాహనదారులు హడలి పోతున్నారు. ఎదురుగా వచ్చిన వాహనాలు తప్పుకోవాలంటే ప్రాణసంకటంగా మారింది. కొంచెం ఆదమరిస్తే తూర్పు వైపున 20 అడుగులకు పైగా లోతు ఉన్న పొలాల్లో లేదంటే పడమర వైపు ఉన్న కృష్ణా పశ్చిమ బ్రాంచి కాలువలోకి పడిపోయే ప్రమాదం ఉంది. కనీసం మరమ్మతులైనా చేపడితే చాలా వరకు ఇబ్బందులు తప్పుతాయని వాహనదారులు, స్థానికులు మొరపెడుతున్నా ప్రయోజనం లేదు. కనీసం ఇప్పటికైనా మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని వారు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని